Google Data Centre : ఢిల్లీ డేటా సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం.. గూగుల్ క్లౌడ్ సేవలకు బ్రేక్

భారత్‌లో గూగుల్ క్లౌడ్‌ సేవలకు భారీ అంతరాయం ఏర్పడింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఒక థర్డ్‌ పార్టీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో నెట్‌వర్కింగ్ పరికరాలు షట్‌డౌన్ అయ్యాయి. ఫలితంగా దేశంలోని పలు ప్రాంతాల్లో క్లౌడ్‌ సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.

New Update
FotoJet - 2026-06-10T143740.343

Google Data Centre : భారత్‌లో గూగుల్ క్లౌడ్‌ సేవలకు భారీ అంతరాయం ఏర్పడింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఈ సంస్థకు చెందిన ఒక థర్డ్‌ పార్టీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం సంభవించడంతో నెట్‌వర్కింగ్ పరికరాలు అత్యవసరంగా షట్‌డౌన్ అయ్యాయి. ఫలితంగా దేశంలోని పలు ప్రాంతాల్లో క్లౌడ్‌ సేవలకు తీవ్ర ఆటంకం ఏర్పడినట్లు గూగుల్ క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అయితే, ఈ ప్రమాదం సరిగ్గా ఎప్పుడు జరిగింది, దీని వల్ల ప్రాణ, ఆస్తి నష్టం ఎంత అనే విషయాలపై స్పష్టమైన వివరాలను సంస్థ ఇంకా ప్రకటించలేదు.

ఈ హఠాత్ పరిణామం వల్ల బుధవారం దేశవ్యాప్తంగా పలుచోట్ల గూగుల్ క్లౌడ్ వినియోగదారులు తీవ్ర నెట్‌వర్క్ సమస్యలను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాలతో పాటు పలు ప్రాంతాల్లో నెట్‌వర్క్ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోయింది. దీనివల్ల వినియోగదారులు అధిక లేటెన్సీ (డేటా ఆలస్యం కావడం), ప్యాకెట్ లాస్ వంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ సాంకేతిక లోపాల కారణంగా క్లౌడ్ ఆధారిత యాప్‌లు, వెబ్‌సైట్ల పనితీరు మందగించింది.

సమస్య తీవ్రతను తగ్గించేందుకు గూగుల్ తక్షణ చర్యలు చేపట్టింది. ప్రభావితమైన ఢిల్లీ కేంద్రం నుండి నెట్‌వర్క్ ట్రాఫిక్‌ను ఇతర సురక్షిత ప్రాంతాలకు మళ్లించింది. అయినప్పటికీ, ట్రాఫిక్ లోడ్ పెరగడంతో కొంతమంది వినియోగదారులకు కనెక్టివిటీ నెమ్మదించడం, సేవలలో అంతరాయాలు తప్పలేదు. ఇలాంటి క్లౌడ్ అంతరాయాల వల్ల గూగుల్ క్లౌడ్‌ను నమ్ముకున్న వందలాది కంపెనీల రోజువారీ డిజిటల్ కార్యకలాపాలు నెమ్మదించి ఇబ్బందుల్లో పడ్డాయి.

ప్రస్తుతం ఈ నెట్‌వర్క్ సమస్యను పూర్తిగా పరిష్కరించి, సేవలను యథావిధిగా పునరుద్ధరించేందుకు గూగుల్ ఇంజినీర్ల బృందం ముమ్మరంగా శ్రమిస్తోంది. ప్రస్తుతం క్లౌడ్ మార్కెట్లో అమెజాన్ వెబ్‌ సర్వీసెస్ (AWS), మైక్రోసాఫ్ట్ అజూర్‌ (Azure) వంటి దిగ్గజ సంస్థల నుండి గూగుల్ క్లౌడ్‌కు గట్టి పోటీ నెలకొన్న తరుణంలో, ఇలాంటి అగ్నిప్రమాదాలు, సేవల నిలిపివేత సంస్థకు పెద్ద సవాలుగా మారాయి.

Advertisment
తాజా కథనాలు