Honeymoon to Family Trip : హనీమూన్‌ను 'ఫ్యామిలీ ట్రిప్'గా మార్చిన భర్త...విడాకులకు సిద్ధమైన భార్య!

కొత్తగా పెళ్లయిన ఒక యువకుడు తన భార్యకు చెప్పకుండా కుటుంబ సభ్యులందరినీ హనీమూన్ ట్రిప్‌కు వెంటబెట్టుకెళ్లాడు. దీంతో తన భర్తతో ఏకాంతంగా గడిపే ప్రైవసీ లేకుండా చేశాడంటూ సదరు వధువు ఏకంగా విడాకులకు సిద్ధపడటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

New Update
FotoJet - 2026-06-09T130009.484

Honeymoon to Family Trip

 Honeymoon to Family Trip : సినిమా వేరు, నిజ జీవితం వేరు అని ఊరికే అనరు. 1999లో వచ్చిన బాలీవుడ్ కుటుంబ కథా చిత్రం ‘హమ్ సాథ్ సాథ్ హైన్’ లో హీరోయిన్ టబు పెళ్లయ్యాక తన భర్తతో పాటు ఉమ్మడి కుటుంబాన్నంతటినీ తీసుకుని హనీమూన్‌కు వెళ్తుంది. వెండితెరపై చూసినప్పుడు ఈ సీన్ ఎంతో ముచ్చటగా అనిపించినా.. రియల్ లైఫ్ లో మాత్రం ఒక నూతన వధువుకు తీవ్ర ఆగ్రహాన్ని, మనోవేదనను మిగిల్చింది. అచ్చం ఆ సినిమా తరహాలోనే కొత్తగా పెళ్లయిన ఒక యువకుడు తన భార్యకు చెప్పకుండా కుటుంబ సభ్యులందరినీ హనీమూన్ ట్రిప్‌కు వెంటబెట్టుకెళ్లాడు. ఈ ఒక్క కారణంతో పెళ్లయిన కొద్దిరోజులకే ఆ సంసారంలో నిప్పులు పోసినట్లయింది. తన భర్తతో ఏకాంతంగా గడిపే ప్రైవసీ లేకుండా చేశాడంటూ సదరు వధువు ఏకంగా విడాకులకు సిద్ధపడటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

ఢిల్లీలోని పటేల్ నగర్‌కు చెందిన ఒక యువకుడికి (సింగపూర్‌లో హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్ పూర్తి చేసి మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు), ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లా రామ్‌రాజ్ ప్రాంతానికి చెందిన ఒక గ్రాడ్యుయేట్ యువతికి ఓ మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అందరు ఆడపిల్లల మాదిరిగానే ఆ వధువు కూడా ఎన్నో ఆశలతో, కొత్త కలలతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. పెళ్లయిన కొత్తలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి హనీమూన్ ఒక మంచి అవకాశమని భావించి, ఆ జంట ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంది.

ట్రిప్ ప్లాన్ అంతా బానే ఉన్నా.. భర్త మాత్రం భార్యకు ముందే చెప్పకుండా ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. భార్యను సంతోషపెట్టాలనో లేదా తన పేరెంట్స్‌ను ఆనందంగా ఉంచాలనో కానీ.. తన తల్లిదండ్రులను, సోదరిని, సోదరుడిని (మరో కథనం ప్రకారం అన్న, వదినలను) కూడా ఆ హనీమూన్ ట్రిప్‌కు వెంటబెట్టుకుని వెళ్లాడు. వివాహ బంధంలో తొలి మధుర ఘట్టాన్ని భర్తతో ఒంటరిగా, ఏకాంతంగా గడిపాలని ఆశించిన ఆ నూతన వధువుకు ఈ పరిణామం తీవ్ర షాక్‌ను, నిరాశను మిగిల్చింది.

ట్రిప్ మొత్తం కుటుంబ సభ్యులు చుట్టూనే ఉండటంతో, భర్తతో మనసు విప్పి మాట్లాడేందుకు గానీ, కనీస ప్రైవసీకి గానీ అవకాశం లేకుండా పోయింది. హనీమూన్ కాస్తా ఫ్యామిలీ పిక్నిక్‌లా మారిపోవడంతో వధువు తీవ్ర అసంతృప్తికి, మనోవేదనకు గురైంది. ట్రిప్ ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాక కూడా అత్తమామల జోక్యం ఎక్కువవడంతో ఆమెలో తనకు స్వేచ్ఛ లేదనే భావన బలపడింది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య గొడవలు ముదిరి, ఇలాంటి భర్తతో తాను కలిసి ఉండలేనంటూ ఆమె నేరుగా విడాకుల కోసం కోర్టు కెక్కింది.

ఎవరి వాదన వారిదే.. కౌన్సిలింగ్ కూడా ఫలించని వైనం

ప్రస్తుతం ఈ వ్యవహారం ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్‌కు చేరింది. అక్కడ కౌన్సిలర్ల ఎదుట ఇరుపక్షాలూ తమ పంతాన్ని వీడకుండా పరస్పర భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు.హనీమూన్ అనేది దంపతుల మధ్య బంధాన్ని బలోపేతం చేసుకునే ప్రత్యేక సమయం. భర్త తన వ్యక్తిగత జీవితాన్ని, ప్రైవసీని అస్సలు గౌరవించలేదు. కుటుంబ సభ్యులందరినీ తీసుకువెళ్లి ఆ సమయాన్ని పాడు చేయడమే కాకుండా, ఇంట్లో కూడా స్వేచ్ఛ లేకుండా చేశారని భార్య వాదించింది. కుటుంబ సభ్యులంతా కలిసి సంతోషంగా గడపాలనే మంచి ఉద్దేశంతోనే వారిని వెంట తీసుకెళ్లాను తప్ప ఇందులో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేదు. ఒక మంచి పనిని భార్య ఇంత పెద్ద వివాదంగా మార్చడం సరికాదు. అని భర్త వాదిస్తున్నారు.

ఈ దంపతుల మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించేందుకు కుటుంబ కౌన్సిలింగ్ సెంటర్ అధికారులు ఇప్పటివరకు మూడు రౌండ్ల పాటు చర్చలు జరిపారు. అయినప్పటికీ ఇద్దరి ఆలోచనల మధ్య వ్యత్యాసం వల్ల ఎలాంటి రాజీ కుదరలేదు. భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడానికి కౌన్సిలర్లు వారికి మరికొంత సమయం ఇచ్చినప్పటికీ, వధువు వైఖరిలో మార్పు రాకపోతే ఈ వ్యవహారం త్వరలోనే విడాకుల దావాల వైపు వెళ్లేలా కనిపిస్తోంది. చిన్న చిన్న అంచనాలు, ఆలోచనా విధానాల వ్యత్యాసాల వల్లే పెళ్లయిన కొద్దిరోజులకే ఒక బంధం ముక్కలయ్యే స్థాయికి చేరడం గమనార్హం.

Advertisment
తాజా కథనాలు