Sand Storm : రాజస్థాన్‌లో విరుచుకుపడిన ఇసుక తుపాన్..వెనువెంటనే కుండపోత వర్షం..కారణం ఏంటో తెలుసా?

రాజస్థాన్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎడారి రాష్ట్రంలో శనివారం ప్రకృతి విచిత్ర రూపాన్ని ప్రదర్శించింది.పలు ప్రాంతాల్లో మొదట ఊహించని విధంగా భీకర ఇసుక తుపాను విరుచుకుపడగా, ఆ మరుక్షణమే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షం ముంచెత్తింది.

New Update
FotoJet (53)

Massive black and yellow sandstorm engulfs Churu in Rajasthan

Sand Storm :  రాజస్థాన్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తీవ్రమైన వడగాల్పులు, ఎండలతో అల్లాడుతున్న ఎడారి రాష్ట్రంలో శనివారం మధ్యాహ్నం ప్రకృతి విచిత్ర రూపాన్ని ప్రదర్శించింది. రాష్ట్రంలోని చురు, శ్రీగంగానగర్‌, బికనీర్‌, సీకర్‌తో పాటు పలు ప్రాంతాల్లో మొదట ఊహించని విధంగా భీకర ఇసుక తుపాను (Sand Storm) విరుచుకుపడగా, ఆ మరుక్షణమే ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షం ముంచెత్తింది. ఎడారి ప్రాంతంలో ఇసుక తుపాన్లు రావడం సహజమే అయినా, అది వచ్చిన కొద్ది నిమిషాలకే ఈ స్థాయిలో భారీ వర్షం కురవడం స్థానికులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది.

ఈ వింత వాతావరణ మార్పు వెనుక బలమైన వాతావరణ శాస్త్రం (Meteorology) దాగి ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. శాస్త్రవేత్తల ప్రకారం ఈ పరిస్థితిని 'హబూబ్' (Haboob) లేదా థండర్ స్టార్మ్ అవుట్‌ఫ్లో అని పిలుస్తారు. వేసవి తీవ్రతకు భూమి బాగా వేడెక్కినప్పుడు ఆకాశంలో భారీ ఉరుము మేఘాలు (Cumulonimbus Clouds) ఏర్పడతాయి. ఈ మేఘాల నుంచి వర్షం పడే ముందు, వాటిలోని అత్యంత చల్లని గాలి విపరీతమైన వేగంతో భూమి వైపు దూసుకొస్తుంది. ఈ చల్లని గాలులు నేలను తాకినప్పుడు, ఎడారిలోని పొడి ఇసుకను వందల అడుగుల ఎత్తుకు లేపడం వల్ల భారీ ఇసుక గోడలా ఏర్పడి, వర్షం కంటే ముందే తుపానులా దూసుకుపోతుంది.

ఇలా గాల్లోకి లేచిన ఇసుక రేణువులు మేఘాలలోని నీటి ఆవిరి త్వరగా ఘనీభవించడానికి (Cloud Condensation Nuclei) ఉత్ప్రేరకంగా సహాయపడతాయి. దీనివల్ల నీటి చుక్కల పరిమాణం వేగంగా పెరిగి, ఇసుక తుపాను వెనువెంటనే విపరీతమైన ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. ఈ ప్రక్రియ కారణంగానే రాజస్థాన్‌లోని పలు ప్రాంతాల్లో దుమ్ము, వర్షపు చుక్కలు కలిసి ‘మట్టి వర్షం' (Mud Rain) కూడా కురిసింది. ఈ హఠాత్తు పరిణామంతో అటు ఇసుక తుపాను, ఇటు భారీ వర్షం ఒకేసారి ముంచెత్తడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

రాష్ట్రంలోని చురు జిల్లాతో పాటు తారానగర్ తహసీల్, మెహరి గ్రామాల్లో ఈ తుపాను బీభత్సం స్పష్టంగా కనిపించింది. దట్టమైన మేఘాల రూపంలో ఇసుక ఆవరించడంతో మధ్యాహ్నం వేళలోనే ఒక్కసారిగా చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. సుమారు అరగంట పాటు ప్రజలు అంధకారంలో వణికిపోయారు. అంతకుముందు శుక్రవారం సాయంత్రం జైపుర్‌లోనూ ఇదే విధమైన వాతావరణం కనిపించగా, ధోల్‌పుర్‌ జిల్లాలో అత్యధికంగా 5.8 సెం.మీ వర్షపాతం నమోదైంది. జైపుర్ అగునా మొహల్లాలోని సంచియా మాతా ఆలయం ముందున్న శతాబ్దాల నాటి భారీ వేపచెట్టు వేళ్లతో సహా పెకలించుకుని రోడ్డుపై కూలిపోయింది. అయితే ప్రమాద సమయంలో అక్కడెవరూ లేకపోవడంతో భారీ ప్రాణనష్టం తప్పింది.

సోషల్ మీడియాలో ఈ భీకర ఇసుక తుపాను, అంధకారానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ హఠాత్ పరిణామాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడినప్పటికీ, కొద్దిరోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వడగాల్పులతో సతమతమవుతోన్న రాజస్థాన్ ప్రజలకు ఈ వర్షం పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. తుపాను తదనంతరం కురిసిన భారీ వర్షం కారణంగా రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయి వాతావరణం చల్లబడింది.

రాష్ట్రంలో ఈ తరహా వాతావరణం మరో నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉందని జైపుర్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. జైపుర్‌, అజ్‌మేర్‌, బికనీర్‌, కోటా, జోధ్‌ఫుర్‌, భరత్‌పూర్, ఉదయ్‌పుర్‌ డివిజన్లలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వడగండ్ల వాన పడే అవకాశం కూడా ఉందని, ప్రజలు వాతావరణ హెచ్చరికల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

Advertisment
తాజా కథనాలు