పవర్ ప్లాంట్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి

ఛత్తీస్‌గఢ్ శక్తి జిల్లాలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సింగీతరాయ్ ప్రాంతంలోని వేదాంత లిమిటెడ్ పవర్ ప్లాంట్‌లో బాయిలర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.

New Update
boiler explosion

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని శక్తి జిల్లాలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సింగీతరాయ్ ప్రాంతంలోని వేదాంత లిమిటెడ్ పవర్ ప్లాంట్‌లో బాయిలర్ ఒక్కసారిగా పేలిపోవడంతో పెను విషాదం చోటుచేసుకుంది. ఈ ధాటికి ఇప్పటివరకు 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో 30 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

మంగళవారం మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో కార్మికులు విధుల్లో ఉండగా ప్లాంట్‌లోని బాయిలర్ యూనిట్‌లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే.. ఆ శబ్దం చుట్టుపక్కల కిలోమీటరు దూరం వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. ఒక్కసారిగా దట్టమైన పొగ, మంటలు వ్యాపించడంతో ప్లాంట్ లోపల ఉన్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా యంత్రాంగం, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే శక్తి, రాయ్‌గఢ్‌లోని సమీప ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ సుమారు 50 మందికి పైగా కార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. శిథిలాల కింద ఇంకా కొందరు చిక్కుకుని ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. NDRF, స్థానిక బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. శిథిలాలను తొలగించి ఎవరైనా చిక్కుకున్నారా అనే కోణంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవో సాయి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ ఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు.

ప్రాథమిక విచారణ ప్రకారం, ప్లాంట్‌ నిర్వహణలో సాంకేతిక లోపం లేదా భద్రతా ప్రమాణాల ఉల్లంఘన వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వేదాంత యాజమాన్యం కూడా అంతర్గత విచారణకు ఆదేశించింది. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. పారిశ్రామిక భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisment
తాజా కథనాలు