/rtv/media/media_files/2026/06/14/delhi-2026-06-14-15-31-24.jpg)
దక్షిణ ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో గత శుక్రవారం జరిగిన ఘోర అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగింది కాదు, అదొక పక్కా స్కెచ్ అని పోలీసులు తేల్చారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల మధ్య ఉన్న ఆర్థిక గొడవలే ఈ ఘోరానికి కారణమని దర్యాప్తులో తేలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.
ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిరంజన్ (33), అతని తమ్ముడు రాజ్‌కుమార్ (27), సరిత (27) అనే ముగ్గురిని అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఒక 17 ఏళ్ల మైనర్ బాలికను కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులైన ఇద్దరు యువకులతో ఈ ఇద్దరు మహిళలకు సంబంధాలు ఉన్నట్లు సమాచారం. జూన్ 12 అర్ధరాత్రి దాటిన తర్వాత, కింద పార్క్ చేసి ఉన్న ఒక స్కూటర్‌కు తానే నిప్పు పెట్టానని ఆ మైనర్ బాలిక పోలీసుల విచారణలో అంగీకరించింది. ఆ మంటలు కాస్తా వేగంగా ఐదో అంతస్తు వరకు వ్యాపించి, బిల్డింగ్ మొత్తాన్ని ముంచెత్తాయి.
ఈ ప్రమాదం జరిగిన వెంటనే బిల్డింగ్‌లో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ పంకజ్, సుశీలా దేవి, సోనియా కుమారి అనే ముగ్గురు ప్రాణాలు విడిచారు. మొదట ఇది కేవలం ప్రమాదవశాత్తూ జరిగిందేనని అందరూ భావించారు. కానీ, బిల్డింగ్ సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో కథ అడ్డం తిరిగింది. మంటలు అంటుకోవడానికి కాసేపు ముందు ఒక బాలిక ఆ బిల్డింగ్‌లోకి వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయింది. ఆ ఆధారంతోనే పోలీసులు బాలికను పట్టుకుని విచారించారు.
ఐదో అంతస్తులో ఉంటున్న
తనను సరిత అనే మహిళే రెచ్చగొట్టిందని, బిల్డింగ్ ఐదో అంతస్తులో ఉంటున్న దీపక్ అనే వ్యక్తి స్కూటర్‌కు నిప్పు పెట్టమని చెప్పిందని ఆ బాలిక ఒప్పుకుంది. ఇందుకోసం సరితే తనకు పెట్రోల్, అగ్గిపెట్టె ఇచ్చిందని పోలీసులకు వివరించింది. ఈ దీపక్ మరెవరో కాదు.. ప్రధాన నిందితుడు నిరంజన్‌కు వరుసకు తమ్ముడు అవుతాడు. ఇటీవలే మరో కేసులో జైలు నుంచి విడుదలైన నిరంజన్‌కు, దీపక్‌కు మధ్య కొంతకాలంగా తీవ్రమైన డబ్బు గొడవలు నడుస్తున్నాయి. ఆ కక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టారు.
సొంత తమ్ముడిపై పగతో చేసిన ఈ పని వల్ల.. ఎలాంటి పాపం ఎరుగని ముగ్గురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. పోలీసులు ప్రస్తుతం నలుగురు నిందితులపై క్రిమినల్ కుట్ర, హత్యాయత్నం, హత్యానేరం, నిప్పు పెట్టడం, అక్రమంగా చొరబడటం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Follow Us