/rtv/media/media_files/2026/05/15/arrest-2026-05-15-14-42-30.jpg)
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. విదేశీ పాస్‌పోర్టులు ఉండి కూడా గత నెలలో జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేశారనే ఆరోపణలపై 10 మంది విదేశీయులను ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేశారు. వీరిలో ఎక్కువ మంది శ్రీలంక దేశస్థులు కాగా, బ్రిటన్, కెనడా, ఇండోనేషియాకు చెందిన వారు కూడా ఉన్నారు.
అసలు వీళ్లు ఎలా దొరికారు అంటే.. చెన్నై , మదురై విమానాశ్రయాల్లో వీరు విదేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. ఆ సమయంలో వారి చూపుడు వేలికి ఓటు వేసినప్పుడు పెట్టే సిరా గుర్తు ఉండటాన్ని అధికారులు గమనించారు. విదేశీ పాస్‌పోర్టు ఉన్న వ్యక్తికి భారత్‌లో ఓటు వేసే హక్కు ఉండదు. కానీ వీరి వేలిపై సిరా గుర్తు ఉండటంతో అధికారులకు అనుమానం వచ్చి విచారించగా అసలు విషయం బయటపడింది.
దొరికిన వారిలో శ్రీలంక నుంచి రంజని, సర్ఫుద్దీన్, నిలంతి, జయంతన్, చార్లీ బాలచంద్రన్, చక్రవర్తి లోకప్రియ, సునీత చక్రవర్తి ఉన్నారు. బ్రిటన్ నుంచి అయ్యదురై, ఇండోనేషియా నుంచి తితిన్ మరియట్టి, కెనడా నుంచి జిత్తేంద్రనాథ్ ఉన్నారు.
విదేశీ పాస్‌పోర్టులతో పాటు
భారత చట్టాల ప్రకారం, విదేశీ పాస్‌పోర్టు కలిగి ఉండి, భారత ఎన్నికల సంఘం జారీ చేసిన ఓటర్ ఐడి కార్డును కలిగి ఉండటం చట్టవిరుద్ధం. వీరి వద్ద విదేశీ పాస్‌పోర్టులతో పాటు భారత ఓటర్ ఐడిలు కూడా ఉన్నాయని అధికారులు గుర్తించారు. అసలు వీరికి ఓటర్ కార్డులు ఎలా వచ్చాయి? దీని వెనుక ఎవరి ప్రమేయం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
తమిళనాడులో ఎన్నికల కంటే ముందే ఓటర్ల జాబితాను శుద్ధి చేసే ప్రక్రియ జరిగింది. ఇందులో భాగంగా చనిపోయిన వారు, ఊరు విడిచి వెళ్లిన వారి పేర్లను తొలగించారు. సుమారు 74 లక్షల పేర్లను జాబితా నుండి తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఇంత నిశితంగా పరిశీలించినా, విదేశీయుల పేర్లు ఓటర్ల జాబితాలో ఎలా ఉన్నాయి? అధికారులు వెరిఫికేషన్ చేయడంలో ఎక్కడ పొరపాటు జరిగింది? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
Follow Us