/rtv/media/media_files/2026/06/16/tmc-mps-merge-into-the-nationalist-citizens-party-2026-06-16-19-45-18.jpg)
TMC MPs merge into the "Nationalist Citizens Party'
TMC Crisis: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా అత్యంత నాటకీయ, సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ అధినేత్రి, మాజీ సీఎం మమతా బెనర్జీకి ఆమె సొంత పార్టీ ఎంపీలే కోలుకోలేని షాక్ ఇచ్చారు. లోక్‌సభలో టీఎంసీకి ఉన్న మొత్తం 28 మంది ఎంపీలలో ఏకంగా 20 మంది ఎంపీలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. ఈ రెబెల్ వర్గమంతా అధికార భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్‌డీఏ (NDA) కూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. మమతా బెనర్జీ జాతీయ స్థాయిలో 'ఇండియా' కూటమిలో భాగస్వామిగా ఉంటే.. ఆమె పార్టీ ఎంపీలు మాత్రం ఎన్‌డీఏ వైపు మొగ్గు చూపడం విశేషం.
పార్లమెంటు సభ్యత్వాన్ని కాపాడుకుంటూ, సాంకేతిక, న్యాయపరమైన చిక్కుల నుండి తప్పించుకోవడానికి తిరుగుబాటు ఎంపీలు అత్యంత పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేశారు. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ (ఫిరాయింపుల నిరోధక చట్టం) ప్రకారం.. ఏదైనా ఒక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులలో మూడింట రెండొంతుల మంది (2/3rd) విడిపోయి, వేరే పార్టీలో విలీనమైతే వారిపై అనర్హత వేటు పడదు.సరిగ్గా ఈ నిబంధననే ఆసరాగా చేసుకున్న రెబెల్స్.. 28 మందిలో 20 మందిగా (రెండు వంతుల కంటే ఎక్కువ) ఒకేతాటిపైకి వచ్చారు. అయితే, వారు టీఎంసీని రెండు ముక్కలుగా చీల్చి ప్రత్యేక వర్గంగా ఉండటం కంటే, న్యాయపరమైన రక్షణ కోసం అసలు ఉనికే లేని ఒక చిన్న ప్రాంతీయ పార్టీలో తమ వర్గాన్ని పూర్తిగా విలీనం (Merge) చేస్తున్నట్లు ప్రకటించారు. దీని ద్వారా తమది కేవలం 'ఫిరాయింపు' కాదు, చట్టబద్ధమైన 'విలీనం' అని నిరూపించుకునే ప్రయత్నం చేశారు.
రూ. 75 బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్న ‘ఎన్‌సీపీఐ’.. ఇప్పుడు లోక్‌సభలో 5వ పెద్ద పార్టీ!
ఈ 20 మంది ఎంపీలు విలీనం కావడానికి ఎంచుకున్న పార్టీ పేరు ‘నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా’ (NCPI). త్రిపుర కేంద్రంగా రిజిస్టర్ అయిన ఈ గుర్తింపు లేని ప్రాంతీయ పార్టీని గతంలో త్రిపుర, అస్సాం, మేఘాలయ, బెంగాల్ రాష్ట్రాల్లోని బెంగాలీ మాట్లాడే ప్రజల రక్షణ కోసం స్థాపించారు. ఈ పార్టీకి కనీసం ఒక వార్డు సభ్యుడు కూడా లేడు సరే కదా.. ఈ పార్టీ ఆర్థిక పరిస్థితి వింటే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. 2022-23 ఆర్థిక సంవత్సరాంతానికి ఈ పార్టీ బ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తం నగదు నిల్వ కేవలం రూ. 75 మాత్రమే. 2023-24, 2024-25 సంవత్సరాలకు సంబంధించిన కనీస ఆడిట్ నివేదికలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం (ECI) వద్ద లేవు. 2023 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టగా.. మొత్తంగా వచ్చిన ఓట్లు కేవలం 1198.
భర్త అధ్యక్షుడు..భార్య కోశాధికారి
చిత్రమేమిటంటే, వెస్ట్ బెంగాల్‌కు చెందిన ఉట్టియ కుందు ఈ పార్టీకి అధ్యక్షుడిగా ఉండగా, ఆయన భార్య షెవ్లీ కుందు కోశాధికారిగా వ్యవహరిస్తున్నారు. భార్యాభర్తల నేతృత్వంలోని ఈ నామమాత్రపు పార్టీలో ఇప్పుడు 20 మంది లోక్‌సభ ఎంపీలు చేరారు. స్పీకర్ గనుక ఈ విలీనానికి ఆమోదముద్ర వేస్తే.. ఒక్క రాత్రిలో ఈ పార్టీ భారత పార్లమెంటులోనే 5వ అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. మరోవైపు, ఇప్పటివరకు 4వ స్థానంలో ఉన్న మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ కేవలం 8 మంది ఎంపీలతో 9వ స్థానానికి పడిపోనుంది. ఈ కొత్త కూటమికి కకోలీ ఘోష్ దస్తిదార్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి, లోక్‌సభలో పక్ష నేతగా వ్యవహరించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ఊహించని రాజకీయ మలుపుపై రెబెల్ ఎంపీల నేత సుదీప్ బందోపాధ్యాయ స్పందిస్తూ.. "మేము నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీలో చేరాము, అది గుర్తింపు పొందిన పార్టీ. మా వర్గాన్ని అందులో విలీనం చేశాము. ఇక అసలైన టీఎంసీ ఏదనేది కోర్టులే నిర్ణయిస్తాయి" అని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో సమావేశమైన అనంతరం రెబెల్ ఎంపీలు ఢిల్లీలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి విలీన లేఖను సమర్పించారు. ఈ పరిణామాలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. ఈ సున్నితమైన అంశంపై ఆయన న్యాయనిపుణుల, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాన్ని కోరారు. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల లోపే దీనిపై తుది నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ పి.డి.టి. ఆచారి అభిప్రాయం ప్రకారం.. "పార్టీ లీడర్‌షిప్ ఆమోదంతో మొత్తం విలీనం జరిగితే ఫిరాయింపుల చట్టం వర్తించదు." కానీ, ఈ రెబెల్స్ ఎంచుకున్న వినూత్న మార్గం (చిన్న పార్టీలో విలీనం కావడం) గురించి చట్టంలో స్పష్టమైన ప్రస్తావనలు లేవని ఎన్నికల సంఘం మాజీ అధికారులు చెబుతున్నారు.
మరోవైపు మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ కీలక నేత అభిషేక్ బెనర్జీ స్పీకర్ ఓం బిర్లాకు అత్యవసర లేఖ రాశారు. లోక్‌సభలో తృణమూల్ కాంగ్రెస్‌ను ఒకే ఏకశిలా పార్టీగా పరిగణించాలని, పార్టీని వీడిన ఏ ఇతర తిరుగుబాటు వర్గానికి లేదా సమూహానికి ఎలాంటి అధికారిక గుర్తింపు, సదుపాయాలు కల్పించకూడదని ఆయన ఆ లేఖలో గట్టిగా విజ్ఞప్తి చేశారు. స్పీకర్ తీసుకోబోయే నిర్ణయంపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
Follow Us