/rtv/media/media_files/2026/05/09/fotojet-2026-05-09-15-26-01.jpg)
Palaniswami gives good news to Vijay
AIADMK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయాలు అత్యంత ఉత్కంఠభరిత మలుపులు తిరుగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (118 స్థానాలు) ఏ పార్టీకీ రాకపోవడంతో తీవ్ర ప్రతిష్ఠంభన నెలకొంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే (AIADMK) ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె. పళనిస్వామి (EPS) శనివారం చేసిన కీలక ప్రకటన తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్‌కు పరోక్షంగా లైన్ క్లియర్ చేస్తూ పళనిస్వామి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందన్న తరుణంలో అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి నయా ప్రభుత్వానికి ముందస్తు శుభాకాంక్షలు తెలుపుతూ లేఖ విడుదల చేశారు. ఈ పరిణామం 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించి, మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న విజయ్ నేతృత్వంలోని 'టీవీకే' (TVK) పార్టీకి పెద్ద ఊరటనిచ్చింది. తాము అధికార పీఠం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని పళనిస్వామి ఈ లేఖ ద్వారా స్పష్టం చేశారు.
గత కొన్ని రోజులుగా పళనిస్వామి మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు తెరవెనుక చక్రం తిప్పుతున్నారనే ప్రచారానికి ఆయన స్వయంగా తెరదించారు. "నేను ముఖ్యమంత్రి రేసులో లేను. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు మా పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు" అని పళనిస్వామి తేల్చిచెప్పారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ తాము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగానే ఉంటామని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో.. కొత్తగా దూసుకొచ్చిన విజయ్ పార్టీ 'టీవీకే'ను అధికారానికి దూరంగా ఉంచేందుకు దశాబ్దాల బద్ధశత్రువులైన డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) చేతులు కలపబోతున్నాయనే ప్రచారం జోరుగా సాగింది. ఒకవేళ అన్నాడీఎంకే (AIADMK) ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకు వస్తే.. బయట నుంచి మద్దతు ఇచ్చేందుకు అధికార డీఎంకే సిద్ధపడిందని, దీని వెనుక బీజేపీ హస్తం కూడా ఉందనే వార్తలు తమిళనాట గుసగుసలకు దారితీశాయి. కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు మద్దతు ప్రకటించడంతో.. డీఎంకే ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు ప్రచారం జరిగింది.
అయితే, డీఎంకే ప్రతిపాదించిన ఈ విచిత్ర కూటమి ప్రయత్నాలకు ఆ పార్టీ మిత్రపక్షాలైన వామపక్షాలు (CPI, CPM), తోల్ తిరుమావళవన్ నేతృత్వంలోని వీసీకే (VCK) పార్టీలు గట్టి షాక్ ఇచ్చాయి. సిద్ధాంతపరంగా బద్ధశత్రువైన అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదా వారికి మద్దతు ఇవ్వడాన్ని లెఫ్ట్, వీసీకే పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. డీఎంకే ప్రతిపాదనకు తాము ఒప్పుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీల నేతలు ఖరాకండిగా చెప్పినట్లు సమాచారం.మిత్రపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, అలాగే డీఎంకేతో జతకడితే ప్రజాక్షేత్రంలో అభాసుపాలవుతామనే ఆందోళనతో అన్నాడీఎంకే ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాల నుంచి పూర్తిగా వెనక్కి తగ్గింది. ఈ నేపథ్యంలోనే పళనిస్వామి తాము సీఎం రేసులో లేమని, ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనే లేదని అధికారికంగా ప్రకటించారు. ఈ తాజా పరిణామాలతో తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం అవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Follow Us