గవర్నమెంట్ టీచర్లకు కొత్త డ్యూటీ.. వీధి కుక్కల్ని లెక్కించాలని సర్కార్ వింత ఆదేశాలు

గుజరాత్‌లోని BJP సర్కార్ పాఠశాల టీచర్లకు వీధి కుక్కల వివరాలను సేకరించి, సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశాలు పంపింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సాకుగా చూపుతూ, ఈ పనిని ఎమర్జెన్సీగా భావించి కేవలం 3 రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

New Update
Gujarat government

గుజరాత్‌లోని BJP సర్కార్ పాఠశాల టీచర్లకు అప్పగించిన కొత్త బాధ్యతలు ఇప్పుడు ఆ రాష్ట్రంలో పెద్ద వివాదానికి దారితీసింది. పాఠశాల ప్రాంగణాల్లో, పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న వీధి కుక్కల వివరాలను సేకరించి, సమగ్ర నివేదిక సమర్పించాలని విద్యాశాఖ ఈ నెల 11న సర్క్యులర్‌ను జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలను సాకుగా చూపుతూ, ఈ పనిని ఎమర్జెన్సీగా భావించి కేవలం 3 రోజుల్లోనే పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రభుత్వ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ఇప్పటికే బోధనతో పాటు ఇతర విద్యేతర పనులతో తాము సతమతమవుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల లెక్కింపు, ప్రభుత్వ సభలకు జనాన్ని సమీకరించడం, ఎన్నికల విధులు మరియు వివిధ రకాల సర్వేలతో తమ అసలు పని అయిన 'బోధన' కుంటుపడుతోందని వారు వాదిస్తున్నారు. ఇప్పుడు వీధి కుక్కల గణన కూడా తమకే అప్పగించడం ఉపాధ్యాయ వృత్తిని కించపరచడమేనని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కూడా జోక్యం చేసుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ దోషి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను కేవలం డేటా రికవరీ యంత్రాలుగా మార్చడం సరికాదని హితవు పలికారు. ఇప్పటికే అనేక అదనపు పనులతో ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారని, ఈ కుక్కల సర్వే ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, లేనిపక్షంలో విద్యా ప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మొత్తానికి, విద్యాశాఖ జారీ చేసిన ఈ వింత సర్క్యులర్ ఇప్పుడు గుజరాత్ రాజకీయాల్లో, విద్యా వర్గాల్లో పెను దుమారం రేపుతోంది.

Advertisment
తాజా కథనాలు