కేసీఆర్ కు కిషన్ రెడ్డి మరో బహిరంగ లేఖ.. ఎవరిమాట వినడంటూ సెటైర్లు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి రెండోసారి బహిరంగ లేఖ రాశారు. మాట తప్పితే కేసీఆర్ తల నరుక్కుంటానని ప్రగల్భాలు పలికి అధికారంలోకి రాగానే ఎందుకు ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కారంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు.

New Update
కేసీఆర్ కు కిషన్ రెడ్డి మరో బహిరంగ లేఖ.. ఎవరిమాట వినడంటూ సెటైర్లు

తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రెండోసారి బహిరంగ లేఖ రాశారు. ఇందులో దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని ఉద్యమ సమయంలో దళిత వర్గాలను మభ్యపెట్టి దారుణంగా మోసం చేశాడని కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మాట తప్పితే కేసీఆర్ తల నరుక్కుంటానని ప్రగల్భాలు పలికారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఎందుకు ఆ వాగ్దానాన్ని తుంగలో తొక్కారని ప్రశ్నించారు. రాష్ట్రంలోని 20శాతానికి పైగా ఉన్న దళిత, అణగారిన వర్గాలను మభ్యపెట్టి పబ్బం గడుపుకోవాలనే కుట్ర ఎలా చేయగలిగారని పలు ప్రశ్నలు లేవనెత్తారు.

అప్రజాస్వామికం మీ మనస్తత్వం!
ప్రజాస్వామ్యం తోకలేని పక్షిలా మారిందని ఎవరు అన్నారో గానీ.. దాని తోకల్ని, ఈకల్ని, రెక్కల్ని పీకేసి మీలాంటి నియంతలు వాటిని తమ మకుటాలకు అలంకరించుకుంటారు. ఉద్యమనాయకుడిగా చెలామణి అయి 2014లో అధికారంలోకి వచ్చాక ‘కేసీఆర్ ఎవరిమాటా వినడు’ అన్నట్లు తయారయ్యారు. ఉద్యమకాలంలో అన్ని పార్టీల గడపలు తొక్కిన మీరు.. అధికారం చేపట్టాక ఆ పార్టీల అస్తిత్వాలను తొక్కేసేలా వ్యవహరిస్తున్న విషయం వాస్తవం కాదా? ఉద్యమంలో ఉన్న రాజకీయ జేఏసీలోని ప్రజాసంఘాలు, ఉద్యోగ, కార్మిక సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు, విద్యావంతులు, మేధావులను ఒక్కరొక్కరిగా దూరం పెట్టింది మీరు కాదా? ఈ విషయం తన కొంప మునిగేంతవరకు చాలామంది ఉద్యమకారులకు అర్థం కాలేదు. మీ ఆలోచన తెలిసిన వారికి ఇదేం కొత్త విషయం కాదు. మీతో కలిసున్న వారిలోనూ చాలా మందికి ఇప్పుడిప్పుడే మీ మనస్తత్వం పూర్తిగా బోధపడుతోంది.

ఈ మనస్తత్వం వెనక ఉన్నది మీలోని అహంకారం, మీ నియంతృత్వ ధోరణి. ‘అంతా నేనే’ అన్న హిరణ్యకశ్యపుని స్వభావం. మీ దృష్టిలో ప్రజలంటే మీరు చెప్పింది వినే అమాయకులు. మీ సమావేశాల్లో వారిని కసురుకునే స్వభావం చూస్తేనే అంతా అర్థమైపోతుంది. మీ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. మీరు చెప్పింది విని తలూపే ‘డూడూ బసవన్న’లు. టీవీలను, పత్రికలను 10 కిలోమీటర్ల లోతులో పాతిపెడతానన్న తర్వాత వాళ్లలో కొందరు మీకు వ్యతిరేకంగా రాయడం లేదు. ఉద్యమంలో నచ్చిన రాతలు ఆ తర్వాత పునరుద్ఘాటిస్తే.. మీరు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజాసమస్యల గుండె చప్పుడుకు, తెలంగాణ గొంతుకకు, భావస్వేచ్ఛకు వేదికైన ధర్నాచౌక్‌ను మీరు ఎత్తేస్తారు. గొంతెత్తిన వారిని సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించి మీ దార్లోకి తెచ్చుకుంటారు. మీ మనసులో వచ్చేదే ‘రాష్ట్ర ప్రజలందరి ఆలోచన’, దాన్ని అమలుచేయడమే ‘రాష్ట్ర సంక్షేమం’ అని భావించే కొత్త తరహా నియంతృత్వ ప్రజాస్వామ్యమే మీ నేతృత్వంలో ఇప్పుడు తెలంగాణలో నడుస్తోంది.

