Pawan Kalyan: పవన్‌కు ఆరు పవర్‌ఫుల్ శాఖలు.. ఏరికోరి ఎంచుకున్న జనసేనానీ

ఏపీలో రాష్ట్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. పవన్‌ కల్యాణ్‌కు మొత్తం డిప్యూటీ సీఎంతో కలిపి ఆరుశాఖలు కేటాయించారు. ఆయన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు ఎందుకు ఎంచుకున్నారో ఈ ఆర్టికల్‌లో చదవండి.

New Update
Pawan Kalyan: పవన్‌కు ఆరు పవర్‌ఫుల్ శాఖలు.. ఏరికోరి ఎంచుకున్న జనసేనానీ

Pawan Kalyan As Deputy CM: ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా, ఉత్కంఠభరితంగా సాగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలు ఇంత ఆసక్తికరంగా మారడానికి కారణం జనసేన అధినేత పవన్‌కల్యాణ్. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదంటూ టీడీపీ-బీజేపీతో పొత్తుపెట్టుకొని ఎన్నికల ప్రచారంలోకి దిగిన పవన్‌.. మొత్తం రాష్ట్ర రాజకీయాలనే మార్చేశారు. వైసీపీ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ జనాల్లోకి తీసుకెళ్లగలిగారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీచేసింది. అనూహ్యంగా ఎవరూ ఊహించని రీతిలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడి గెలిచి పార్టీ పవర్‌ ఎంటో చూపించగలిగింది.

Also Read: కూటమిలో జనసేనకు కీలక శాఖలు

పవన్‌ చుట్టే రాజకీయాలు

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు పవన్‌ కల్యాణ్‌ కీలక పాత్ర పోషించారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవలే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగా.. పవన్‌ కల్యాణ్, లోకేష్ ఇతర నేతలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమం జరిగిన రోజున కూడా అందరికన్నా పవన్‌ కల్యాణ్‌ హైలెట్‌ అయ్యారు. ప్రధాని మోదీ.. పవన్‌ కల్యాణ్, చిరంజీవి మధ్యలో నిల్చొని చేతులు పైకెత్తిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఒక పవర్‌ఫుల్ లీడర్‌గా పవన్‌కల్యాణ్ ఎదిగారు. ఇప్పుడు రాజకీయాలు మొత్తం ఆయన చుట్టే తిరుగుతున్నాయి.

మొత్తం ఆరు శాఖలు

అయితే ఈ ఎన్నికల్లో ముఖ్య పాత్ర పోషించిన పవన్‌ కల్యాణ్‌కు ఏ శాఖలు ఇస్తారనే దానిపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం మంత్రులకు కేటాయించిన శాఖలను విడుదల చేసింది. అందులో పవన్‌ కల్యాణ్‌కు మొత్తం ఆరు శాఖలు కేటాయించారు. అవి డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి & గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, సైన్స్ అండ్‌ టెక్నాలజీ, అటవి శాఖలను కేటాయించారు.

Also Read: పవన్ కు పంచాయతీ రాజ్, లోకేష్ కు ఐటీ.. ఏపీ మంత్రుల శాఖలివే!

ప్రజలకు చేరువయ్యేందుకే

వాస్తవానికి పవన్‌ కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు హోం శాఖ ఇస్తారనే ప్రచారం జరిగింది. అలాగే ఆర్థిక శాఖ ఇచ్చే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాల్లో చర్చలు జరిగాయి. ఇలాంటి కీలక శాఖలు తీసుకునే అవకాశం ఉన్నాకూడా పవన్‌కల్యాణే వాటిని తీసుకునేందుకు ఆసక్తి చూపలేదని తెలుస్తోంది. ఎందుకంటే హోం, ఆర్థిక శాఖల్లో మంత్రిగా ఉంటే ప్రజలతో ఎక్కువగా ఉండే అవకాశం ఉండదు. కానీ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి లాంటి శాఖల్లో మాత్రం ప్రజలతో మమేకం అవ్వొచ్చు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మరింత చేరువ అయ్యే అవకాశం ఈ మంత్రిత్వ శాఖల్లో ఉంటుంది. తమ పార్టీని ప్రజల్లోకి ఇంకా బలంగా తీసుకెళ్లేందుకే పవన్‌ కల్యాణ్‌ ఈ శాఖలను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. అలాగే పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖలను కూడా ఆయన ఆసక్తితో ఎంచుకున్నట్లు సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు