Karnataka : కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం :  బూట్లు బంద్.. విద్యార్థులకు చెప్పులు!

కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులకు షూస్ (బూట్లు), సాక్సులకు ప్రత్యామ్నాయంగా చెప్పులు (స్లిప్పర్స్) ఇవ్వాలనే ప్రతిపాదనను అక్కడి పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తోంది.

New Update
students

కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇచ్చే ఉచిత పాదరక్షల పథకంలో ఒక పెద్ద మార్పును తీసుకురావాలని ఆలోచిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో విద్యార్థులకు షూస్ (బూట్లు), సాక్సులకు ప్రత్యామ్నాయంగా చెప్పులు (స్లిప్పర్స్) ఇవ్వాలనే ప్రతిపాదనను అక్కడి పాఠశాల విద్యాశాఖ పరిశీలిస్తోంది. ముఖ్యంగా ఉక్కపోత, విపరీతమైన వర్షాలు పడే ప్రాంతాల్లోని పిల్లలు రోజంతా బూట్లు వేసుకోవడం వల్ల పాదాల ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడుతున్నారనే నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.

స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి బూట్లు మంచిదా లేక చెప్పులు ఇవ్వడం మంచిదా అనే విషయంపై జిల్లాల వారీగా డిప్యూటీ డైరెక్టర్ల నుండి విద్యాశాఖ అధికారులు అభిప్రాయాలను కోరారు. ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే లక్షలాది మంది విద్యార్థుల ఆరోగ్యం, పరిశుభ్రత, సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పులు చేయాలనుకుంటున్నారు.

ముఖ్యంగా వర్షాకాలంలో గంటల తరబడి బూట్లు, సాక్సులు వేసుకోవడం వల్ల అవి తడిసిపోయి రోజంతా అలాగే ఉండిపోతున్నాయని అధికారులు చెప్తున్నారు. దీనివల్ల కాళ్లకు ఫంగల్ ఇన్ఫెక్షన్లు రావడం, కాళ్లు దుర్వాసన రావడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అదే బూట్లకు బదులు చెప్పులు అయితే అటు ఎండాకాలంలోనూ, ఇటు వర్షాకాలంలోనూ పిల్లలకు చాలా సౌకర్యవంతంగా, ప్రాక్టికల్‌గా ఉంటాయని భావిస్తున్నారు. రాష్ట్రమంతటా ఒకే రకమైన విధానాన్ని కాకుండా, స్థానిక వాతావరణానికి తగ్గట్టుగా ఈ నిర్ణయాన్ని మార్చుకునే వెసులుబాటు ఉంటేనే పిల్లలకు ఎక్కువ మేలు జరుగుతుందని విద్యాశాఖ నమ్ముతోంది.

సంక్షేమ పథకాల కింద

ప్రస్తుతం కర్ణాటక ప్రభుత్వం తమ సంక్షేమ పథకాల కింద ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఏటా ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులను ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం గత ఏడాది ప్రభుత్వం 1 నుండి 5వ తరగతి పిల్లలకు రూ. 265, 6 నుండి 8వ తరగతి పిల్లలకు రూ. 295, అలాగే 9, 10 తరగతుల విద్యార్థులకు రూ. 325 చొప్పున కేటాయించింది.

అయితే ఈ ప్రతిపాదన ఇంకా పరిశీలన దశలోనే ఉందని, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. జిల్లాల అధికారుల నుండి వచ్చే నివేదికలు, ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే ఈ పథకంలో మార్పులు చేయాలా వద్దా అనేదానిపై క్లారిటీ రానుంది. ఒకవేళ ఇది అమల్లోకి వస్తే, వాతావరణానికి తగిన పాదరక్షలు దొరకడం వల్ల లక్షలాది మంది విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు తప్పనున్నాయి.

Advertisment
తాజా కథనాలు