ఫిబ్రవరి 5న జరలబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు కేంద్ర ఆరోగ్య మంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ పాలనపై విరక్తి చెందారని.. బీజేపీ పరిపాలనను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈసారి ఆప్- పార్టీకి గుణపాఠం చెప్పాలని ఢిల్లీ ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ వినూత్న అవినీతికి నాయకత్వం వహిస్తున్నారని ఆరోపించారు.
కేజ్రీవాల్ అవినీతి, పాలనా రాహిత్యంతో ప్రజలు విసిగిపోయారని.. ఇప్పుడు ఢిల్లీకి బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వం అవసరమని తేల్చి చెప్పారు. అరవింద్ కేజ్రీవాల్ అబద్ధాల ఎన్సైక్లోపీడియా అని విమర్శించిన నడ్డా.. దీనిని ఢిల్లీ ప్రజలు అర్థం చేసుకున్నారని తెలిపారు. ఢిల్లీలో బీజేపీ అట్టడుగు స్థాయి ఉనికిని బూత్ స్థాయిలో గణనీయంగా బలోపేతం చేసిందని నడ్డా పేర్కొన్నారు. ఢిల్లీలో బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్నకు నడ్డా సమాధానం ఇచ్చారు. ప్రతి రాజకీయ పార్టీకి ఒక్కో వ్యూహం ఉంటుందన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ తో పాటుగా అనేక రాష్ట్రాల్లో తాము ముఖ్యమంత్రి ఎవరనేది ముందుగా ప్రకటించలేదని.. ఢిల్లీకి సంబంధించినంత వరకు, తాము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్నికలలో పోటీ చేస్తున్నామని అన్నారాయన.
ఫిబ్రవరి 5న ఎన్నికలు
ఢిల్లీలోని మొత్తం 70 నియోజవర్గాలకు ఫిబ్రవరి 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార, విపక్ష పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘన విజయం సాధించింది. ఇక్కడ మొత్తం 70 సీట్లకు గాను ఆప్ 62 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క అభ్యర్థి కూడా గెలవలేకపోయారు.
Also Read : రంజీలో తన వికెట్ తీసిన బౌలర్ పై విరాట్ కోహ్లీ ప్రశంసలు