Maoist: మావోయిస్టు రహిత దేశాన్ని చూడడం సాధ్యమేనా? చరిత్ర ఏం చెబుతోంది?

నిన్న జగన్‌.. నేడు లచ్చన్న. మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఈ పరిణామాలు చూస్తుంటే అమిత్‌షా లక్ష్యం నేరవేర్చుకుంటారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మావోయిస్టు రహిత దేశాన్ని చూడడం సాధ్యమేనా? చరిత్ర ఏం చెబుతోంది? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Maoist: మావోయిస్టు రహిత దేశాన్ని చూడడం సాధ్యమేనా? చరిత్ర ఏం చెబుతోంది?

Maoist encounters: '2026 మార్చి నాటికి భారత్‌ నుంచి మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తాం..'గత ఆగస్టు 24న ఛత్తీస్‌గఢ్‌ పర్యటనలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు ఇవి! అందుకు తగ్గట్టుగానే పోలీసుల తమ తుపాకులకు పనిచెబుతున్నారు. వరుస ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు కీలక నేతలను కాల్చి చంపుతున్నారు. నిన్న జగన్‌.. నేడు లచ్చన్న.. ఇలా ఒకరి తర్వాత ఒకరు పోలీసుల బుల్లెట్లకు నేలకొరుగుతున్నారు. రెండు రోజుల్లో 16మంది మావోయిస్టులు చనిపోగా అందులో ఎక్కువగా మహిళలే ఉన్నారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అమిత్‌షా తన లక్ష్యాన్ని నేరవేర్చుకుంటారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే నిజంగా మావోయిస్టు రహిత దేశాన్ని చూడడం సాధ్యమేనా? చరిత్ర ఏం చెబుతోంది?

నేలకొరుగుతున్న మావోయిస్టు అగ్రనేతలు..
నిజానికి 2024 ప్రారంభం నుంచి వరుస ఎన్‌కౌంటర్లతో ఛత్తీస్‌గఢ్‌ అడవులు దద్దరిల్లుతున్నాయి. భద్రాద్రి- ములుగు సరిహద్దు కరకగూడెం మండలం కల్వల నాగారం అటవీ ప్రాంతంలో తాజాగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. చనిపోయిన వారిలో పాల్వంచ - మణుగూరు- కరకగూడెం డీవీసీఎం లచ్చన్న కూడా ఉన్నారు. మరోవైపు మావోయిస్టు పార్టీ తొలి తరం నేత మాచర్ల ఏసోబు కూడా ఇటివలీ దంతెవాడ, బీజాపూర్ అటవీ ప్రాంతంలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ప్రాణాలు విడిచారు. ఇలా వరుస పెట్టి మావోయిస్టు అగ్రనేతలు చనిపోతుండడం ఆ సంస్థకు దెబ్బ మీద దెబ్బగా చెప్పాలి.

అమిత్‌షా పదేపదే చెబుతున్నారు..
2024లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు 160 మందికిపైగా చనిపోయారు. విష్ణుదేవ్ సాయ్‌ ఛత్తీస్‌గడ్‌ సీఎంగా ఎన్నికైన తర్వాత పోలీసులు మావోయిస్టుల మధ్య భారీగా కాల్పుల ఘటనలు జరిగాయి. బస్తర్ ప్రాంతంలోని కాంకేర్ జిల్లాలో 2024 ఏప్రిల్‌లో జరిగిన కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు చనిపోయారు. మరోవైపు జార్ఖండ్‌, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌తో పాటు దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాలపై పోలీస్‌ పహారా నడుస్తోంది. అటు 2026 నాటికి మావోయిస్టులు లేని దేశంగా ఇండియాను మారుస్తామని అమిత్‌షా పదేపదే చెబుతున్నారు.

సమాధాన్‌ మావోయిస్టు నిర్మూలన..
నిజానికి 2017లో అప్పటి కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ 'ఆపరేషన్‌ సమాధాన్‌' ప్రారంభించినప్పుడు కూడా ఇదే రకమైన టార్గెట్‌ పెట్టుకున్నారు. 2021 జూన్‌ చివరికి దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని తుడిచేస్తామని చెప్పారు. సమాధాన్‌ మావోయిస్టు నిర్మూలనలో చిట్ట చివరి ఆపరేషన్‌ అన్నారు. ఈ ఆపరేషన్‌ కోసం హెలికాప్టర్లు, అత్యాధునిక ఆయుధ సామాగ్రితో పాటు లెక్కలేనన్ని నిధులు కేటాయించారు. అయితే ఈ టార్గెట్‌ను రీచ్‌ అవ్వలేదు. ఇక 2024 జనవరి నుంచి ఆపరేషన్‌ కగార్‌ పేరిట మావోయిస్టుల చంపడం ప్రారంభమైంది. 2026 మార్చి నాటికి ఈ లక్ష్యం పూర్తవుతుందని కేంద్రం చెబుతోంది.

ఉద్యమాలు ఊరికే పుట్టవు..
ఇలా దేశంలో మావోయిస్టులను నిర్మూలిస్తామని ప్రభుత్వాలు చాలా సార్లు చెప్పాయి. అయితే పేదరికం ఉన్నంత కాలం మావోయిజం ఆంతం కాదని ఎర్రదండు మద్దతుదారులు అభిప్రాయపడుతుంటారు. గత రెండు దశాబ్దాలలో విప్లవోద్యమ నిర్మూలన కోసం రాజ్యం అనుసరించిన పద్ధతుల్లో హింస పెరిగిందని విమర్శిస్తున్నారు. మావోయిస్టులను అంతం చేయడానికిముందు దేశంలో ఏనాటి నుంచో తిష్ట వేసుకున్న దోపిడీ, పీడనల నుంచి దేశాన్ని విముక్తిచేయాలని సవాల్ చేస్తున్నారు. ఉద్యమాలు ఊరికే పుట్టవు..ఎవరూ పిచ్చెక్కి అడవి బాట పట్టరన్నది మావోయిస్టు మద్దతుదారుల మాట!

దళిత, గిరిజనల ప్రాణాలు తీసేస్తున్నారు..
మరోవైపు పోలీసులు జరుపుతున్న కాల్పుల్లో మావోయిస్టులతో పాటు అడవుల్లో ఉండే స్థానిక గిరిజనులు కూడా ఉంటున్నారన్నది ఆ సంస్థ ప్రధాన వాదన. అమాయక దళిత, గిరిజనల ప్రాణాలు తీసేస్తున్నారని మావోయిస్టులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసుల మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. నిజానికి ఇంతగా హింస పెరిగిపోయాక, అదొక యుద్ధ రూపం తీసుకున్నాక అందులోని సత్యాసత్యాలను అన్వేషించడం చాలా కష్టమైన పనే అవుతుంది. పచ్చని అడువులు ఎరుపెక్కడం వెనుక కారణాలు ఎన్నైనా ఉండొచ్చు.. అవి ఎవైనా కావొచ్చు.. అయితే ఈ స్థాయిలో హింస మంచిది కాదన్న అభిప్రాయాలు మానవహక్కుల సంఘాల నుంచి వ్యవక్తమవుతున్నాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు