/rtv/media/media_files/2026/04/01/oracle-2026-04-01-07-38-47.jpg)
ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజం 'ఒరాకిల్' తన ఉద్యోగులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. గత కొంతకాలంగా ఐటీ రంగంలో కొనసాగుతున్న లేఆఫ్స్ పరంపరలో భాగంగా, ఒరాకిల్ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు తెరలేపింది. వివిధ అంతర్జాతీయ నివేదికల ప్రకారం, కంపెనీ సుమారు 30,000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం టెక్ ప్రపంచంలో పెను సంచలనంగా మారింది.
తెల్లవారుజామునే 'పింక్ స్లిప్'ల వర్షం
ఉద్యోగులను తొలగించే విధానంపై ప్రస్తుతం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజూ తెల్లవారుజామునే ఉద్యోగుల ఇన్-బాక్స్‌లకు లేఆఫ్ లెటర్లు చేరుతున్నాయి. "పొద్దున్నే నిద్రలేవగానే చేతిలో ఉద్యోగం లేదన్న చేదు వార్త వినాల్సి వస్తోంది" అని పలువురు ఉద్యోగులు సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక ఉద్యోగి రెడిట్ వేదికగా స్పందిస్తూ.. "నేను ఈ కంపెనీలో గడిచిన 20 ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నాను. కానీ, ఏమాత్రం కనికరం లేకుండా ఉదయం 5 గంటలకే నాకు లేఆఫ్ మెయిల్ పంపారు" అని తన బాధను పంచుకున్నారు. మరికొందరు ఉద్యోగులు ఉదయం 6 గంటలకే తమ సహోద్యోగులకు ఇలాంటి మెయిల్స్ రావడం చూసి దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
భారత్‌పై ప్రభావం
ఒరాకిల్ తీసుకున్న ఈ భారీ నిర్ణయం కేవలం అమెరికాకే పరిమితం కాలేదు. భారత్, మెక్సికో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒరాకిల్ కంప్యూటింగ్ వ్యాపార విభాగాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ముఖ్యంగా భారత ఐటీ నిపుణుల్లో ఈ పరిణామం ఆందోళన కలిగిస్తోంది.
కారణాలేంటి?
ప్రపంచ ఆర్థిక మందగమనం, కంపెనీ అంతర్గత పునర్నిర్మాణ చర్యలు మరియు వ్యయ నియంత్రణలో భాగంగానే ఈ స్థాయిలో ఉద్యోగాల కోత విధిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, దశాబ్దాల కాలం పాటు సంస్థను నమ్ముకున్న సీనియర్ ఉద్యోగులను కూడా ఇలా అర్థరాత్రి, తెల్లవారుజామున మెయిల్స్ ద్వారా తొలగించడం ఒరాకిల్ పనితీరుపై చర్చకు దారితీస్తోంది. సంస్థ నుంచి అధికారికంగా మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.
Follow Us