Also read :అందమైన అమ్మాయిని ఎరగావేసి నిర్మాతను నిండా ముంచిన డైరెక్టర్.. చివరికి ఏమైందంటే

ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాల్సిన ముఖ్యమంత్రిని ఎప్పుడు? ఎక్కడ? ఎలా? కలవాలో తెలియక జనం, వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు అయోమయం అవుతున్నారు. మిమ్మల్ని కలిశామని మీ పార్టీ ఎమ్మెల్యేలు గానీ, మంత్రులు గానీ ధైర్యంగా చెప్పగలరా? గతంలో ఎందరోమంది పాలకులు అమలు చేసిన ప్రజాదర్బార్ స్థానంలో అత్యద్భుతంగా ప్రగతి భవన్‌ను ఆధునిక నిజాం భవనంగా నిర్మించి, వందిమాగధుల పొగడ్తలతో.. ప్రజాభీష్టంతో పనిలేకుండా మీకు నచ్చిన నిర్ణయం తీసుకోవడం మరెవరికైనా సాధ్యమా? అనవసర ప్రకటనలు చేస్తూ.. టైంపాస్ చేయడం మీకు అలవాటైపోయింది. దీనికితోడు పదేళ్లుగా.. అవినీతి, అక్రమాలు, అశ్రిత పక్షపాతంతో ప్రజలను ఇబ్బందులు పెట్టారు. మీ పాలనలో ఎన్ని కుంభకోణాలు? ఎన్నెన్నో దౌర్జన్యాలు? ‘బంగారు తెలంగాణ’ పేరుతో మీరు చేస్తున్న పాలన.. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లుగా ఉంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వంటి పెద్దలెందరో.. సచివాలయం, అసెంబ్లీ వంటివి ప్రజలకు సౌలభ్యాన్ని కలిగించేలా నిర్ణయాలు తీసుకోవాలని సంకల్పించారు. కానీ మీ దృష్టిలో దీనికి పూర్తి భిన్నమైన అర్థం ఉందని తెలంగాణ ప్రజలకు తెలిసేందుకు పదేళ్ల సమయం పట్టింది.

మీరెలాగూ సచివాలయానికి రారని తెలిసి.. అన్నిరకాల ఫైళ్లే ప్రగతి భవన్‌కు రావడమే మీ దృష్టిలో రాజ్యాంగం. ఇలాంటి నియంతృత్వ మనస్తత్వమే.. మీ రూపాన్ని యాదాద్రి దేవాలయ రాతిస్తంభాలపై చెక్కించుకునేంత వరకు వెళ్లింది. ప్రజాగ్రహానికి లొంగి మీరు వాటిని తొలగించాల్సి వచ్చింది లేదంటే.. ఆగమశాస్త్రపు చిత్రాలు కాకుండా మీ చిత్రాలు ఆలయంలో ఉండేవి. స్పీకర్ దగ్గర జరిగే బీఏసీ (బిజినెస్ అడ్వయిజరీ కమిటీ) సమావేశంలో తప్ప అఖిలపక్షం నేతల ముఖాలు కూడా చూడటం మీకు ఇష్టముండదు. ఎవరికీ అపాయింట్‌మెంట్ ఇవ్వనంత ‘ఇరుకైన’ ఆలోచనతో, పోలీసు వ్యవస్థను, అధికార యంత్రాగాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్న మీ అప్రజాస్వామిక మనస్తత్వాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ.. మీ కుటుంబ ఆలోచనలే సర్వస్వంగా వ్యవహరిస్తున్న మీకు, మీ పార్టీకి రానున్న ఎన్నికల్లో సరైన బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డీ అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు