Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త.. రూ.6 వేలు తగ్గనున్న ధర.. ఎప్పుడో తెలుసా?

కొండెక్కి కూచున్న బంగారం ధరలు తగ్గుతాయా? ఈ ప్రశ్నకు నిపుణుల అంచనా ప్రకారం తగ్గవచ్చు అనే చెప్పాలి. అసలు బంగారం ధరలు ఇంతలా ఎందుకు పెరిగిపోతున్నాయి? ఎప్పుడు ఈ ధరలు తగ్గుతాయి? నిపుణుల అంచనాలు ఏమిటి ఇవన్నీ తెసులుకోవాలంటే ఆర్టికల్ చదవాల్సిందే.

New Update
RBI Gold Reserve: చైనాను మించి.. బంగారం పోగేస్తున్న మన రిజర్వ్ బ్యాంక్.. 

బంగారం కొండెక్కి కూర్చుంది. కాస్త కూడా దిగనంటోంది. పసిడి ప్రియులకు బంగారం ధరలు చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. రికార్డు మోతలు మోగిస్తూ రోజు రోజుకూ బంగారం ధరలు(Gold Price) పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడన్నా ఒక్కరోజు హమ్మయ్య కాస్త తగ్గింది అని అనిపించినా.. వెంటనే మర్నాడు ధరల మోత మోగిపోతోంది. ఈ నేపథ్యంలో అందరినీ తొలిచేస్తున్న ప్రశ్నలు ఇవే.. బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి? అసలు తగ్గుతాయా? ఎందుకు ఇలా పెరిగిపోతోంది బంగారం ధర? ఇవే ప్రశ్నలతో బంగారం కొనాలని అనుకునేవారంతా సతమతం అవుతున్నారు. దీపావళి నాటికి బంగారం ధర భారీగా పెరుగుతుందని చాలామంది చెబుతున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 75 వేల మార్క్ దాటిపోతుందని అంచనాలు వేస్తున్నవారూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బంగారం ధర(Gold Price) కనీసంగా ఆరు వేల నుంచి ఏడు వేల రూపాయల వరకూ తగ్గవచ్చని ఎవరైనా చెబితే నమ్ముతారా? ఈ మాట మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. నిపుణులు చెబుతున్న కొన్ని లెక్కలు చూస్తే జూన్ నెలలో బంగారం ధరలు ఆరువేల వరకూ తగ్గే ఛాన్స్ ఉందని అనిపిస్తోంది. అయితే, అలా ఎలా అని మీకనిపించవచ్చు. అది తెలుసుకునే ముందు బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయో అర్ధం చేసుకోవడం అవసరం. 

బంగారం ధరలు పెరగడానికి ఇవే ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. 

  1. అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు త్వరలో ప్రారంభం కానుందని అంచనాలు 
  2. చైనా నుంచి భారీగా జరుగుతున్న బంగారం కొనుగోళ్లు 
  3. గ్లోబల్ పాలిటిక్స్ (జియో పాలిటిక్స్) అనే సంక్షోభ స్థితి
  4. ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఎన్నికలు
  5. భారత రూపాయి విలువ క్షీణత

వీటిలో ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాల్సింది అమెరికాలో వడ్డీ రేట్ల తగ్గింపు అంశం. మిగిలిన వాటిలో చైనా బంగారం కొనుగోళ్లు తాత్కాలికమే కావచ్చు. త్వరలోనే అది ఆగిపోవచ్చు. గ్లోబల్ పాలిటిక్స్ అనే సంక్షోభ స్థితి ఎప్పుడూ ఉండేదే. భారత రూపాయి క్షీణత.. పెరుగుదల ఇది కూడా ప్రతిరోజూ కదులుతూ ఉండే అంశమే. ప్రధాన ఆర్ధిక వ్యవస్థల్లో ఎన్నికలు కూడా రెండు మూడు నెలల్లో పూర్తి అయిపోతాయి. మన దేశంలో అయితే జూన్ మొదటి వారానికి ఈ ప్రక్రియ పూర్తి అయిపోతుంది. ఇప్పుడు మిగిలేది ఒక్కటే.. అది అమెరికాలో వడ్డీరేట్ల తగ్గింపు. అవును నిపుణులు చెబుతున్నదాని ప్రకారం ఇటీవల కాలంలో బంగారం ధరల(Gold Price) పెరుగుదల ఇంత వేగంగా ఉండడానికి కారణం అమెరికా వడ్డీరేట్ల విషయమే. అమెరికాలో వడ్డీరేట్లను ఈ ఆర్ధిక సంవత్సరంలో మూడు సార్లు తగ్గించే అవకాశం ఉండాలని విపరీతంగా ప్రచారం జరిగింది. దీంతో ఇన్వెస్టర్స్ సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారం వైపు కదిలారు. దీంతో డిమాండ్ పెరిగి బంగారం ధరలు పెరగడం మొదలైంది. దీనికి మిగిలిన అంశాలు కూడా జతకూరడంతో రికార్డులు సృష్టిస్తూ పరుగులు తీస్తోంది బంగారం. 

ఎలా తగ్గుతుంది?

