/rtv/media/media_files/2026/02/05/bcci-2026-02-05-21-45-21.jpg)
BCCI మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు అనురాగ్ ఠాకూర్‌కు సుప్రీంకోర్టులో భారీ ఉపశమనం లభించింది. దాదాపు తొమ్మిదేళ్లుగా ఆయనపై ఉన్న ఆంక్షలను తొలగిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈరోజు (ఫిబ్రవరి 5, 2026) చారిత్రక తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంతో ఆయన తిరిగి క్రికెట్ పరిపాలనలో చురుగ్గా పాల్గొనేందుకు మార్గం సుగమమైంది. బీసీసీఐలో లోధా సంస్కరణల తర్వాత అనేక మార్పులు వచ్చాయి. ప్రస్తుత తీర్పుతో అనురాగ్ ఠాకూర్ మళ్ళీ క్రికెట్ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఆయన తన ప్రస్థానాన్ని మళ్ళీ మొదలుపెట్టే అవకాశం ఉంది.
బీసీసీఐ సంస్కరణల కోసం జస్టిస్ లోధా కమిటీ ఇచ్చిన సిఫార్సుల అమలు విషయంలో 2017లో అనురాగ్ ఠాకూర్ సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురయ్యారు. ఆ సమయంలో ICC జోక్యాన్ని కోరుతూ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారనే ఆరోపణలపై కోర్టు ఆయనను అధ్యక్ష పదవి నుంచి తొలగించడమే కాకుండా, బీసీసీఐ వ్యవహారాల్లో పాల్గొనకుండా “cease and desist” (నిరోధక) ఆదేశాలు జారీ చేసింది. ఆయనపై కోర్టు ధిక్కరణ మరియు అబద్ధ ప్రమాణం కింద కేసులు కూడా నమోదయ్యాయి.
ఆ తర్వాతి కాలంలో అనురాగ్ ఠాకూర్ కోర్టుకు స్వయంగా హాజరై, బేషరతుగా క్షమాపణలు కోరారు. ఆయన విన్నపాన్ని మన్నించిన సుప్రీంకోర్టు 2017 జూలైలోనే క్రిమినల్ కేసులను రద్దు చేసినప్పటికీ, క్రికెట్ బోర్డు కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉన్న నిషేధం మాత్రం కొనసాగుతూనే ఉంది.
సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
తాజాగా అనురాగ్ ఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం పాత ఆదేశాలను సవరించింది. ఈ సందర్భంగా కోర్టు డాక్టరీన్ ఆఫ్ ప్రోపోర్షనాలిటీ అనే న్యాయ సూత్రాన్ని ప్రస్తావించింది. అంటే, ఒక తప్పుకు విధించే శిక్ష లేదా ఆంక్ష అనేది ఆ తప్పు తీవ్రతకు తగినట్లుగానే ఉండాలి తప్ప, అపరిమితంగా ఉండకూడదని కోర్టు అభిప్రాయపడింది.
కోర్టు తీర్పులోని ముఖ్యాంశాలు:
2017 జనవరిలో విధించిన నిషేధ ఉత్తర్వులను సవరించడమైనది.
అనురాగ్ ఠాకూర్ ఇప్పటికే క్షమాపణ కోరినందున, ఆయనను ఇకపై క్రికెట్ బోర్డు పనులకు దూరం పెట్టడం సరికాదు.
ఇకపై నియమ నిబంధనలకు లోబడి ఆయన బీసీసీఐ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు లేదా ఏవైనా బాధ్యతలు చేపట్టవచ్చు.
Follow Us