/rtv/media/media_files/2026/05/30/dk-shiva-2026-05-30-06-36-18.jpg)
కర్ణాటక రాజకీయాల్లో గత కొంతకాలంగా సాగుతున్న అధికార పోరాటానికి ఎట్టకేలకు తెరపడింది. సీనియర్ కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా వచ్చే జూన్ 3వ తేదీన బెంగళూరులో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇన్నాళ్లూ ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేయడంతో, ఆయన స్థానంలో శివకుమార్ బాధ్యతలు చేపట్టబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బెంగళూరులోని రాజ్ భవన్ గ్లాస్ హౌస్‌లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎంతో ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, అలాగే రాష్ట్రం నలుమూలల నుండి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరుకానున్నారు.
పది మంది మంత్రులుగా
ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో 64 ఏళ్ల డీకే శివకుమార్‌తో పాటు దాదాపు ఎనిమిది నుండి పది మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక మిగిలిన మంత్రి పదవుల భర్తీని జూన్ 18న జరిగే రాజ్యసభ ఎన్నికల తర్వాత చేపట్టవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్టానంతో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నారు. గతంలో పార్టీ అధిష్టానం కుదుర్చిన అధికార మార్పిడి ఒప్పందంలో భాగంగానే ఈ మార్పులు జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
నిజానికి 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే రొటేషనల్ ముఖ్యమంత్రి ఫార్ములాపై జోరుగా ప్రచారం సాగింది. ఆ ఒప్పందం ప్రకారం సిద్ధరామయ్య రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాక, మిగిలిన కాలానికి డీకే శివకుమార్‌కు అవకాశం ఇవ్వాలని అనుకున్నారు. అయితే అప్పట్లో కాంగ్రెస్ అధిష్టానం కానీ, సిద్ధరామయ్య కానీ ఈ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోలేదు. కానీ గత ఏడాది నవంబర్‌తో సిద్ధరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం ముగియడంతో ఈ మార్పు గురించిన వార్తలు మరింత ఊపందుకున్నాయి.
ఇలాంటి కీలక సమయంలో సిద్ధరామయ్య తన కుమారుడు యతీంద్రతో కలిసి శుక్రవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలను కలవడం విశేషం. దీంతో కొత్తగా ఏర్పడబోయే శివకుమార్ మంత్రివర్గంలో జూనియర్ సిద్ధరామయ్యకు చోటు దక్కవచ్చనే ప్రచారం మొదలైంది. మరోవైపు, పాత మంత్రివర్గంలోని పలువురు మంత్రులు తమ పదవులను కాపాడుకోవడానికి, అలాగే శివకుమార్ వర్గానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలు కొత్తగా మంత్రి పదవులు సంపాదించడానికి ఢిల్లీలోనే మకాం వేసి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త మంత్రివర్గంలో పాత మంత్రులతో పాటు కొందరు కొత్త ముఖాలకు కూడా అవకాశం ఇచ్చేలా చర్చలు సాగినట్లు తెలుస్తోంది.
Follow Us