Kerala : మృత్యుంజయురాలు..  ఒక్క నీళ్ల బాటిల్‌తో అడవిలో ఒంటరిగా నాలుగు రోజులు

చుట్టూ ఏనుగులు తిరిగే దట్టమైన అడవి.. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షం.. చేతిలో కేవలం అర లీటరు నీళ్ల బాటిల్.. తోడుగా ఎవరూ లేని ఒంటరితనం.. ఇలాంటి భయానక పరిస్థితుల్లో ఎవరైనా ప్రాణాల మీద ఆశ వదులుకుంటారు.

New Update
kerala

చుట్టూ ఏనుగులు తిరిగే దట్టమైన అడవి.. నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షం.. చేతిలో కేవలం అర లీటరు నీళ్ల బాటిల్.. తోడుగా ఎవరూ లేని ఒంటరితనం.. ఇలాంటి భయానక పరిస్థితుల్లో ఎవరైనా ప్రాణాల మీద ఆశ వదులుకుంటారు. కానీ, కేరళకు చెందిన 36 ఏళ్ల శరణ్య మాత్రం నాలుగు రాత్రులు మృత్యువుతో పోరాడి, చిరునవ్వుతో క్షేమంగా తిరిగి వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచారు. కర్ణాటకలోని కొడగు కొండల్లో తప్పిపోయిన ఆమె, తన అచంచలమైన ధైర్యంతో మృత్యుంజయురాలిగా నిలిచారు. 

కర్ణాటకలోని దట్టమైన కొడగు అడవుల్లో తప్పిపోయిన 36 ఏళ్ల కేరళ మహిళ జి.ఎస్. శరణ్య ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. నాలుగు రోజుల పాటు ఆహారం, సరైన నీరు లేకుండా అడవిలో గడిపినప్పటికీ, ఆమె ఏమాత్రం భయం లేకుండా చిరునవ్వుతో రక్షక దళాల ముందుకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కోజికోడ్ జిల్లా నాదాపురంకు చెందిన శరణ్య, తన ధైర్య సాహసాలతో మృత్యువును జయించి తిరిగి వచ్చారు.

ఏప్రిల్ 2వ తేదీన శరణ్య 10 మంది సభ్యుల బృందంతో కలిసి టేడియాండమోల్ శిఖరాన్ని అధిరోహించడానికి బయలుదేరారు. ఉదయం 7 గంటలకు బేస్ క్యాంప్ చేరుకున్న ఆమె, కొండ దిగే క్రమంలో దారి తప్పిపోయారు. తన వెంట కేవలం 500 మి.లీ నీళ్ల బాటిల్ మాత్రమే ఉంది. మొబైల్ సిగ్నల్ లేకపోవడం, కొద్దిసేపటికే ఫోన్ ఛార్జింగ్ అయిపోవడంతో ఆమె ఎవరినీ సంప్రదించలేకపోయారు.

ఆ దట్టమైన అడవిలో ఏనుగుల సంచారం ఎక్కువగా ఉన్నప్పటికీ, భారీ వర్షం కురుస్తున్నప్పటికీ ఆమె ధైర్యం కోల్పోలేదు. "మొదటి రోజు రాత్రి 6:45 వరకు నడిచాను. దారి కనిపించకపోవడంతో ఒక వాగు పక్కన ఖాళీ ప్రదేశంలో ఆగిపోయాను. ఎవరైనా కనిపిస్తారనే ఆశతో ప్రతిరోజూ నడుస్తూనే ఉన్నాను. కానీ నాకు భయం మాత్రం వేయలేదు, ఎందుకో తెలియదు" అని ఆమె మీడియాకు వివరించారు.

భారీ సెర్చ్ ఆపరేషన్:

శరణ్య కనిపించకుండా పోవడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆదేశాల మేరకు తొమ్మిది బృందాలతో భారీ గాలింపు చర్యలు చేపట్టారు. అటవీ శాఖ అధికారులు, యాంటీ నక్సల్ స్క్వాడ్ సభ్యులు, స్థానిక గిరిజనులు, థర్మల్ డ్రోన్ కెమెరాల సాయంతో అడవిని జల్లెడ పట్టారు. చివరకు ఎవరూ వెళ్లని ఒక మారుమూల ప్రాంతంలో స్థానికులు ఆమెను గుర్తించి రక్షించారు.

కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే ఆమెను సాహసవంతురాలు అని కొనియాడారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే కేరళలోని ఆమె ఇంటికి సురక్షితంగా పంపిస్తామని అధికారులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు