INDIA alliance: ఢీ కొడతారా!.. డీలా పడతారా!.. మోదీ, షా ద్వయాన్ని ఖర్గే నిలువరిస్తారా! బీజేపీ ఓటమే ధ్యేయంగా ఇండియా పేరిట కూటమి కట్టిన విపక్షాల సమావేశం రాజకీయక్షేత్రంలో అనుసరించాల్సిన భవిష్యత్ వ్యూహాలను నిర్దేశించింది. వాయిదాల అనంతరం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన నాలుగో సమావేశంలో కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరు ప్రతిపాదనకు వచ్చింది. By Naren Kumar 19 Dec 2023 in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి INDIA alliance: బీజేపీ ఓటమే ధ్యేయంగా ఇండియా పేరిట కూటమి కట్టిన 27 విపక్షాల సమావేశం రాజకీయ క్షేత్రంలో అనుసరించాల్సిన భవిష్యత్ వ్యూహాలను నిర్దేశించుకుంది. మూడు వాయిదాల అనంతరం పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరిగిన నాలుగో సమావేశంలో కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిత్వంపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడిగా ఉన్న కన్నడ రాజకీయోద్దండుడు మల్లికార్జున ఖర్గేను ప్రధానమంత్రి అభ్యర్థిని చేయాలన్న ప్రతిపాదన సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏకాభిప్రాయం రాకపోయినప్పటికీ మెజార్టీ పక్షాలు దీనికి అభ్యంతరం చెప్పలేదట. నిర్వివాది, నిగర్విగా పేరున్న మల్లికార్జున ఖర్గే నిఖార్సైన కాంగ్రెస్ వాది. ఆయన రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్‌తోనే ముడిపడి ఉంది. 24ఏళ్ల తర్వాత తొలిసారి గాంధీయేతర కుటుంబం నుంచి పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన ఖర్గేను ఇండియా కూటమి ఇప్పుడు ప్రధాని అభ్యర్థిగా తెరమీదికి తెచ్చింది. అదీ ఆషామాషీ వ్యక్తులు కాదు.. తూర్పు భారతం నుంచి తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఇటీవలే జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్ వంటి హేమాహేమీలే ఖర్గే పేరును ముందుకు తేవడం దేశ రాజకీయాల్లో కీలక పరిణామమనే చెప్పాలి. అయితే, దాన్ని డీఎంకే దాన్ని కేవలం ప్రతిపాదనగానే చూడగా, సీతారాం ఏచూరీ అసలు చర్చే జరగలేదంటూ చెప్పుకొచ్చారు. నితీశ్ కుమార్ ఒక్కరే స్పష్టంగా ఆ ప్రతిపాదనకు అభ్యంతరం చెప్తున్నారట. మొత్తానికి చర్చ మొదలై, ఏకాభిప్రాయం దిశగా సాగుతుందన్నది తుది సమాచారం. ఇది కూడా చదవండి: మోదీ వర్సెస్ ఖర్గే.. ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్ సీనియర్.. ధ్రువీకరించిన ఎంపీ! విద్యార్థి నేత.. ఆపై కన్నడ కాంగ్రెస్‌లో పెద్దన్న గాంధీ కుటుంబానికి వీర విధేయుడైన ఖర్గే ఎనిమిది పదుల వయస్సులో కాంగ్రెస్ అధ్యక్షుడై సంస్థాగతంగా, సైద్ధాంతికంగా సంక్షోభంలో ఉన్న పార్టీ బాధ్యతను భుజాన వేసుకున్నారు. యువతకు ప్రాధాన్యం వంటి సంస్కరణలతో పార్టీలో జవసత్వాలను నింపేందుకు ప్రయత్నించారు. న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఖర్గే క్రమంగా కాంగ్రెస్ రాజకీయాల వైపు మళ్లారు. కార్మిక సంఘాలకు సంబంధించిన కేసులు వాదించేవారు. మొదట్లో విద్యార్థి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన ఖర్గే 1969లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 1972లో గుర్మిత్కల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి అనూహ్య విజయం సాధించారు. అనంతరం వరుసగా 9 సార్లు అక్కడి నుంచి గెలుస్తూ వచ్చారు. సామాజిక సమీకరణాలను, రాజకీయ వ్యూహాలను అన్నిటినీ అనుకూలంగా మలుచుకుంటూ దశాబ్ధాలుగా విజయాలు నమోదు చేస్తూ వస్తున్నారు. చితాపుర్ నుంచి కూడా గెలిచారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పలు శాఖల్లో మంత్రిగా కూడా ఖర్గే పని చేశారు. అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు.. 