/rtv/media/media_files/2026/02/10/assam-cm-himanta-biswa-sarma-2026-02-10-18-55-21.jpg)
Assam CM Himanta Biswa Sarma
అస్సాంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని ప్రభుత్వం మంత్రివర్గాన్ని విస్తరించడానికి సిద్ధమైంది. జూన్ 5వ తేదీన కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించి, హిమంత బిశ్వ శర్మ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. జూన్ 5న అస్సాం ప్రభుత్వ మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని పేర్కొన్నారు.
ఈ విస్తరణలో సుమారు 8 నుండి 9 మంది ఎమ్మెల్యేలకు క్యాబినెట్ మంత్రులుగా అవకాశం దక్కనుంది. వీరితో పాటు ఇద్దరికి రాష్ట్ర మంత్రులుగా కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈసారి శర్మ క్యాబినెట్‌లో చాలా మంది కొత్త ముఖాలు కనిపించబోతున్నాయని తెలుస్తోంది. బరాక్ వ్యాలీ ప్రాంతం నుండి కొందరికి, ఎగువ అస్సాంప్రాంతం నుండి ఇద్దరు ముగ్గురు కొత్తవారికి మంత్రివర్గంలో చోటు కల్పించనున్నారు. సీనియర్లతో పాటు కొత్తవారికి కూడా ఈ జాబితాలో సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. బీజేపీతో పాటు దాని మిత్రపక్షాలకు కూడా ఇందులో భాగస్వామ్యం లభించనుంది.
వరుసగా మూడోసారి అధికారంలోకి
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అస్సాంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చింది. మొత్తం 126 సీట్లకు గాను 102 స్థానాలను గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఇందులో ఒంటరిగానే బీజేపీ 82 సీట్లు సాధించగా.. దాని మిత్రపక్షాలైన అసోం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ తలో 10 సీట్లు గెలుచుకున్నాయి. ఈ విజయంతో మే 12న హిమంత బిశ్వ శర్మ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వంటి అగ్రనేతలు ఈ వేడుకకు హాజరయ్యారు.
ప్రస్తుతం అస్సాం క్యాబినెట్‌లో ముఖ్యమంత్రితో పాటు కేవలం నలుగురు మంత్రులు మాత్రమే ఉన్నారు. బీజేపీ నుంచి అజంతా నియోగ్, రామేశ్వర్ తేలి.. ఏజీపీ నుంచి అతుల్ బోరా, బీపీఎఫ్ నుంచి చరణ్ బోరోలు గతంలోనే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతం అస్సాం క్యాబినెట్‌లో గరిష్టంగా 18 నుండి 19 మంది మంత్రులు ఉండే అవకాశం ఉందని, పార్టీ హైకమాండ్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని సీఎం శర్మ ముందే చెప్పారు. ఈ క్రమంలోనే శర్మ శనివారం ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి అస్సాంలో కొత్త ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ఈ చర్చల తర్వాతే క్యాబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది.
Follow Us