DC vs PBKS : క్యాచ్‌ పట్టే క్రమంలో ఎంగిడికి తీవ్ర గాయం.. మైదానంలోకి అంబులెన్స్

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్2026 సీజన్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. అక్షర్ పటేల్ వేసిన ఓవర్‌లో ప్రియాంశ్ ఆర్య కొట్టిన బంతిని క్యాచ్ పట్టేందుకు ఫీల్డర్ లుంగి ఎన్గిడి ప్రయత్నించగా అతని తల మైదానంలోని నేలకు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.

New Update
FotoJet - 2026-04-25T182750.264

Lungi Ngidi suffers head injury during catch attempt

DC vs PBKS : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో పెను విషాదం చోటుచేసుకుంది. అక్షర్ పటేల్ వేసిన ఓవర్‌లో బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య కొట్టిన బంతి మిడ్-ఆఫ్ దిశగా గాల్లోకి లేవగా, దానిని క్యాచ్ పట్టేందుకు ఫీల్డర్ లుంగి ఎన్గిడి అద్భుతమైన డైవ్ చేశాడు. అయితే ఈ క్రమంలో నియంత్రణ కోల్పోయిన ఎన్గిడి తల మైదానంలోని గట్టి నేలకు బలంగా తగిలింది. దీంతో అతను తీవ్రమైన గాయంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు.

పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారడంతో అంబులెన్స్‌ను నేరుగా మైదానంలోకి రప్పించాల్సి వచ్చింది. వైద్య సిబ్బంది ప్రాథమిక చికిత్స అందిస్తున్న సమయంలో హెమంగ్ బదానీ సూచన మేరకు ఎన్గిడికి నెక్ బ్రేస్ అమర్చి, అత్యంత జాగ్రత్తగా స్ట్రెచర్‌పై అంబులెన్స్‌లోకి తరలించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. ఈ హృదయ విదారక దృశ్యాలను చూసి మైదానంలో ఉన్న డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ వంటి తోటి ఆటగాళ్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ స్వయంగా మైదానంలోకి వచ్చి ఎన్గిడి పరిస్థితిని అడిగి తెలుసుకోగా, అప్పటివరకు కేరింతలతో హోరెత్తిన స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. మైదానం ఉపరితలం గట్టిగా ఉండటమే గాయం తీవ్రత పెరగడానికి కారణమని భావిస్తున్నారు. ప్రస్తుతం ఎన్గిడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల నుంచి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. తన జట్టు సభ్యుడికి జరిగిన ఈ ప్రమాదంతో ఆటగాళ్లందరిలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisment
తాజా కథనాలు