Vande Bharat Express: పెరుగులో పురుగులు.. ఇండియన్ రైల్వేస్‌కు భారీ జరిమానా

రైలు ప్రయాణాల్లో ఆహార నాణ్యత అనేది దశాబ్దాలుగా ప్రయాణికులను వేధిస్తున్న సమస్య. అయితే, మోడ్రన్ ఇండియన్ రైల్వేస్ ముఖచిత్రంగా భావించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విషయంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు రావడం అధికారులను అప్రమత్తం చేసింది.

New Update
_ IRCTC fined

రైలు ప్రయాణాల్లో ఆహార నాణ్యత అనేది దశాబ్దాలుగా ప్రయాణికులను వేధిస్తున్న సమస్య. అయితే, మోడ్రన్ ఇండియన్ రైల్వేస్ ముఖచిత్రంగా భావించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విషయంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు రావడం అధికారులను అప్రమత్తం చేసింది. తాజాగా, ప్రయాణికుల నుంచి అందిన ఫిర్యాదుపై స్పందించిన భారతీయ రైల్వే, అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. నాణ్యత లేని ఆహారాన్ని వడ్డించినందుకు గానూ తన సొంత సంస్థ అయిన IRCTCతో పాటు సర్వీస్ ప్రొవైడర్‌పై కఠిన చర్యలు చేపట్టింది.

2026, మార్చి 15న పాట్నా నుండి టాటానగర్ వరకు ప్రయాణించే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ (రైలు నంబర్ 21896) లో ఒక ప్రయాణికుడు తనకు అందించిన ఆహారం నాణ్యతపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. రైల్వే శాఖ ఈ అంశాన్ని కేవలం ఒక సాధారణ ఫిర్యాదుగా చూడకుండా, అత్యంత ప్రాధాన్యత కలిగిన విచారణగా స్వీకరించింది. విచారణలో ఆహార ప్రమాణాలు పాటించలేదని నిర్ధారణ కావడంతో, తక్షణమే శిక్షాత్మక చర్యలకు ఆదేశించింది.

ఈ ఘటనపై విచారణ అనంతరం రైల్వే శాఖ చర్యలు తీసుకుంది. పర్యవేక్షణలో విఫలమైనందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్‌కు రూ. 10 లక్షల జరిమానా విధించింది. నేరుగా ఆహార సరఫరా బాధ్యత వహించే ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్‌పై ఏకంగా రూ. 50 లక్షల జరిమానా విధించింది. అంతటితో ఆగకుండా, సదరు కంపెనీ కాంట్రాక్టును తక్షణమే రద్దు చేయాలని రైల్వే ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ప్రయాణికుల భద్రతే ప్రథమ ప్రాధాన్యత
ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌బోర్డ్ ఫుడ్ ఆపరేషన్‌లలో ఒకటిగా పేరున్న IRCTC, ప్రతిరోజూ దాదాపు 15 లక్షల మందికి పైగా ప్రయాణికులకు భోజన సౌకర్యం కల్పిస్తోంది. ఇంత భారీ నెట్‌వర్క్‌లో నాణ్యత విషయంలో చిన్న పొరపాటు జరిగినా అది వ్యవస్థపై ప్రభావం చూపుతుందని రైల్వే శాఖ స్పష్టం చేసింది. "ప్రయాణికుల భద్రత, సేవల నాణ్యత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోము. ప్రమాణాల ఉల్లంఘన జరిగితే ఎంతటి వారైనా శిక్ష తప్పదు," అని రైల్వే ప్రతినిధి ఈ సందర్భంగా హెచ్చరించారు.

వందే భారత్ వంటి ప్రీమియం రైళ్లలో నాణ్యత విషయంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతో రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికుల్లో హర్షం వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి ఈ కఠిన చర్యలు ఒక హెచ్చరికగా నిలుస్తాయని అధికారులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు