![jeethadani](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/02/06/TDeTdffqof9uwDlh09zT.jpg)
jeethadani
ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ వివాహం ఎంతో ఘనంగా మరో రెండు రోజుల్లో జరగబోతుంది. ప్రముఖ వజ్రాల వ్యాపారి కుమార్తె దివా జైమిన్ షాను జీత్ అదానీ ఫిబ్రవరి 7వ తేదీన పెళ్లి చేసుకోబోతుండగా.. ఓ అద్బుతమైన కార్యక్రమాన్ని అదానీ కుటుంబ సభ్యులు ప్రారంభించారు. ముఖ్యంగా ఆయన పెళ్లి వేళ.. దివ్యాంగులైన ఆడ పిల్లల పెళ్లిళ్ల కోసం ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. ఒక్కో అమ్మాయికి 10 లక్షల రూపాయలు అందజేస్తాననన్నారు.
ఈ విషయాన్ని జీత్ తండ్రి గౌతమ్ అదానీయే స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు.జీత్ అదానీ గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షాను పెళ్లి చేసుకోబోతున్నారు. 2023లో వీరికి నిశ్చితార్థం జరగ్గా.. రెండేళ్ల తర్వాత అంటే 2025 ఫిబ్రవరి 7వ తేదీన వీరి పెళ్లి జరగబోతుంది. అయితే పెళ్లి సమయంలోనే జీత్ అదానీ ఓ అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆయన తండ్రి గౌతమ్ అదానీ వెల్లడించారు.
ఎక్స్ వేదికగా గౌతమ్ అదానీ ఓ పోస్టు చేశారు. అందులో జీత్ అదానీ, దివా జైమిన్ షాలు పవిత్ర సంకల్పంతో వారి వైవాహిక జీవితాన్ని ప్రారంభిస్తున్నారని వివరించారు. ఈక్రమంలోనే జీత్ అదానీ ప్రతి ఏటా 500 మంది దివ్యాంగ ఆడ పిల్లలకు వివాహం నిమిత్తం ఆర్థిక సాయం చేయబోతున్నట్లు వివరించారు. ముఖ్యంగా ప్రతీ ఒక్క దివ్యాంగ మహిళకు 10 లక్షల రూపాయలు అందించబోతున్నట్లు వెల్లడించారు.
అయితే చాలా ఏళ్ల పాటు ఈ మంగళ సేవ కార్యక్రమాన్ని నిర్వహించాలని కొత్త జంట లక్ష్యంగా పెట్టుకుందని.. ఇది చాలా సంతోషకరమైన వార్త అంటూ వివరించారు.
ఆనందం, గౌరవంతో..
ఒక తండ్రిగా ఓ పవిత్ర సేవ తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని గౌతమ్ అదానీ పోస్టులో రాసుకొచ్చారు. ఈ ప్రయత్నం ద్వారా దివ్యాంగులైన ఆడ బిడ్డలు, వారి కుటుంబాలు ఆనందం, గౌరవంతో ముందుకు సాగుతాయనే నమ్మకం కలుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ మంగళ సేవ కొనసాగించేందుకు ఆ దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఈ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభించగా.. పలువురికి జీత్ అదానీ ఆర్థిక సాయం అందజేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను సైతం గౌతమ్ అదానీ తన పోస్టు ద్వారా పంచుకున్నారు
ఈ విషయం తెలుసుకున్న ప్రజలంతా జీత్ అదానీ మంచి మనసుకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు. మీరు దాతృత్వ కార్యక్రమాలను ఇలాగే కొనసాగిస్తూ.. జీవితంలో మరెంతో ఎత్తుకు ఎదగాలంటూ కామెంట్లు చేస్తున్నారు.