/rtv/media/media_files/2026/06/13/aadhar-card-2026-06-13-19-59-26.jpg)
అస్సాం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి అక్రమ వలసలు రాకుండా అడ్డుకోవడానికి వీలుగా... ఇకపై 18 ఏళ్లు పైబడిన వారికి ఆధార్ కార్డులు ఇవ్వకూడదని అస్సాం క్యాబినెట్ నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ స్వయంగా వెల్లడించారు. బంగ్లాదేశ్ నుండి వచ్చే అక్రమ వలసదారులు ఎవరూ కూడా ఇక్కడి ఆధార్ కార్డులను సంపాదించకుండా చూడాలనే ఉద్దేశంతోనే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే చాలా అరుదైన కేసుల్లో, ఎవరికైనా ఆధార్ ఇవ్వాల్సి వస్తే... సదరు జిల్లా కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ప్రతిపాదనలు పంపించి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.
ఆధార్ కార్డులు ఇవ్వడంపై ఆంక్షలు
రాష్ట్రంలో ఇప్పటికే ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ దాదాపు అందరికీ పూర్తయిపోయిందని ముఖ్యమంత్రి శర్మ పేర్కొన్నారు. కొన్ని జిల్లాల్లో అయితే జనాభా కంటే ఎక్కువ మందికి అంటే 100 శాతానికి పైగా ఆధార్ కార్డులు జారీ అయ్యాయని, అలా అదనంగా ఆధార్ కార్డులు తీసుకుంటున్న ఆ వ్యక్తులు అసలు ఎవరనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇందుకోసమే పెద్దవాళ్లకు ఆధార్ కార్డులు ఇవ్వడంపై ఆంక్షలు పెడుతున్నట్లు చెప్పారు. గత ఏడాది కూడా వయోజనులకు ఆధార్ కార్డులు ఇచ్చే నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని, అస్సాంలో ఆధార్ కార్డు పొందడం ఇక అంత తేలిక కాదని ఆయన హెచ్చరించిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
అయితే ఈ నిబంధన నుండి కొన్ని వర్గాల ప్రజలకు ప్రస్తుతానికి మినహాయింపు ఇచ్చారు. తోట కార్మికులు, గిరిజనులు, దళితులు దివ్యాంగులకు మాత్రం ఆధార్ కార్డులు ఇవ్వడం కొనసాగిస్తారు. ఎందుకంటే వీరిలో చాలా మందికి ఇంకా ఆధార్ కార్డులు అందలేదు. అలాగే 18 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు కూడా ఆధార్ కార్డులు ఇస్తూనే ఉంటారు. కానీ, 2027 ఏప్రిల్ 1 నుండి ఈ నిషేధం అందరికీ పూర్తిగా వర్తిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఆ తేదీ తర్వాత పైన పేర్కొన్న వర్గాలకు చెందిన వారు కూడా 18 ఏళ్లు దాటితే కొత్తగా ఆధార్ కార్డు పొందడం కుదరదని తేల్చి చెప్పారు.
Follow Us