/rtv/media/media_files/2026/03/27/tmc-vs-bjp-2026-03-27-16-50-26.jpg)
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ లో రాజకీయం మరింత వేడిగా మారింది. అయితే ఈసారి అక్కడ గెలుపోటములను నిర్ణయించేది కేవలం వ్యూహాలు మాత్రమే కాదు, ప్రధానంగా కులం, మతం, ప్రాంతం అనే మూడు అంశాలు. బెంగాల్‌లో దాదాపు 30 శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. అంటే, వీరు ఎటు వైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే అధికారం అన్నమాట. గత మూడు ఎన్నికల్లో మమతా బెనర్జీ (టీఎంసీ) విజయం వెనుక వీరి అండదండలు పుష్కలంగా ఉన్నాయి. కానీ ఈసారి సీన్ మారుతోంది. ముస్లిం ఓట్లను చీల్చి, హిందూ ఓట్లను ఏకం చేయాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేస్తోంది.
మమతకు ముస్లిం బలం ఎందుకు?
టీఎంసీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ముస్లిం వర్గాల్లో గట్టి నమ్మకాన్ని కలిగించాయి. ముఖ్యంగా.. లక్ష్మీ భండార్ (మహిళల కోసం), సబుజ్ సాథి, కన్యాశ్రీ వంటి పథకాలు పేద ముస్లిం కుటుంబాలకు నేరుగా మేలు చేశాయి. మదర్సాల అభివృద్ధి, మత పెద్దలకు గౌరవ వేతనాలు ఇవ్వడం వంటివి ప్రభుత్వం మనకు అండగా ఉందనే భావనను పెంచాయి. బీజేపీ హిందూత్వ రాజకీయాలకు భయపడే ముస్లింలు, తమకు రక్షణగా ఉండేది మమతా బెనర్జీ మాత్రమేనని బలంగా నమ్ముతున్నారు. ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాల్లో టీఎంసీకి తిరుగులేని కేడర్ ఉండటం మరో ప్లస్ పాయింట్.
అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఈసారి రెండు పడవల ప్రయాణం చేస్తోంది. ఒకటి ముస్లిం ఓట్లు అన్నీ టీఎంసీకే పడకుండా, వాటిని కాంగ్రెస్, లెఫ్ట్ లేదా ఇతర చిన్న పార్టీల వైపు మళ్లేలా చేయడం. రెండొవది దేవాలయాల పరిరక్షణ, సాంస్కృతిక అంశాలను లేవనెత్తుతూ హిందువులందరినీ ఒకే తాటిపైకి తేవడం. ముఖ్యంగా ఉత్తర బెంగాల్‌లోని నమశూద్రులు, రాజ్‌బంశీలు వంటి వర్గాలపై బీజేపీ కన్నేసింది. పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాలను ఇక్కడ ఆయుధంగా వాడుతోంది.
ఇప్పుడు టీఎంసీని కలవరపెడుతున్న అంశం సొంత పార్టీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ తిరుగుబాటు. ఆయన బాబ్రీ మసీదు తరహాలో మసీదు కడతా అంటూ ముస్లింలను ఆకర్షిస్తున్నారు. దీనికి తోడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో ఆయన చేతులు కలపడం పెద్ద చర్చకు దారితీసింది. వీరు సుమారు 140 స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. దీనివల్ల కనీసం 10 నుంచి 15 శాతం ముస్లిం ఓట్లు చీలిపోవచ్చు. గతంలో బీహార్‌లో ఒవైసీ వల్ల ఆర్‌జేడీకి ఎలాగైతే గండి పడిందో, ఇప్పుడు బెంగాల్‌లో టీఎంసీకి అలాగే నష్టం జరుగుతుందా? అన్నది ఉత్కంఠ రేపుతోంది.
ముస్లిం ఓట్లు చీలితే అది నేరుగా బీజేపీకి లాభిస్తుంది. మరి బెంగాల్ ఓటరు మమతపై మళ్లీ మమకారం చూపుతారా? లేక బీజేపీ మార్పు తెస్తుందా? అన్నది తేలాలంటే వేచి చూడాల్సిందే!
Follow Us