/rtv/media/media_files/2026/05/01/tvk-vijay-2026-05-01-15-10-37.jpg)
TVK Vijay
BIG BREAKING: తమిళనాడు రాజకీయాలు సరికొత్త మలుపు తిరిగాయి. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి, 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీని స్థాపించిన సి. జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో తన తొలి బలపరీక్షలో విజయం సాధించారు. ఆయనకు అనుకూలంగా 144 ఓట్లు రావడంతో ఆయన విశ్వాసం నెగ్గినట్లయింది.
ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 232 మంది సభ్యులు ఉండగా, అధికార పీఠాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 117. అయితే, ప్రధాన పార్టీల మద్దతుతో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే కూటమి బలం ఇప్పటికే 120కి చేరడంతో ఆయన విజయం నల్లేరుపై నడకేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బలపరీక్ష సందర్భంగా అన్నాడీఎంకేలో వచ్చిన చీలిక, మిత్రపక్షాల చురకలు తమిళ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి.
అన్నాడీఎంకేలో ఊహించని చీలిక..
బలపరీక్షకు ముందే అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామికి సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఊహించని షాక్ ఇచ్చారు. పార్టీ సీనియర్ నేతలు ఎస్పీ వేలుమణి, సి.వీ షణ్ముగం నేతృత్వంలో దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగురవేసి, సీఎం విజయ్ ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటించారు. పళనిస్వామి డీఎంకేతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని రెబల్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. మరోవైపు, టీవీకేకు మద్దతు ఇచ్చినందుకు గానూ ఏఎంఎంకే (AMMK) ఎమ్మెల్యే ఎస్. కామరాజ్‌పై ఆ పార్టీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది.
సభలో పొలిటికల్ హైడ్రామా.. పళనిస్వామి వర్గం వాకౌట్
అసెంబ్లీలో బలపరీక్ష తీర్మానం ప్రవేశపెట్టిన సమయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభలో అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి మాట్లాడుతూ.. సీఎం విజయ్ తమ పార్టీ ఎమ్మెల్యేలను లొంగతీసుకుంటున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తానన్న సీఎం పారదర్శకత ఇదేనా అని నిలదీశారు. అనంతరం రెబల్ ఎమ్మెల్యేల తరఫున మాట్లాడేందుకు స్పీకర్ వేలుమణికి అనుమతి ఇవ్వడంతో సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పళనిస్వామి వర్గం, రెబల్ వర్గం నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో, పళనిస్వామి తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి సభ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై వేలుమణి స్పందిస్తూ.. తమను ఎవరూ డబ్బులతో కొనలేదని, ప్రజల్లో విజయ్ ప్రభుత్వానికి ఉన్న ఆదరణ చూసే తాము మద్దతు ఇస్తున్నామని స్పష్టం చేశారు.
తిరుమావళవన్ సంచలన వ్యాఖ్యలు
మరోవైపు విదుతలై చిరుతైగల్ కట్చి (VCK) అధినేత తిరుమావళవన్ అసెంబ్లీ సాక్షిగా ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. విజయ్‌ను అధికారానికి దూరం చేయడానికి డీఎంకే, అన్నాడీఎంకేలు తెరవెనుక చేతులు కలిపాయని ఆయన ఆరోపించారు. తనను ముఖ్యమంత్రిని చేస్తామని ఆ రెండు పార్టీలు ఆశ చూపినప్పటికీ, తాను ఆ ప్రతిపాదనను తిరస్కరించి నైతిక విలువలతో విజయ్ వైపే నిలబడ్డానని తిరుమావళవన్ స్పష్టం చేయడం గమనార్హం.
మద్దతు ఇస్తూనే మిత్రపక్షాల ఘాటు విమర్శలు
సీఎం విజయ్‌కు కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకే, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు ప్రకటించినప్పటికీ, పరిపాలన విషయంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు,సూచనలు చేశాయి. తమిళనాడులో బీజేపీ ఆటలు సాగనివ్వకూడదనే ఉద్దేశంతోనే తాము టీవీకేకు మద్దతు ఇస్తున్నట్లు వామపక్షాలు, ఐయూఎంఎల్ తెలిపాయి. అలాగే గత ప్రభుత్వం అమలు చేసిన ఉచిత అల్పాహార పథకాన్ని కొనసాగించాలని, శ్రీలంక శరణార్థులకు పౌరసత్వం కల్పించేలా చర్యలు తీసుకోవాలని మిత్రపక్షాలు కోరాయి.
'జ్యోతిష్యం వద్దు.. విజ్ఞానం ముద్దు'.. ఓఎస్‌డీ నియామకంపై రచ్చ
విజయ్ ప్రభుత్వం సాధిస్తున్న విజయాల మధ్య ఒక వివాదం కూడా తెరపైకి వచ్చింది. సీఎం విజయ్ తన వ్యక్తిగత జ్యోతిష్కుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌ను ఓఎస్‌డీ (Officer on Special Duty) గా నియమించుకోవడంపై మిత్రపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వీసీకే నేత వన్నియరసు మాట్లాడుతూ.. ప్రభుత్వం జ్యోతిష్యానికి కాకుండా శాస్త్ర విజ్ఞానానికి ప్రాధాన్యత ఇవ్వాలని హితవు పలికారు. డీఎండీకే ఎమ్మెల్యే ప్రేమలత విజయ్ కాంత్ కూడా ఈ విషయమై ఘాటుగా స్పందించారు. "యువత మిమ్మల్ని నమ్మి ఓటు వేసి గెలిపించారు. కానీ మీరు జ్యోతిష్యులను నమ్ముతూ ఓఎస్‌డీగా నియమించడం ఏంటి? ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం" అంటూ సభలో చురకలు అంటించారు.
మొత్తానికి, తీవ్ర రాజకీయ ఉత్కంఠ, ఆరోపణలు, సభలో గందరగోళం మధ్య తమిళనాడు అసెంబ్లీలో విజయ్ ప్రభుత్వ బలపరీక్ష ఒక కీలక ఘట్టంగా నిలిచింది. భిన్న పార్టీల వ్యూహాల మధ్య సీఎం విజయ్ తన పీఠాన్ని ఎలా కాపాడుకుంటారు, మిత్రపక్షాల డిమాండ్లను ఎలా నెరవేరుస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
విజయ్ కు అనుకూలంగా 144 మంది
బలపరీక్షలో భాగంగా స్పీకర్ అసెంబ్లీ సభ్యులందరి అభిప్రాయం తీసుకున్నారు. ఆయన ఒకరొకరిని పేరు పెట్టి పిలుస్తూ ఎవరికి మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించి వారి అభిప్రాయాలు తీసుకున్నారు. మొత్తం సభలో 232 మంది సభ్యులకు గాను విజయ్ కు అనుకూలంగా తన మిత్రపక్ష ఎమ్మెల్యేలతో పాటు అన్నాడీఎంకే చీలిక వర్గం మద్దతుతో 144 మంది ఆయనకు అనుకూలంగా ఓటు వేశారు. 22 మంది వ్యతిరేకంగా ఓటు వేయగా, డీఎంకే, అన్నాడీఎంకే మరో వర్గం ఓటింగ్ లో పాల్గొనకుండా బలపరీక్షను బహిష్కరించింది. ముగ్గురు సభ్యులు గైర్హాజరయ్యారు.
Follow Us