Annamalai : BJPని మూడు రెట్లు పెంచిన లీడర్.. అన్నమలైకి మోదీతో ఎక్కడ చెడింది?

తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పు చోటుచేసుకుంది. ఒకప్పుడు తమిళనాట బీజేపీకి పెద్ద ఆశాకిరణంగా నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై బీజేపీకి గుడ్‌బై చెప్పారు.

New Update
annamali

తమిళనాడు రాజకీయాల్లో సంచలన మార్పు చోటుచేసుకుంది. ఒకప్పుడు తమిళనాట బీజేపీకి పెద్ద ఆశాకిరణంగా నిలిచిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై బీజేపీకి గుడ్‌బై చెప్పారు. 2020లో బీజేపీలో చేరి, ఆ రాష్ట్రంలో పార్టీకి మునుపెన్నడూ లేనంత గుర్తింపు తెచ్చిన ఆయన.. జాతీయ పార్టీలో ఉండటం వల్ల తన ఎదుగుదలకు బ్రేకులు పడుతున్నాయని భావించి, త్వరలోనే సొంతంగా ప్రాంతీయ పార్టీ పెట్టడానికి సిద్ధమయ్యారు.

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎందుకు ఘోరంగా విఫలమైందనే దానిపై అన్నామలై ఒక సుదీర్ఘ నివేదికను పార్టీ అధిష్ఠానానికి సమర్పించారు. అందులో తనను పార్టీ ఏ విధంగా పక్కన పెట్టిందో కూడా వివరించారు. ఇప్పుడు అధికారికంగా విడిపోతున్నప్పటికీ, దీనికి సంబంధించిన పునాది 2026 ఎన్నికల ముందే పడింది. తమిళనాడులో బీజేపీని ఒంటరిగా బలోపేతం చేయాలనే అన్నామలై విజన్‌ను ఢిల్లీ లీడర్‌షిప్ పక్కన పెట్టేయడమే దీనికి కారణం.

వాస్తవానికి  అన్నామలై దూకుడు వల్ల 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం రికార్డు స్థాయిలో 11.38% కి పెరిగింది. 2019లో ఇది కేవలం 3.62% గానే ఉంది. కానీ దురదృష్టవశాత్తూ ఈ ఓట్లు సీట్లుగా మారలేదు. బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో బీజేపీ అధిష్ఠానం మళ్లీ ఆలోచనలో పడింది. అన్నామలై తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ.. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం అన్నాడీఎంకేతో మళ్లీ పొత్తు పెట్టుకుంది. అన్నాడీఎంకేను ప్రసన్నం చేసుకోవడం కోసం అన్నామలైను రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుండి తప్పించి, పక్కన పెట్టేశారు.

అన్నామలై తప్పుకోవడం వల్ల తమిళనాడులో బీజేపీ మళ్లీ మొదటికొచ్చినట్లయింది. ఆయన ఉన్నప్పుడు స్థానిక నేతల్లో, క్యాడర్‌లో ఒక కొత్త ఉత్సాహం ఉండేది. ఆయన ఎగ్జిట్‌తో స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీ వీడే ప్రమాదం ఉంది. తమిళనాడులో కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటుడు విజయ్ కి చెందిన టీవీకే పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడాన్ని బట్టి చూస్తే.. అక్కడ కొత్త ప్రయోగాలకు ఛాన్స్ ఉందని అర్థమవుతోంది. బీజేపీ కూడా అన్నామలై రూపంలో ఆ ప్రయోగం మొదలుపెట్టి మధ్యలోనే వదిలేసింది. 'సింగం'గా పిలవబడే అన్నామలైకి యువతలో మంచి క్రేజ్ ఉంది.

సందిగ్ధంలో పడ్డ బీజేపీ

ద్రవిడ పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద కూటమి కట్టడం కోసం పాత మిత్రుడు అన్నాడీఎంకే వైపు వెళ్లాలా? లేక అన్నామలై నమ్ముకున్న సరికొత్త ప్రయోగాన్ని నడపాలా? అనే సందిగ్ధంలో పడ్డ బీజేపీ.. చివరికి పాత మిత్రుడికే ఓటేసింది. దీంతో అన్నామలైకి బయటకు రావడం తప్ప మరో ఆప్షన్ లేకుండా పోయింది. విచిత్రం ఏంటంటే.. ఏ దూకుడు స్వభావం అయితే అన్నామలైను బీజేపీలో స్టార్‌ను చేసిందో, అదే దూకుడు ఇప్పుడు ఆయన పార్టీ నుండి బయటకు రావడానికి కారణమైంది.

Advertisment
తాజా కథనాలు