/rtv/media/media_files/2026/06/02/abhijeet-deepke-2026-06-02-10-37-27.jpg)
head of 'Cockroach' Abhijeet Deepke
NEET : దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ‘నీట్’ (NEET) పరీక్షాపత్రాల లీకేజీ వ్యవహారంపై ప్రత్యక్ష పోరాటానికి కాక్రోచ్ జనతాపార్టీ (CJP) వ్యవస్థాపక నేత అభిజీత్ దీప్కే సిద్ధమయ్యారు. ఈ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో జూన్ 6 నుంచి ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద శాంతియుత ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్‌లో ఉంటున్న అభిజీత్.. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విటర్) వేదికగా, అలాగే పీటీఐ (PTI) వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కీలక వివరాలను వెల్లడించారు.
దాదాపు రెండు వారాల క్రితమే కాక్రోచ్ జనతా పార్టీని స్థాపించిన అభిజీత్ దీప్కే.. దేశంలో జవాబుదారీతనాన్ని ప్రశ్నించేందుకే తాను భారత్‌కు తిరిగి వస్తున్నట్లు స్పష్టం చేశారు. "ఇంత పెద్ద తప్పు జరిగిన తర్వాత కూడా కేంద్ర మంత్రి పదవిలో కొనసాగడం దేశంలో జవాబుదారీతనం లేకపోవడానికి నిదర్శనం. నేను అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ హాయిగా బతకొచ్చు, ఎన్నో మంచి అవకాశాలను కూడా వదులుకుని వస్తున్నా. ఎవరో వస్తారు, మనల్ని రక్షిస్తారని ఎంతకాలం ఎదురుచూస్తాం? శాంతిని విశ్వసించే, రాజ్యాంగాన్ని అనుసరించే బొద్దింకలంతా (మద్దతుదారులు) దేశ భవిష్యత్తును కాపాడుకోవడానికి నాతో కలిసి రావాలి" అని ఆయన పిలుపునిచ్చారు. తాను భారత్‌లో అడుగుపెట్టగానే విమానాశ్రయంలోనే అరెస్టు చేసే అవకాశం ఉందని, జైలుకు పంపినా అన్నింటికీ సిద్ధపడే వస్తున్నానని ఆయన తేల్చి చెప్పారు.
జంతర్‌మంతర్ వద్ద నిర్వహించ తలపెట్టిన ఈ ఆందోళన కార్యక్రమానికి సంబంధించి ముందస్తుగానే పోలీసుల అనుమతి కోరినట్లు అభిజీత్ తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపై తనకు ఇంకా నమ్మకం ఉందని, శాంతియుత నిరసనలకు అనుమతి లభిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. నీట్ లీకేజీకి వ్యతిరేకంగా దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమాలకు తమ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని, రాజ్యాంగబద్ధంగా ఒక్కటై నిరసన గళం వినిపించడానికి ఇదే సరైన సమయమని ఆయన ఉద్ఘాటించారు.
Follow Us