2009లో ఆయన కార్యక్షేత్రం పార్లమెంటుకు మారింది. గుల్బర్గా లోక్‌సభ స్థానం నుంచి మొదటిసారి ఎంపీగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టారు. తర్వాత 2014లో కూడా ఎంపీగా గెలిచినా, అనంతరం జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చేతిలో మొదటిసారి ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ ఆయనను 2021లో రాజ్యసభకు పంపింది. కేంద్రంలో యూపీఏ హయాంలో రైల్వే, కార్మిక శాఖలకు ఖర్గే మంత్రిగా పనిచేశారు. పార్లమెంటులో ప్రతిపక్షనేతగా కూడా వ్యవహరించారు. మోదీ - షా - నడ్డా త్రయాన్ని ఢీ కొడతారా! ప్రస్తుతం కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడిగా రాజకీయ జీవితంలో అత్యంత కఠిన పరీక్షను ఎదుర్కొంటున్న ఖర్గేకు ఎన్డీఏకు పోటీగా ఇండియా కూటమి తరఫున ప్రధాని అభ్యర్థిగా లభించిన అయాచిత మద్దతు లభించింది. అయితే, 2014 నుంచి మోదీ, షా నేతృత్వంలో బీజేపీకి క్రమంగా పెరుగుతున్న గ్రాఫ్‌ను ఖర్గే నియంత్రించగలరా అన్న సందేహాలు వెలువడుతున్నాయి. దశాబ్ధ కాలంగా అనేక రాష్ట్రాలతో పాటు పార్లమెంటులో కాంగ్రెస్ గణనీయంగా సీట్లను కోల్పోయింది. వరుస విజయాల బీజేపీని ఖర్గే అభ్యర్థిత్వంతో నిలువరించేందుకు ఇండియా కూటమి ఏ వ్యూహాలు అవలంభిస్తుందన్నది కూడా ఆసక్తికరమైన అంశం. మరోవైపు మోదీ చరిష్మాను తట్టుకుని ఖర్గే నిలవగలరా అన్నదీ చర్చనీయమవుతోంది. చీటికీ మాటికీ గాంధీ కుటుంబాన్ని తాను కలవబోనంటూ మొదట్లో ప్రకటించి స్వతంత్రతను చాటుకునే ప్రయత్నం చేసిన ఖర్గే కొన్ని సవాళ్లను బాగానే అధిగమించారు. తాను రబ్బర్ స్టాంపును కాదన్న సంకేతాలిచ్చారు. సౌమ్యుడిగా, కాంగ్రెస్‌లో వివాదాలు పరిష్కరించడంలో ట్రబుల్ షూటర్‌గా ఖర్గేకు మంచిపేరుంది. అయినప్పటికీ కూటమిలో ఎత్తులు, వ్యూహాలకు తోడు పార్టీలో అంతర్గత అసంతృప్తులనూ ఖర్గే ఎదుర్కోవాల్సి ఉంటుంది. మాటలు, వ్యూహాల్లో మోదీ షా ద్వయాన్ని ఎదుర్కోవడం అంత సులభం కాదన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. నితీశ్ నిర్ణయమేమిటో! ఇవిలా ఉండగా, ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న జేడీయూ అధినేత పయనమెటు వైపు ఉంటుందన్నది కీలకమైన అంశం. ఖర్గే అభ్యర్థిత్వంపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఆయన ఎటు అడుగులు వేస్తారో చూడాలి. నితీశ్ నిర్ణయం కూటమిపై ఏ మేరకు ప్రభావం చూపుతుందన్నది కూడా చర్చనీయమైన అంశం. అయితే, కూటమిలో పెద్ద పార్టీలుగా ఉన్న తృణమూల్, ఆప్‌తో సహా, డీఎంకే వంటి పార్టీలు కూడా ఖర్గే అభ్యర్థిత్వంపై పెద్దగా అభ్యంతరాలు చెప్పకపోవచ్చని ప్రస్తుత పరిణామాలను బట్టి తెలుస్తోంది. మొత్తానికి కర్ణాటక కాంగ్రెస్ నుంచి జాతీయ రాజకీయాల్లో ప్రతిపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిత్వం ప్రతిపాదన వరకూ ఖర్గే రాజకీయ జీవితం చివరి దశలో ఏ మలుపులు తీసుకుంటుందో చూడాలి. #aravind-kejriwal #mamata-banerjee #india-alliance #aicc-president-mallikarjun-kharge మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి