Gurmeet Ram Rahim : అత్యాచార కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష.. 16 సార్లు పెరోల్..400 రోజులు బయటే...

రెండు దశాబ్దాల జైలు శిక్ష పడిన ఒక తీవ్రమైన నేరస్థుడికి పదే పదే లభిస్తున్న స్వేచ్ఛ భారత న్యాయ, జైళ్ల వ్యవస్థల తీరుపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ‘డేరా సచ్చా సౌదా’ అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) మరోమారు జైలు నుంచి బయటకు వచ్చారు.

New Update
FotoJet (16)

Gurmeet Ram Rahim

Gurmeet Ram Rahim : రెండు దశాబ్దాల జైలు శిక్ష పడిన ఒక తీవ్రమైన నేరస్థుడికి పదే పదే లభిస్తున్న స్వేచ్ఛ భారత న్యాయ, జైళ్ల వ్యవస్థల తీరుపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. తన సొంత శిష్యురాళ్లపైనే లైంగిక వేధింపులకు ఒడిగట్టిన నేరానికి గానూ 20 ఏళ్ల కఠిన జైలు శిక్ష అనుభవిస్తున్న ‘డేరా సచ్చా సౌదా’ అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (డేరా బాబా) మరోమారు జైలు నుంచి బయటకు వచ్చారు. మంగళవారం నాడు ఆయనకు హరియాణా ప్రభుత్వం 30 రోజుల పాటు పెరోల్ మంజూరు చేయడంతో, రోహ్‌తక్‌లోని సునారియా జైలు నుంచి ఆయన తాత్కాలికంగా విడుదలయ్యారు.

క్రూరమైన అత్యాచార నేరానికి శిక్ష పడిన నాటి నుంచి గుర్మీత్‌కు పెరోల్ లభించడం ఇది 16వ సారి కావడం గమనార్హం. 2017లో కోర్టు తీర్పు వచ్చిన తర్వాత, గత తొమ్మిదేళ్ల శిక్షా కాలంలో ఈ డేరా బాబా ఏకంగా 400 రోజులకు పైగా జైలు వెలుపలే, అంటే సమాజంలోనే స్వేచ్ఛగా గడపడం గమనార్హం. కేవలం 2020 నుంచి ఇప్పటివరకు మాత్రమే ఆయన 16 సార్లు రకరకాల కారణాలు చూపుతూ పెరోల్ సాధించి జైలు నుంచి బయటకు రావడం, సాధారణ ఖైదీలకు దక్కని అసాధారణ లబ్ధిగా విమర్శకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

గుర్మీత్ రామ్ రహీమ్ గత నేరాల చరిత్ర చూస్తే ఆయనపై ఎన్నో తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. 2002లో ఒక జర్నలిస్టు హత్య కేసులో ప్రత్యేక సీబీఐ కోర్టు ఈయనకు యావజ్జీవ కారాగార శిక్ష విధించినప్పటికీ, ఏడేళ్ల జైలు జీవితం తర్వాత పంజాబ్-హరియాణా హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. అయితే, ఇద్దరు మహిళా అనుచరులపై అత్యాచారం చేసిన కేసులో మాత్రం 2017లో సీబీఐ ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో నాటి నుంచి ఆయన జైలు శిక్ష అనుభవిస్తున్నారు.

ప్రస్తుత 30 రోజుల పెరోల్ కాలంలో డేరా బాబా సిర్సాలోని తన ‘డేరా సచ్చా సౌదా’ ప్రధాన కార్యాలయంలోనే బస చేయనున్నట్లు ఆయన న్యాయవాది జితేందర్ ఖురానా ధృవీకరించారు. గుర్మీత్ సిర్సాకు చేరుకుంటున్న తరుణంలో ఆయన అనుచరులు, భక్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు సిద్ధమవుతుండటంతో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా హరియాణా పోలీసులు ఆ ప్రాంతంలో అప్రమత్తమై కఠిన నిఘా ఏర్పాటు చేశారు. అధికారుల కఠిన నిబంధనల నడుమే ఆయనను జైలు నుంచి సిర్సాకు తరలించారు.

రామ్ రహీమ్‌కు ప్రతిసారీ లభిస్తున్న ఈ పెరోల్ వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో హరియాణా, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన ప్రతిసారీ ఈయనకు పెరోల్ మంజూరు కావడం తీవ్ర వివాదాస్పదమైంది. డేరా బాబాకు ఉన్న లక్షలాది మంది ఓటు బ్యాంక్ భక్తులను ఆకర్షించేందుకే పాలక పక్షాలు చట్టాన్ని చుట్టేస్తూ ఆయనకు ఇష్టారాజ్యంగా పెరోల్ ఇస్తున్నాయని ప్రతిపక్షాలు మరియు సామాజిక హక్కుల సంఘాలు పలుమార్లు ధ్వజమెత్తాయి. ఒక సామాన్య ఖైదీకి అత్యవసర పరిస్థితుల్లో కూడా దక్కని పెరోల్ భాగ్యం, ఇంతటి తీవ్రమైన నేరం చేసిన వ్యక్తికి పదే పదే దక్కడం న్యాయం అందరికీ సమానం కాదనే భావనను కలిగిస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు