Dubai : దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయ కార్మికులు మృతి

దుబాయ్‌లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురు భారతీయ కార్మికుల ప్రాణాలను బలితీసుకుంది. దుబాయ్ ఎమిరేట్స్ రోడ్డుపై జరిగిన ఈ భయానక ప్రమాదంలో మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనను దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారికంగా ధృవీకరించింది.

New Update
FotoJet - 2026-06-09T095041.343

Road accident in Dubai

Dubai : దుబాయ్‌లో జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఏడుగురు భారతీయ కార్మికుల ప్రాణాలను బలితీసుకుంది. దుబాయ్ ఎమిరేట్స్ రోడ్డుపై జరిగిన ఈ భయానక ప్రమాదంలో మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనను దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం (Consulate General of India in Dubai) అధికారికంగా ధృవీకరించింది. విదేశాల్లో కూలీ పనులకై వెళ్లి, ఇలా అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో భారతీయులు మరణించారనే వార్త వారి స్వస్థలాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

దుబాయ్ ట్రాఫిక్ పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. సాంకేతిక లోపం కారణంగా ఒక భారీ ట్రక్కు ఎమిరేట్స్ రోడ్డు మధ్యలో హఠాత్తుగా ఆగిపోయింది. అదే సమయంలో కార్మికులతో వెళ్తున్న ఒక మినీ బస్సు డ్రైవర్, ముందున్న వాహనాన్ని సరిగ్గా గమనించకపోవడం, సురక్షితమైన దూరాన్ని పాటించకపోవడంతో ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుండి అత్యంత వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. అక్కడికక్కడే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, గాయపడిన తొమ్మిది మందిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన భారత రాయబార కార్యాలయ అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న భారతీయ పౌరులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షిస్తున్నారు. బాధితులకు, వారి కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు దుబాయ్ పోలీస్, స్థానిక ఆరోగ్య శాఖ అధికారులతో రాయబార కార్యాలయ సిబ్బంది నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కాన్సులేట్ జనరల్ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు తమ గాఢ సానుభూతిని తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల పూర్తి వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది. తమ వారి సమాచారం కోసం భారత్‌లో ఉన్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు