/rtv/media/media_files/2026/05/28/dk-shivakumar-2026-05-28-14-45-57.jpg)
కర్ణాటక సీఎం సిద్దరామయ్య మరికాసేపట్లో తన పదవికి రాజీనామా చేయనున్నారు. దీంతో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. 2026 జూన్ 01వ తేదీన ఆయన ప్రమాణస్వీకారం ఉంటుందని తెలుస్తోంది. ఈ క్రమంలో డీకే శివకుమార్ ఆస్తులపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. డీకే శివకుమార్ దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుల్లో ఒకరు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఆయనకు రూ1,400 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు స్వయంగా ప్రకటించారు.
ఆ ఎన్నికల అఫిడవిట్ వివరాల ప్రకారం.. శివకుమార్, ఆయన కుటుంబ సభ్యుల ఉమ్మడి ఆస్తుల మొత్తం విలువ రూ.1,413.78 కోట్లుగా ఉంది. 2018 ఎన్నికల సమయంలో ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ రూ. 840.08 కోట్లు కాగా, ఐదేళ్లలోనే ఇది భారీగా పెరగడం విశేషం.
ఈ ఆస్తుల విభజనను పరిశీలిస్తే.. శివకుమార్ కుటుంబానికి రూ. 273.42 కోట్ల విలువైన చరాస్తులు (క్యాష్, షేర్లు, బంగారం మొదలైనవి), రూ. 1,140.36 కోట్ల విలువైన స్థిరాస్తులు (భూములు, ఇళ్లు) ఉన్నాయి. ఇందులో కేవలం శివకుమార్ పేరు మీదనే రూ.972.65 కోట్ల వ్యక్తిగత స్థిరాస్తులు ఉండటం గమనార్హం. ఆస్తులతో పాటు తమకు దాదాపు రూ. 263 కోట్ల అప్పులు (అప్పుల బాధ్యతలు) ఉన్నట్లు కూడా ఆయన అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
డీకే శివకుమార్ పేరిట కేవలం ఒకే ఒక్క రిజిస్టర్డ్ వాహనం ఉంది. అది పాత మోడల్ 'టయోటా క్వాలిస్' కార్. అయితే, ఆయనకు విలాసవంతమైన రోలెక్స్, హుబ్లో బ్రాండ్ వాచీలతో పాటు భారీగా బంగారం, వెండి ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఇక 2023 ఎన్నికల నామినేషన్ దాఖలు చేసే సమయానికి ఆయనపై 19 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
1980లో రాజకీయాల్లోకి
డీకే శివకుమార్1980లో రాజకీయాల్లోకి వచ్చారు.1989లో మొదటిసారిగా కర్ణాటక అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కనకపుర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శివకుమార్.. గత కాంగ్రెస్ ప్రభుత్వాలలో ఎన్నో కీలకమైన మంత్రి పదవులను చేపట్టారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన తర్వాత, సిద్ధరామయ్య నేతృత్వంలోని ప్రభుత్వంలో ఆయన డిప్యూటీ సీఎంగ ప్రమాణ స్వీకారం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో ఆయనను ఒక గొప్ప వ్యూహకర్తగా, ట్రబుల్ షూటర్ గా భావిస్తారు. 2017 రాజ్యసభ ఎన్నికల సమయంలో గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కాపాడేందుకు, వారిని బెంగళూరులోని ఒక రిసార్ట్‌కు తరలించి క్యాంప్ నడిపిన వ్యవహారంతో ఆయన దేశవ్యాప్తంగా ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు.
Follow Us