Gold-Silver-Imports : బంగారం, వెండి దిగుమతిపై కేంద్రం షాక్‌...సుంకాలు డబుల్

కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినం ప్రియులకు షాక్ ఇచ్చింది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న పసిడి దిగుమతులకు అడ్డుకట్ట వేసేందుకు, విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు దిగుమతి సుంకాన్ని(ఇంపోర్ట్ డ్యూటీ) అమాంతం రెట్టింపు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది

New Update
FotoJet - 2026-05-13T103744.090

Gold-Silver-Imports

Gold-Silver-Imports : కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి, ప్లాటినం ప్రియులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న పసిడి దిగుమతులకు అడ్డుకట్ట వేసేందుకు, విదేశీ మారక నిల్వలను కాపాడుకునేందుకు వీలుగా దిగుమతి సుంకాన్ని (ఇంపోర్ట్ డ్యూటీ) అమాంతం రెట్టింపు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.తాజా నిర్ణయం ప్రకారం.. ఇప్పటివరకు 5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని ఏకంగా 10 శాతానికి పెంచుతూ రెవెన్యూ శాఖ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 13 (నేటి) అర్ధరాత్రి నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.

 ప్రధాని పిలుపునిచ్చిన రెండు రోజులకే కఠిన నిర్ణయం

ఇటీవలే సికింద్రాబాద్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కనీసం ఏడాది పాటు ప్రజలెవరూ బంగారం కొనొద్దని స్వచ్ఛందంగా నియంత్రించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా వివాహాలు, పండుగల సీజన్లలో కొనుగోళ్లు వాయిదా వేసుకోవాలని కోరారు. ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసిన రెండు రోజుల్లోనే ప్రభుత్వం పన్నులను రెట్టింపు చేస్తూ జీవో జారీ చేయడం గమనార్హం.

సుంకాల పెంపు దేనిదేనిపై వర్తిస్తుంది?

బంగారం (Gold), వెండి (Silver), ప్లాటినం (Platinum) ముడి లోహాలు.ఆభరణాల తయారీలో వాడే 'జ్యువలరీ ఫైండింగ్స్' (నెక్లెస్‌లు, చెవి రింగుల తయారీలో ఉపయోగించే హుక్కులు, క్లిప్పులు, పిన్లు, స్క్రూ బ్యాక్స్ వంటి చిన్న భాగాలు).బంగారం, వెండి ఫైండింగ్స్‌పై కస్టమ్స్ సుంకం 5% పెరగ్గా, ప్లాటినం ఫైండింగ్స్‌పై 5.4% పెరిగింది.అయితే, రీసైక్లింగ్, విలువైన లోహాల రికవరీని ప్రోత్సహించడానికి వీలుగా... బూడిదతో కూడిన విలువైన లోహాల దిగుమతులపై సుంకాన్ని 4.35%కి తగ్గించారు. (దీనికి నిర్దిష్ట నిబంధనలు వర్తిస్తాయి).


ప్రభుత్వం ఇంతటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి అనేక కారణాలున్నాయి. ముఖ్యంగా ...

 పశ్చిమాసియా ఉద్రిక్తతలు - డాలర్ల కొరత

ప్రస్తుతం పశ్చిమాసియా (Middle East) ప్రాంతంలో నెలకొన్న భౌగోళిక రాజకీయ సంఘర్షణల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో విదేశీ మారక నిల్వలపై (Foreign Exchange Reserves) తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. భారతదేశం దిగుమతులు చేసుకోవాలంటే డాలర్ల రూపంలో చెల్లించాలి. బంగారం డిమాండ్ పెరిగేకొద్దీ దేశంలోని డాలర్లు బయటకు వెళ్ళిపోతుండటంతో రూపాయి విలువ క్షీణించే ప్రమాదం ఏర్పడింది.

ఇక కరెంట్ ఖాతా లోటు (Current Account Deficit)

గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో భారతదేశం కేవలం బంగారం దిగుమతి కోసమే ఏకంగా 11 లక్షల కోట్ల రూపాయల విలువైన విదేశీ మారకద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వచ్చింది. ఎగుమతుల కంటే దిగుమతుల విలువ పెరిగితే వాణిజ్య లోటు పెరిగి దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. దీనిని అదుపు చేయడానికే కేంద్రం ఈ పన్నుల అస్త్రాన్ని ప్రయోగించింది.

రికార్డు స్థాయిలో 2025-26 దిగుమతులు
వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో బంగారం దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయి.గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 24% పెరిగి 71.98 బిలియన్ డాలర్లకు (సుమారు 72 బిలియన్ డాలర్లు) చేరింది. మొత్తం దిగుమతుల్లో వాటా: దేశం చేసుకునే మొత్తం దిగుమతుల్లో కేవలం బంగారం వాటాయే 9 శాతం ఉండటం ఆందోళనకరం.

పరిమాణంలో తగ్గుదల.. ధరల్లో పెరుగుదల: అంతర్జాతీయంగా రేట్లు పెరగడం వల్ల 2025-26లో భారత్ 721 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. ఇది గత ఏడాదితో పోలిస్తే పరిమాణంలో 4.76% తగ్గినప్పటికీ, రేట్లు విపరీతంగా పెరగడం వల్ల కేంద్ర ప్రభుత్వం మరో లక్ష కోట్ల రూపాయలు అదనంగా వెచ్చించాల్సి వచ్చింది.

భారత్‌కు బంగారం ఎక్కడి నుంచి వస్తుంది?
ప్రపంచంలోనే చైనా తర్వాత రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా భారతదేశం ఉంది. మన దేశ అవసరాల కోసం ప్రధానంగా మూడు దేశాల నుంచి దిగుమతులు జరుగుతున్నాయి:దేశందిగుమతి వాటా (%)స్విట్జర్లాండ్40%యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)16%దక్షిణాఫ్రికా (South Africa)10%

 సామాన్యులపై పడనున్న అదనపు భారం

భారతీయులకు బంగారం అనేది కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఒక సురక్షితమైన పెట్టుబడి (Safe Haven). పెళ్లిళ్లు, పండుగలకు బంగారం కొనడం ఇక్కడి సంప్రదాయం. అయితే తాజా ప్రభుత్వ నిర్ణయంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడనుంది.ప్రస్తుతం మార్కెట్లో తులం (10 గ్రాముల) బంగారం ధర సుమారు రూ. 1,53,990 పలుకుతోంది. కిలో వెండి ధర రికార్డు స్థాయిలో రూ. 3 లక్షలుగా ఉంది.

ఇప్పటికే ఆకాశాన్నంటిన పసిడి ధరలు, ఈ 5% అదనపు దిగుమతి సుంకం పెంపుతో మరింత ప్రియం కానున్నాయి. రానున్న రోజుల్లో జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీతో కలిపి సామాన్యుడు బంగారం కొనాలంటే భయపడాల్సిన పరిస్థితి రానుంది. ప్రభుత్వం ఆశించినట్టుగా ఈ నిర్ణయం దిగుమతులను తగ్గించి ఆర్థిక వ్యవస్థను కాపాడుతుందో లేదో వేచి చూడాలి.

Advertisment
తాజా కథనాలు