Bihar : బీహార్‌లో విచిత్రం.. రాత్రికి రాత్రే మాయమైన 132 అడుగుల మొబైల్ టవర్!

బీహార్‌లోని బక్సర్ జిల్లాలో నమ్మలేని విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అందరూ చూస్తుండగానే ఒక నివాస ప్రాంతం మధ్యలో ఉన్న 132 అడుగుల భారీ మొబైల్ టవర్, దాంతో పాటు ఉన్న ఒక 15 కేవీఏ పెద్ద జనరేటర్ అకస్మాత్తుగా మాయమైపోయాయి.

New Update
mobile tower

బీహార్‌లోని బక్సర్ జిల్లాలో నమ్మలేని విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అందరూ చూస్తుండగానే ఒక నివాస ప్రాంతం మధ్యలో ఉన్న 132 అడుగుల భారీ మొబైల్ టవర్, దాంతో పాటు ఉన్న ఒక 15 కేవీఏ పెద్ద జనరేటర్ అకస్మాత్తుగా మాయమైపోయాయి. ఈ వింత దొంగతనం స్థానిక ప్రజలతో పాటు పోలీసులను కూడా తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. అంత పెద్ద టవర్ ఎవరికీ తెలీకుండా ఎలా మాయమైందో అర్థం కాక అందరూ తలలు పట్టుకుంటున్నారు.

ఈ వింత ఘటన దుమ్రావ్ ప్రాంతంలో జరిగింది. చాలా కాలంగా పని చేయకుండా మూలన పడి ఉన్న ఈ మొబైల్ టవర్‌ను రిపేర్ చేయడానికి జీటీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీకి చెందిన అధికారులు, ఉద్యోగులు అక్కడికి చేరుకున్నారు. తీరా అక్కడికి వెళ్లి చూసేసరికి వారికి మైండ్ బ్లాంక్ అయింది. అక్కడ ఉండాల్సిన 132 అడుగుల భారీ టవర్ కనిపించలేదు. కేవలం టవర్ మాత్రమే కాదు, అక్కడ ఉన్న భారీ జనరేటర్ సెట్, ఇతర సాంకేతిక పరికరాలు కూడా మాయమయ్యాయి. దీంతో షాక్‌కు గురైన కంపెనీ ప్రతినిధి వెంటనే దుమ్రావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ టవర్‌ను, సామాన్లను ఎవరో దొంగిలించారని ఆయన ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

ఈ టవర్ ఉన్న స్థల యజమాని హరేనాథ్ యాదవ్ ఈ విషయంపై మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వివరాలు చెప్పారు. 2010లో సదరు మొబైల్ కంపెనీ తన స్థలంలో టవర్ పెట్టడానికి 12 ఏళ్ల ఒప్పందం చేసుకుందని ఆయన తెలిపారు. ఆ ఒప్పందం 2022తో ముగిసిపోయిందని, అప్పటి నుండి కంపెనీ తనకు ఎలాంటి అద్దె డబ్బులు చెల్లించలేదని చెప్పారు. బాకీ ఉన్న డబ్బుల కోసం కంపెనీకి నాలుగు సార్లు నోటీసులు పంపినా ఎలాంటి స్పందన లేదని, ఇప్పుడు చూస్తే అసలు టవర్, దానికి సంబంధించిన సామాన్లు ఏవీ అక్కడ లేవని ఆయన అన్నారు.

మరోవైపు స్థానికులు చెబుతున్న దాని ప్రకారం.. ఆ టవర్ దాదాపు 15 ఏళ్లుగా అక్కడే ఉంది. అయితే గత 15-20 రోజుల నుండి అది అక్కడ కనిపించడం లేదు. మొదట్లో టవర్ కంపెనీ వాళ్లే వచ్చి దానిని విప్పి తీసుకెళ్లిపోయారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు అది దొంగతనం జరిగిందని తెలిసి ఊళ్లో జనాలు అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తోంది.

అన్ని కోణాల్లో దర్యాప్తు

ఈ ఘటనపై బక్సర్ ఎస్పీ శుభం ఆర్య స్పందిస్తూ.. టవర్ మాయమవడంపై తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, స్థల యజమానితో పాటు మరికొంత మందిని పిలిచి విచారిస్తామని తెలిపారు. విచారణలో తేలిన వివరాల బట్టి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ వింత దొంగతనం స్థానిక ప్రజల్లో ఒక రకమైన భయాన్ని, ఆందోళనను రేకెత్తించింది. అంత పెద్ద నివాస ప్రాంతంలో, అందరూ తిరిగే చోట, అంత భారీ టవర్‌ను, అంత బరువైన జనరేటర్‌ను ఎవరికీ అనుమానం రాకుండా ఎలా దొంగిలించారని జనాలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన చూస్తుంటే తమ ఆస్తులకు రక్షణ ఏముంటుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

Advertisment
తాజా కథనాలు