Lok sabha 2024: బీఆర్ఎస్ ఘోర పరాభవం.. ఈ కారణాలే కేసీఆర్ ను దెబ్బతీశాయా!

బీఆర్ఎస్ కు మరోసారి తీవ్ర నిరాశే ఎదురైంది. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఎందుకు పక్కనపెట్టేశారు. కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా అవకాశం ఇవ్వకపోవడానికి కారణలేంటి? అసెంబ్లీలాగే అభ్యర్థుల ఎంపికలో తప్పు చేశారా? అసలు కారణాలేంటో తెలుసుకునేందుకు పూర్తి ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Lok sabha 2024: బీఆర్ఎస్ ఘోర పరాభవం.. ఈ కారణాలే కేసీఆర్ ను దెబ్బతీశాయా!

BRS: తెలంగాణలో బీఆర్ఎస్ కు మరోసారి నిరాశే మిగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని పరాభవం ఎదుర్కొన్న కేసీఆర్ పార్టీ ఇప్పుడు లోక్ సభ బరిలోనూ ఏ మాత్రం ప్రభావం చూపలేక చతికిలపడిపోయింది. అసెంబ్లీ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని ప్రజలకు దగ్గరయ్యేందుకు ముప్పు తిప్పలు పడ్డ బీఆర్ఎస్ నాయకుల ప్రయత్నాలు ఫలించలేదు. రాష్ట్రంలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలిసి మరోసారి సత్తా చాటాలనుకున్న కేసీఆర్ ఆశలు ఆవిరైపోయాయి. బస్సు యాత్రతో రాష్ట్రమంతా చుట్టేసిన కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గొంతుచించుకుని అరిచినా తెలంగాణ ప్రజలు పట్టించుకోలేదని ఈ ఎన్నిక స్పష్టం చేస్తోంది. మరి బీఆర్ఎస్ పార్టీ ఇంత దారుణంగా విఫలమవడానికి కారణాలేంటి? కనీసం ఒక్కసీటు కూడా గెలిపించుకోలేకపోయిన కేసీఆర్ చేసిన తప్పులేంటి?

అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులే మళ్లీ..
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, ఆ వెంటనే కేసీఆర్ కు కాలు ప్రమాదం. ఈ కారణాలతో కొన్ని నెలల వరకు ఆయన బయటకు రాలేకపోయారు. అయితే లోక్ సభ ఎన్నికల సమయంలో బయటకొచ్చిన కేసీఆర్.. బస్సు యాత్ర పేరుతో పలు ప్రాంతాల ప్రజలను కలస్తూ ఇదే అదనుగా మెజార్టీ సీట్లు దక్కించుకోవాలనే ప్రయత్నం చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులే పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ మరింత జాగ్రత్త వహిస్తే ఎంపీ సీటు ఫలితం తమకు అనుకూలంగానే వచ్చేంది. మంచి ఇమేజ్ ఉన్న నేతను ఇక్కడి నుంచి బరిలోకి దించితే బీఆర్ఎస్ కు విజయావకాశాలు ఉండేవి. కానీ నియోజకవర్గ వ్యాప్తంగా పెద్దగా పరిచయం లేని రాగిడి లక్ష్మారెడ్డిని ఇక్కడ బరిలోకి దించడంతో ప్రజలు బీఆర్ఎస్ ను పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. మెదక్ లోనూ నాన్ లోకల్ అయిన వెంకట్రామిరెడ్డిని పోటీకి దించి బీఆర్ఎస్ పెద్ద తప్పు చేసింది. మల్లన్నసాగర్ నిర్వాసితులు, అవినీతి ఆరోపణలు అక్కడ బీఆర్ఎస్ విజయావకాశాలను దెబ్బతీశాయి. రఘునందన్ మాస్ ఇమేజ్ ముందు వెంకట్రామిరెడ్డి నిలబడలేకపోయారు.

బలమైన కేడర్ ను కాపాడుకోలేక పోవడం..
అలాగే చేవెళ్ల సెగ్మెంట్ పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ 4 సీట్లు గెలుచుకుంది. అక్కడ కూడా అభ్యర్థి బలంగా లేడన్న వాదన మైనస్ గా మారింది. రంజిత్ రెడ్డి, పోతుగంటి భరత్, నేతకాని వెంకటేష్ లాంటి సిట్టింగ్ ఎంపీలు పార్టీ మారుతున్నా ఆపలేకపోవడంతో.. బీఆర్ఎస్ పని అయిపోయిందనే సంకేతాలు వెళ్లాయి. టికెట్ ప్రకటించిన తర్వాత కూడా కడియం కావ్య, రంజిత్ రెడ్డి పార్టీ మారడం పార్టీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీశాయి. బీజేపీని గెలిపించడానికి బలహీనమైన అభ్యర్థులను నిలిపారన్న ప్రచారం కూడా దెబ్బతీసింది. ఉదాహరణకు.. చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్, మల్కాజ్ గిరిలో రాగిడి లక్ష్మారెడ్డి, భువనగిరిలో క్యామా మల్లేష్, మహబూబ్ నగర్ లో మన్నెం శ్రీనివాస్ రెడ్డి, జహీరాబాద్ లో గాలి అనిల్ కుమార్.. ఎన్నికల తర్వాత క్షేత్ర స్థాయిలో కేడర్ ను పార్లమెంట్ ఎన్నికలు వచ్చే వరకు కాపాడుకోలేక పోయింది. అసెంబ్లీ ఎన్నికలపై సమీక్షలు కూడా నిర్వహించడకపోవడం కూడా దెబ్బతీసింది. కడియం శ్రీహరి, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పట్నం దంపతులు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజే మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు తదితరులు పార్టీ మారడం కూడా బీఆర్ఎస్ బలాన్ని పూర్తిగా తగ్గించింది. ఇవే కాకుండా బీఆర్ఎస్ లో అంతర్గత సమ్యసలు, నాయకుల అలసత్వ ధోరణి కూడా కేసీఆర్ ను కోలుకోలేని దెబ్బ తీశాయని చెప్పొచ్చు.

Advertisment
Advertisment
తాజా కథనాలు