EPF Interest Rate : ఈపీఎఫ్ చందాదారులకు గుడ్‌ న్యూస్‌..పీఎఫ్‌ వడ్డీ జమకు మోక్షం

కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ చందాదారులకు తీపి కబురు అందించింది. లక్షలాది మంది ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రావిడెంట్ ఫండ్ (PF) వార్షిక వడ్డీ జమ ప్రక్రియకు ఎట్టకేలకూ మోక్షం లభించింది.

New Update
EPFO

EPF Interest Rate

EPF Interest Rate : కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ చందాదారులకు తీపి కబురు అందించింది. లక్షలాది మంది ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రావిడెంట్ ఫండ్ (PF) వార్షిక వడ్డీ జమ ప్రక్రియకు ఎట్టకేలకూ మోక్షం లభించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) ప్రతిపాదించిన వడ్డీ రేట్లకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా ఆమోద ముద్ర వేసింది. ఈ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలోకి ఈ నెలాఖరు నాటికే వడ్డీ డబ్బులు చేరనున్నాయి.

గత మార్చి 2వ తేదీన సమావేశమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను చందాదారులకు 8.25 శాతం వార్షిక వడ్డీని అందించాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. సీబీటీ చేసిన ఈ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా ఆమోదించింది. విశేషం ఏమిటంటే, పీఎఫ్ ఖాతాదారులకు వరుసగా మూడో ఏడాది కూడా ఇదే 8.25 శాతం వడ్డీ రేటు కొనసాగుతుండటం గమనార్హం. స్థిరమైన వడ్డీ లభిస్తుండటంతో ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది.

సాధారణంగా సీబీటీ సిఫార్సు చేసిన వడ్డీ రేట్లను ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలించి, నోటిఫై చేయాల్సి ఉంటుంది. గత ఏడాది మే 24వ తేదీనే కేంద్రం ఈ ప్రక్రియను పూర్తి చేయగా, ఈసారి మాత్రం దాదాపు నెల రోజులు ఆలస్యంగా ఆమోదం తెలిపింది. అయినప్పటికీ, ఈ నెలాఖరు లోపే చందాదారుల ఖాతాల్లో వడ్డీ సొమ్ము జమ అవుతుందని పీఎఫ్ వర్గాలు స్పష్టం చేశాయి. గతంలో కేంద్రం ఆమోదించిన తర్వాత కూడా ఖాతాల్లో డబ్బులు పడటానికి చాలా సమయం పట్టేది. కానీ ప్రస్తుతం ఈపీఎఫ్ఓ సరికొత్త సాంకేతిక ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడంతో, ఈసారి ఎలాంటి ఆలస్యం లేకుండా తక్షణమే నిధులు జమ కానున్నాయి.

ఆర్థిక సంవత్సరం ముగిసి మూడు నెలలు కావస్తున్నా వడ్డీ జమ కాకపోవడంతో, దీనివల్ల చక్రవడ్డీ (Compound Interest) ప్రయోజనాన్ని కోల్పోతామేమోనని కొందరు చందాదారులు ఆందోళన చెందుతున్నారు. అయితే అలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని భవిష్య నిధి సంస్థ (EPFO) స్పష్టం చేసింది. ఈపీఎఫ్ నిల్వలపై ఆర్థిక సంవత్సరం మొదటి రోజు నుండి చివరి రోజు వరకు ఏ నెలకు ఆ నెల వడ్డీని లెక్కిస్తారు. ఇలా నెలవారీగా లెక్కించిన మొత్తాన్ని ఆర్థిక సంవత్సరం చివరన ఒకేసారి ఖాతాలో జమ చేస్తారు. కాబట్టి కేంద్రం ప్రక్రియ ఆలస్యమైనా చందాదారులకు వచ్చే వడ్డీ లాభంలో ఎలాంటి నష్టమూ ఉండదు.

అయితే, ఈపీఎఫ్ వడ్డీ చెల్లింపుల్లో కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. ఉద్యోగులు తమ ఖాతాల నుండి ఏవైనా విత్‌డ్రాలు (డబ్బులు వెనక్కి తీసుకోవడం) చేసి ఉంటే, ఆ మేరకు లభించే వడ్డీ పరిమాణం తగ్గుతుంది. అలాగే, దీర్ఘకాలంగా ఎలాంటి లావాదేవీలు జరగకుండా నిలిచిపోయిన (Inoperative Accounts) పాత ఖాతాలకు ఈపీఎఫ్ఓ ఎలాంటి వడ్డీని చెల్లించదు. నిరంతరం యాక్టివ్‌గా ఉండే ఉద్యోగుల ఖాతాలకు మాత్రమే ఈ చక్రవడ్డీ ప్రయోజనం పూర్తిగా అందుతుందని సంస్థ పేర్కొంది.

గడచిన దశాబ్ద కాలంలో ఈపీఎఫ్ వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులను పరిశీలిస్తే.. 2015-16 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 8.8 శాతం వడ్డీని అందించారు. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చి 2019-20లో 8.50 శాతానికి, కరోనా సమయం (2020-21) లో ఇటీవల కాలంలోనే అత్యల్పంగా 8.10 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ కోలుకుని 2022-23లో 8.15 శాతానికి చేరింది. ఆ మరుసటి ఏడాది నుండి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా వడ్డీ రేటును 8.25 శాతానికి పెంచారు. గత మూడేళ్లుగా ఇదే గరిష్ట వడ్డీ రేటును కేంద్రం విజయవంతంగా కొనసాగిస్తూ వస్తోంది.

Advertisment
తాజా కథనాలు