ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా సంచలన కామెంట్స్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో జంగ్‌పురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన బీజేపీపై కీలక ఆరోపణలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తాను తీహార్ జైలులో ఉన్న సమయంలో బీజేపీలో చేరాలని.. అలా అంగీకరిస్తే , ఆప్ ఎమ్మెల్యేలను విడగొట్టి, తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేసిందని సిసోడియా ఆరోపించారు. ఆ ఆఫర్‌ను తిరస్కరిస్తే జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుందని బీజేపీ తనను హెచ్చరించిందంటూ సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : HYD: టాలీవుడ్ ప్రముఖుల ఇళ్ళల్లో ముగిసిన ఐటీ సోదాలు
ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేయడమే బీజేపీ లక్ష్యం అని విమర్శలు గుప్పించారు సిసోడియా. ఆప్‌తో రాజకీయ పోటీని ఆ పార్టీ వ్యక్తిగత పోటీగా మార్చిందని ఆరోపణలు గుప్పించారు. తమ ఎజెండాతో పొత్తు పెట్టుకోవడానికి నిరాకరించిన ప్రతిపక్ష నేతలను బీజేపీ క్రమపద్ధతిలో టార్గెట్ చేస్తోందని, ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ ఫ్యాక్టరీ పెట్టిందని.. అగీంకరించని నేతను జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సిసోడియాను 2023లో అరెస్టు అయ్యారు. కాగా గత ఏడాది ఆగస్టులో సుప్రీంకోర్టు సిసోడియాకి బెయిల్ మంజూరు చేసింది. దాదాపు 17 నెలల పాటు సిసోడియా తీహార్ జైలులో గడిపారు.
ఫిబ్రవరి 5న ఎన్నికలు
ఢిల్లీలోని మొత్తం 70 నియోజవర్గాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘన విజయం సాధించింది. ఇక్కడ మొత్తం 70 సీట్లకు గాను ఆప్ 62 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క అభ్యర్థి కూడా గెలవలేకపోయారు.