/rtv/media/media_files/2025/02/01/R5hlEEqsLRiA5ENLJMx7.jpg)
Donald Trump
Big shock for Trump : అమెరికాలో చట్టబద్ధంగా స్థిరపడాలని కలలు కంటున్న వేలాది మంది వలసదారులకు అమెరికా ఫెడరల్ కోర్టు భారీ ఊరటనిచ్చింది. గ్రీన్‌కార్డులు, వర్క్ పర్మిట్లు, పౌరసత్వ దరఖాస్తులను నిలిపివేస్తూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠిన నిబంధనలు చెల్లుబాటు కావంటూ రోడ్ ఐలాండ్‌లోని ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి జాన్ మెక్‌కానెల్ కీలక తీర్పు ఇచ్చారు. "జాతీయ భద్రత" పేరుతో ప్రభుత్వం తనకు లేని అధికారాలను ఉపయోగించి దరఖాస్తుదారులను ఇబ్బంది పెట్టడం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. చట్టప్రకారం అన్ని పత్రాలు సమర్పించి, ఫీజులు చెల్లించి, బయోమెట్రిక్ పూర్తి చేసిన వారిని నిరవధికంగా వేచి ఉండేలా చేయడం అన్యాయమని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
ఈ వివాదానికి మూలం 2025లో వాషింగ్టన్ డీసీలో ఇద్దరు నేషనల్ గార్డ్ సభ్యులపై జరిగిన కాల్పుల ఘటన. ఈ కేసులో అరెస్టయిన నిందితుడు అఫ్గానిస్థాన్‌కు చెందినవాడు కావడంతో, ట్రంప్ ప్రభుత్వం జాతీయ భద్రతను కారణం చూపుతూ "ట్రావెల్ బ్యాన్" పరిధిని ఏకంగా 39 దేశాలకు విస్తరించింది. ఈ దేశాల పౌరుల గ్రీన్‌కార్డులు, ఉద్యోగ అనుమతులు, పౌరసత్వ దరఖాస్తులను నిలిపివేయడంతో పాటు ఆశ్రయం (అసైలమ్) కోరిన వారి కేసులను కూడా తాత్కాలికంగా ఆపేసింది. ఇప్పటికే ఆమోదించిన కొన్ని కేసులను కూడా పునఃసమీక్షించాలని ఆదేశించింది. తాజాగా కోర్టు ఈ నాలుగు ప్రధాన విధానాలను చట్టవిరుద్ధమని తేల్చడంతో ఆసియా, ఆఫ్రికా దేశాల వలసదారులకు పెద్ద ఉపశమనం లభించింది.
ఒకవైపు కోర్టు తీర్పుతో వలసదారులకు ఊరట లభించగా, మరోవైపు హెచ్-1బీ (H-1B) వీసాలపై అమెరికా కాంగ్రెస్‌లో కొత్త ముసాయిదా బిల్లు కలకలం రేపుతోంది. గ్రీన్‌కార్డులు పొందేందుకు హెచ్-1బీ వీసా వ్యవస్థ దుర్వినియోగం అవుతోందని ఆరోపిస్తూ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు చిప్ రాయ్ ‘అమెరికన్ వైట్-కాలర్ వర్కర్ జాబ్స్’ పేరిట ఒక బిల్లును ప్రవేశపెట్టారు. దీనితో పాటు, విదేశీ విద్యార్థులు చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో పనిచేసేందుకు వీలు కల్పించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) కార్యక్రమాన్ని కూడా పూర్తిగా రద్దు చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు.
గత నలభై ఏళ్లుగా ఉన్న హెచ్-1బీ వీసా విధానం వల్ల చౌకైన విదేశీ కార్మికులు అమెరికాకు వస్తున్నారని, దీనివల్ల అమెరికన్ STEM (Science, Technology, Engineering, and Mathematics) రంగాల అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు దక్కడం లేదని చిప్ రాయ్ ఆరోపించారు. ప్రస్తుత లాటరీ ఆధారిత విధానాన్ని రద్దు చేసి, దాని స్థానంలో కేవలం ప్రతిభ (Merit), వాస్తవ వేతన ప్రమాణాల ఆధారంగా అమెరికన్ వైట్-కాలర్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చే కొత్త వ్యవస్థను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లుకు యూఎస్ టెక్ వర్కర్స్, ఫెడరేషన్ ఫర్ అమెరికన్ ఇమిగ్రేషన్ రిఫార్మ్ వంటి సంస్థలు మద్దతు ప్రకటించాయి.
హెచ్-1బీ నిబంధనలు కఠినతరం అవుతుండటంతో అమెరికాలోని భారతీయ ఐటీ నిపుణులలో ఆందోళన మొదలైంది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ పిగోట్ స్పందిస్తూ స్పష్టతనిచ్చారు. తమ దేశ వీసా చట్టాలు ఏ ఒక్క దేశాన్ని లేదా ప్రత్యేకంగా భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని చేసినవి కావు అని స్పష్టం చేశారు. "గత ప్రభుత్వాలు వీసా చట్టాలను కచ్చితంగా అమలు చేయలేదు, కానీ ప్రస్తుత ప్రభుత్వం చట్టాన్ని పక్కాగా అమలు చేస్తోంది. ఈ నిబంధనలు అన్ని దేశాలకూ సమానంగా వర్తిస్తాయి" అని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఆర్థిక వృద్ధిలో భారతీయుల పాత్ర ఎనలేనిదని, యూఎస్‌లోని దాదాపు 96 యూనికార్న్ స్టార్టప్‌లలో భారతీయుల భాగస్వామ్యం ఉందనే విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి.
ప్రస్తుతానికి ఫెడరల్ కోర్టు తీర్పు ట్రంప్ ప్రభుత్వ కఠిన వలస విధానాలకు గట్టి ఎదురుదెబ్బగా మారింది. చట్టబద్ధమైన వలస మార్గాలను రక్షించడంలో ఈ తీర్పు కీలకమైంది. అయితే, ట్రంప్ ప్రభుత్వం ఈ తీర్పును ఉన్నత న్యాయస్థానం (సుప్రీంకోర్టు)లో సవాలు చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. అమెరికాలో వలసలపై జరుగుతున్న ఈ రాజకీయ, న్యాయ పోరాటాలు రాబోయే రోజుల్లో ఏ మలుపు తిరుగుతాయోనని, కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టిన బిల్లులు చట్ట రూపం దాల్చుతాయా లేదా అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ నిపుణులు, వలసదారులు ఉత్కంఠగా గమనిస్తున్నారు.
Follow Us