/rtv/media/media_files/2026/06/09/driving-licence-2026-06-09-15-28-27.jpg)
దేశంలోని కోట్ల మంది డ్రైవింగ్ లైసెన్స్ దారులకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక పెద్ద ఊరటనిచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ గడువును 20 ఏళ్ల నుండి ఏకంగా 50 ఏళ్లకు పెంచేలా ఒక సరికొత్త ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనివల్ల ప్రజలు పదే పదే లైసెన్స్ రినైవల్ చేసుకోవాల్సిన తిప్పలు తప్పుతాయి.
మంత్రిత్వ శాఖ పరిశీలనలో ప్రస్తుతం అనేక ప్రతిపాదనలు ఉన్నాయని, అందులో డ్రైవింగ్ లైసెన్స్ కాలపరిమితిని పెంచడం కూడా ఒకటని అధికారులు స్పష్టం చేశారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు.
ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం ఒక డ్రైవింగ్ లైసెన్స్ 20 సంవత్సరాల పాటు చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత లైసెన్స్ దారులు మళ్లీ దరఖాస్తు చేసుకుని, కొన్ని సందర్భాల్లో హెల్త్ సర్టిఫికేట్‌తో సహా అవసరమైన పత్రాలను సమర్పించి రినైవల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ గడువును 50 ఏళ్లకు పెంచడం ద్వారా లైసెన్స్ ప్రక్రియను మరింత సులభతరం చేయాలని, ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత సులువుగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఆదాయం ఎక్కడ తగ్గిపోతుందోనని
అయితే, లైసెన్స్ రినైవల్స్ తగ్గిపోవడం వల్ల తమకు వచ్చే ఆదాయం ఎక్కడ తగ్గిపోతుందోనని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కానీ, ఈ మార్పులు చేయడం వల్ల రాష్ట్రాలకు పెద్దగా ఆదాయ నష్టం ఏమీ ఉండదని కేంద్ర అధికారులు చెబుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి లేదా రినైవల్ చేసుకోవడానికి చెల్లించే ఫీజులను ఆన్‌లైన్ ద్వారానే వసూలు చేసుకోవచ్చని, దీనివల్ల రాష్ట్రాల ఆదాయ మార్గాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు వివరించారు.
కేవలం డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కాకుండా, వాహనాల యాజమాన్య మార్పిడి, పర్మిట్ రినైవల్స్ వంటి సేవలను కూడా పూర్తిగా ఆన్‌లైన్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోంది. దీనివల్ల కాగితాల వాడకం తగ్గడంతో పాటు, చిన్న చిన్న పనుల కోసం ప్రజలు రవాణా శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పుతుంది.
ఇక ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే డ్రైవర్లను అదుపు చేయడానికి కూడా ప్రభుత్వం ఒక ప్లాన్ చేస్తోంది. రూల్స్ బ్రేక్ చేసిన వారికి నెగెటివ్ పాయింట్లు ఇచ్చి, వాటి ఆధారంగా లైసెన్స్‌ను సస్పెండ్ చేయడం లేదా రద్దు చేయడం వంటి వ్యవస్థను తీసుకొస్తే తప్పు చేసే డ్రైవర్లను సమర్థవంతంగా నియంత్రించవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. కాకపోతే ఈ ప్రతిపాదనను ఎప్పటి నుండి అమలు చేస్తారనే దానికి సంబంధించి మంత్రిత్వ శాఖ ఎలాంటి సమయాన్ని ప్రకటించలేదు. ఈ చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని అధికారులు స్పష్టంగా చెప్పారు.
Follow Us