/rtv/media/media_files/2026/04/13/harsha-2026-04-13-21-14-22.jpg)
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఇంటర్మీడియట్ అనగానే అందరికీ గుర్తొచ్చేవి MPC, BiPC గ్రూపులే. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లేదా డాక్టర్ కావాలనే లక్ష్యంతో మెజారిటీ విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల వైపు పరుగులు తీస్తుంటారు. కానీ, ఓ గిరిజన విద్యార్థి విజన్ ఉన్న తన టార్గెట్‌తో సాంప్రదాయ ధోరణిని తిరగరాశాడు. పదిలో అత్యుత్తమ మార్కులు సాధించినా, లోకల్ గురుకుల పాఠశాలనే ఎంచుకుని, ‘ఆర్ట్స్’ గ్రూపుతో కూడా అద్భుతాలు చేయవచ్చని నిరూపించాడు.
పదో తరగతిలో 500కు పైగా స్కోరు సాధించిన ఏ విద్యార్థి అయినా సహజంగానే ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ వైపు మొగ్గు చూపుతారు. కానీ, హర్ష మాత్రం తన లక్ష్యం పట్ల ఉన్న స్పష్టతతో HEC (History, Economics, Civics) గ్రూపును ఎంచుకున్నాడు. తనకి HECలోనే సీటు కావాలని అడిగినప్పుడు, అక్కడి లెక్చరర్లు అంతా షాక్ అయ్యారు. ఇంత మంచి మార్కులు వచ్చిన అబ్బాయి వారం రోజుల్లో మనసు మార్చుకుని మళ్ళీ సైన్స్ గ్రూపులకు వెళ్తాడని అందరూ భావించారు. కానీ హర్ష తన నిర్ణయానికే కట్టుబడ్డాడు.
తరగతి గదిలో పాఠాలను వినడమే కాదు, వాటి లోతుపాతులను చర్చించడంలో హర్షది ప్రత్యేక శైలి. అతని ఆసక్తిని, సబ్జెక్టుపై ఉన్న పట్టును చూసి ప్రభావితమైన CECలోని మరో ఐదుగురు విద్యార్థులు తమ గ్రూపును HECకి మార్చుకున్నారు. పుస్తకాలతో కుస్తీ పట్టడం కంటే, సెల్ఫ్ ప్రిపరేషన్, గ్రూప్ డిస్కషన్స్‌తో చదువును ఒక వినోదంలా సాగించాడు హర్ష.
ఫలితాల్లో ప్రభంజనం
తాజాగా విడుదలైన 2026 ఇంటర్మీడియట్ ఫలితాల్లో హర్ష 500 మార్కులకు గాను 492 మార్కులు సాధించి, స్టేట్ 2nd ర్యాంక్‌ను కైవసం చేసుకున్నాడు. హర్ష సాధించిన విజయం ఒక ఎత్తు అయితే, అతడిని చూసి గ్రూపు మార్చుకున్న ఆ ఐదుగురు విద్యార్థులలో ముగ్గురు 430+ మార్కులతో ఉత్తీర్ణత సాధించడం మరో విశేషం. సామాన్య విద్యార్థులను స్టేట్ లెవల్ ర్యాంకర్ల స్థాయికి చేర్చడంలో ‘మంచి స్నేహం’ ‘సరైన మార్గదర్శకత్వం’ ఎంత గొప్ప పాత్ర పోషిస్తాయో ఈ ఘటనే నిదర్శనం.
వారసత్వాన్ని కొనసాగిస్తూ..
ప్రభుత్వ కాలేజీలు అంటే కేవలం పాస్ మార్కులకే పరిమితం అనే అపోహను ఈ విద్యార్థులు పటాపంచలు చేస్తున్నారు. గతేడాది (2025) ఇదే కాలేజీకి చెందిన ఫర్హాన్ CECలో 495 మార్కులతో స్టేట్ 1st ర్యాంక్ సాధించగా, ఈ ఏడాది గిరిజన తెగకు చెందిన హర్ష ఆ వారసత్వాన్ని కొనసాగించాడు. "సివిల్స్ సాధించాలనే బలమైన సంకల్పంతో, ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఇంతటి పరిణితిని ప్రదర్శించిన హర్ష విజయం ఎంతో మంది గ్రామీణ విద్యార్థులకు స్ఫూర్తిదాయకం."
Follow Us