AIADMK : మహిళలకే కాదు, పురుషులకూ ఫ్రీ బస్సు..  అన్నాడీఎంకే సంచలన మేనిఫెస్టో!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం AIADMK (అన్నా డీఎంకే) తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రజలపై వరాల జల్లు కురిపించింది.

New Update
manifesto

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షం AIADMK (అన్నా డీఎంకే) తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తూ ప్రజలపై వరాల జల్లు కురిపించింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు,  పేద కుటుంబాలను ఆకట్టుకునేలా అంచనాలకు మించిన హామీలను ప్రకటించింది.

రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఉచితంగా ఫ్రిజ్ అందజేస్తామని పార్టీ ప్రకటించింది. అంతేకాకుండా, ఐదు లక్షల మంది శ్రామిక మహిళలకు టూ-వీలర్ కొనుగోలుపై 'అమ్మ' పథకం కింద 25,000 రూపాయల సబ్సిడీ ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రస్తుతం మహిళలకు ఉన్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని పురుషులకు కూడా వర్తింపజేస్తామని తెలపడం విశేషం.

ప్రతి కుటుంబానికి రూ. 10వేలు

పెరుగుతున్న ధరలు, పన్నుల భారం నుండి ఉపశమనం కలిగించడానికి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల నగదు అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వృద్ధాప్య పెన్షన్ , ఇతర సామాజిక భద్రతా పింఛన్లను ప్రస్తుతం ఉన్న మొత్తం నుండి 2,000 రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు నెలకు ఒక కిలో పప్పు, ఒక లీటరు వంట నూనె ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అలాగే, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇచ్చే పథకాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పని దినాలను 100 నుండి 150 రోజులకు పెంచుతామని, తద్వారా గ్రామీణ ప్రజల ఆదాయం పెరుగుతుందని పార్టీ పేర్కొంది. అలాగే, తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టులో పాల్గొనే క్రీడాకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించింది. 

తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 4న విడుదలవుతాయి. ఈసారి ఎన్నికల్లో డీఎంకే, ఏఐఏడీఎంకేలతో పాటు బీజేపీ, విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK), కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ నెలకొంది.

Advertisment
తాజా కథనాలు