Election 2026: కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో నేడు పోలింగ్

కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో నేడు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది.

New Update
poling

కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాలలో నేడు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇందులో భాగంగా కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది.  ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలుకానుంది. ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లు కూడా చేసింది, ఈ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 1,849 మంది అభ్యర్థులు బరిలో ఉండటంతో, ఈ ఎన్నికల పోరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 

అస్సాంలో, మొత్తం 126 నియోజకవర్గాల్లో ఒకే రోజు పోలింగ్ జరుగుతుండటంతో, ఈ ఎన్నికను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరుగా పరిగణిస్తున్నారు.  అస్సాం ఎన్నికల బరిలో మొత్తం 722 మంది అభ్యర్థులు నిలవగా, కాంగ్రెస్ అత్యధికంగా 99 స్థానాల్లో, బీజేపీ 90 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. పోలింగ్ సజావుగా జరిగేలా చూసేందుకు, వయోవృద్ధులకు, దివ్యాంగులకు సహాయపడేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

మరోవైపు కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. అధికార ఎల్‌డీఎఫ్ వరుసగా మూడోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తుండగా, యూడీఎఫ్ తన పూర్వ వైభవం కోసం శ్రమిస్తోంది. మొత్తం 883 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 2.71 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెలువరించనున్నారు. అయితే కేరళలోని పాలక్కాడ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి శోభా సురేంద్రన్ ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి. ఈ ఆరోపణలను ఆమె ఖండించారు, తనను అప్రతిష్ట పాలు చేయడానికి కుట్ర జరుగుతోందని మండిపడ్డారు.

మే 4వ తేదీన ఫలితాలు

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో  సుమారు 9.5 లక్షల మంది ఓటర్లు 294 మంది అభ్యర్థుల భవిష్యత్తును నిర్ణయించనున్నారు. ఎన్నికల నిర్వహణ కోసం 1,099 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, భద్రత దృష్ట్యా డ్రోన్ల ద్వారా నిఘా ఉంచినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తనిఖీల్లో భాగంగా సుమారు రూ. 77 లక్షల నగదు, భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రాష్ట్రాలన్నింటి ఎన్నికల ఫలితాలు పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఫలితాలతో పాటు మే 4వ తేదీన వెలువడనున్నాయి.

Advertisment
తాజా కథనాలు