BJPని వీడిన అన్నామలైకి భారీ మద్దతు: 24 గంటల్లోనే 14 లక్షల మంది!

మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలైకి, బీజేపీ అధిష్ఠానానికి మధ్య గత 18 నెలలుగా తమిళనాడు రాజకీయ వ్యూహాలపై తీవ్రమైన విభేదాలు నడుస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన తన రాజీనామా లేఖలో కూడా స్పష్టంగా పేర్కొన్నారు.

New Update
annamalai

తమిళనాడు రాజకీయాల్లో ఒక భారీ సంచలనం నమోదైంది. గత కొన్నాళ్లుగా ఊగిసలాడుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ బీజేపీకి అన్నామలై రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను బీజేపీ అధిష్ఠానం ఆమోదించిన నిమిషాల వ్యవధిలోనే.. అన్నామలై తన సొంత రాజకీయ ఉద్యమాన్ని ప్రకటిస్తూ సరికొత్త బాంబు పేల్చారు. ఆయన పిలుపునకు సోషల్ మీడియా, గ్రౌండ్ లెవెల్‌లో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. కేవలం 24 గంటలు తిరక్కుండానే దాదాపు 14 లక్షల మంది ప్రజలు ఆయన కొత్త మూవ్‌మెంట్‌లో డిజిటల్‌గా సైన్ అప్ చేసి మద్దతు తెలపడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలైకి, బీజేపీ అధిష్ఠానానికి మధ్య గత 18 నెలలుగా తమిళనాడు రాజకీయ వ్యూహాలపై తీవ్రమైన విభేదాలు నడుస్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన తన రాజీనామా లేఖలో కూడా స్పష్టంగా పేర్కొన్నారు. తమిళనాడులో సంస్కృతి మూలాలు దెబ్బతినకుండా, ఒక సరికొత్త తరహా అభివృద్ధి రాజకీయాలు చేయాలనే తన ఆలోచనలు.. బీజేపీ అగ్రనాయకత్వం భావాలతో ఏకీభవించడం లేదని, అందుకే ఇకపై వారిపై భారం కాకూడదనే ఉద్దేశంతోనే పార్టీని వీడుతున్నట్లు అన్నామలై స్పష్టం చేశారు. 2020లో సివిల్ సర్వీసెస్‌ను వదిలేసి బీజేపీలో చేరిన అన్నామలై, కేవలం ఏడాదిలోనే 37 ఏళ్ల వయసులో స్టేట్ చీఫ్ అయ్యారు. కానీ ఇప్పుడు పార్టీతో లైన్ కలవకపోవడంతో బయటకు వచ్చేశారు.

తన రాజకీయ ప్రయాణంలో ఇది "తదుపరి అంకం" అని ప్రకటించిన అన్నామలై.. రాష్ట్రంలోని యువతను, సామాన్య ప్రజలను తన వెంట నడవాలని కోరారు. ఒక సామాన్యుడు రాజకీయాల్లోకి రావడం చాలా పెద్ద విషయం. శాశ్వతంగా కొందరే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఉండే సంస్కృతికి చరమగీతం పాడాలి. మేము లీడర్ల చుట్టూ తిరిగే పాలిటిక్స్ కాకుండా, ప్రజల కేంద్రంగా సాగే రాజకీయాలను తీసుకురావాలని అనుకుంటున్నాం. కుటుంబ రాజకీయాలకు, ఒకే వ్యక్తిని పూజించే సంస్కృతికి వ్యతిరేకంగా భవిష్యత్తు తరాల కోసం ఈ మార్పు మొదలైంది అని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ కొత్త ప్రయాణానికి చాలా ఓపిక కావాలని, అడుగు అడుగు వేస్తూ పెద్ద లక్ష్యాలను సాధిస్తామని అన్నారు.

మార్పు మొదలుపెట్టండి

అన్నామలై పిలుపునిచ్చిన వెంటనే ఆయన ప్రారంభించిన వి ది లీడర్స్ అనే వెబ్‌సైట్‌కు జనాలు పోటెత్తారు. ఈ వార్త రాసే సమయానికి ఆ సైట్‌లో 13,85,763 మంది యాక్టివ్ మెంబర్లుగా చేరారు. సామాన్య ప్రజలే మా ఉద్యమానికి ప్రాణం.. విద్య, ఆరోగ్యం, పర్యావరణం, యూత్ లీడర్‌షిప్.. ఇలా మీకు నచ్చిన రంగంలో మాతో కలిసి చిన్న స్థాయి నుండి మార్పు మొదలుపెట్టండి అని ఆ వెబ్‌సైట్ ద్వారా పిలుపునిచ్చారు.

ఈ కొత్త వేదిక ద్వారానే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు నుండి తమ అభ్యర్థులను నిలబెడతామని అన్నామలై క్లారిటీ ఇచ్చారు. సాంప్రదాయ పార్టీల లాగా కాకుండా, భవిష్యత్తు కోసం ఎంతో మంది కొత్త లీడర్లను తయారు చేయడమే తన టార్గెట్ అని చెప్పారు. రాజకీయాలు అంటే కేవలం కొందరు ధనవంతులు, పలుకుబడి ఉన్నవారికి మాత్రమే సొంతం అనే ముద్రను చెరిపేయడానికే ఆరేళ్ల క్రితం నేను పాలిటిక్స్‌లోకి వచ్చాను. నన్ను నమ్మండి, నా వెంట రండి అని అన్నామలై తమిళనాడు ప్రజలను ఎమోషనల్‌గా కోరారు.

Advertisment
తాజా కథనాలు