Gold Rates Today

జూన్ నెలలో అమెరికా ఫెడ్ రేట్లు అంటే వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది. అప్పుడు రేట్లను తగ్గిస్తారా? పెంచుతారా?యధాతథ స్థితిలో ఉంచుతారా అనే అంశం బంగారం రేట్లను ప్రభావితం చేస్తుంది. ఇంతకు ముందు భావించినట్లు అమెరికా ఫెడ్ రేట్లను తగ్గిస్తే కనుక బంగారం ధరలు(Gold Price) అదుపులోకి వచ్చే ఛాన్స్ ఉండదు. కానీ, వడ్డీరేట్లు పెంచితే  కనుక బంగారం ధరలు కిందికి దిగివస్తాయి. ఒకవేళ ధరలను స్థిరంగా ఉంచితే బంగారం ధరలు కూడా అదుపులో ఉంటాయి అని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే, యూఎస్ ఫెడ్ రేట్లు తగ్గితే, ఇన్వెస్టర్స్ బంగారం వైపు చూస్తారు. అదే పెరిగితే, బంగారంలో ఇన్వెస్ట్ చేయడం తగ్గిస్తారు. సో.. మన బంగారం ధరల వ్యవహారం యూఎస్ ఫెడ్ రేట్లతో ముడిపడి ఉందన్నమాట. 

ప్రస్తుత పరిస్థితి ఇదీ.. 

Gold Ratesమరికొద్ది రోజుల్లో అమెరికాలో ద్రవ్యోల్బణం గణాంకాలు అందరి ముందు రానున్నాయి. మునుపటి ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా 3 శాతం పైన ఉన్నాయి. ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తీసుకురావడమే US ఫెడ్ లక్ష్యం. అయితే, గత వారం బ్లాక్‌బస్టర్ ఉపాధి గణాంకాల నుండి ఇన్వెస్టర్స్ కచ్చితంగా కొంత ఉపశమనం పొందారు. కానీ రాబోయే ద్రవ్యోల్బణం డేటా గురించి అమెరికన్ పెట్టుబడిదారులకు ఏమాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. దీని కారణంగా ప్రస్తుత సంవత్సరంలో US ఫెడ్ ఇప్పటివరకు వడ్డీ రేట్లలో ఎలాంటి కోత విధించలేకపోయింది. గత సంవత్సరం, US ఫెడ్ 2024 సంవత్సరంలో వడ్డీ రేట్లలో 3 సార్లు తగ్గించే ఛాన్స్ ఉందని చెప్పింది. ఈ క్యాలెండర్ సంవత్సరంలో పావు వంతు గడిచిపోయింది. వడ్డీ రేట్లు తగ్గించలేదు. 

Also Read: ప్రపంచంలోనే మూడో అతిపెద్ద విమాన సంస్థగా ఇండిగో 

అందరి దృష్టి జూన్‌ సమావేశంపైనే..
కేవలం అమెరికా పెట్టుబడిదారులే కాదు, భారత్‌తో సహా యావత్ ప్రపంచం చూపు యూఎస్ ఫెడ్‌ జూన్‌ సమావేశంపైనే ఉంది. వాస్తవానికి, జూన్ వరకు ద్రవ్యోల్బణం గణాంకాలు తగ్గవని కొందరు నిపుణులు చెబుతూ వస్తున్నారు. అందువల్ల  US ఫెడ్ తన వడ్డీ రేటు తగ్గింపు ప్రణాళికను అక్టోబర్ వరకు వాయిదా వేయవలసి ఉంటుంది. మరోవైపు, జూన్‌లో 25 బేసిస్ పాయింట్ల కోత తర్వాత, రాబోయే నెలల్లో ఫెడ్ తన వైఖరిని హాకిష్‌గా ఉంచవచ్చని కూడా కొందరు నిపుణులు అంటున్నారు. ఇది డాలర్ ఇండెక్స్ - బాండ్ ఈల్డ్‌లపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంటే వడ్డీరేట్లలో కోత విధించినప్పటికీ రెండూ పెరగవచ్చు.

బంగారంపై ఎలాంటి ప్రభావం?

Gold Rate Newsఇక్కడ నుండి నిజమైన గేమ్  బంగారంలో (Gold Price)కనిపిస్తుందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. జూన్ నెలలో US సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు చేయకపోతే ఆ తర్వాత బంగారం ధరల్లో 8 నుంచి 10 శాతం తగ్గుదల కనిపించవచ్చనేది వారి అంచనా.  ఒకవేళ జూన్‌లో ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, రాబోయే రోజులలో వడ్డీ రేట్లపై తన వైఖరిని మళ్లీ స్థిరీకరించినప్పటికీ, బంగారం ధరలలో పతనం కనిపిస్తుంది. వడ్డీరేట్ల తగ్గింపును అనే కారణాన్ని ఇప్పటికే బంగారం ధరలు(Gold Price) బాగా సద్వినియోగం చేసుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల జూన్‌లో వడ్డీరేట్లను తగ్గించినా పెద్దగా ప్రభావం ఉండదు. అప్పుడు బంగారం ధరలు మరీ ఇంతలా పెరిగే అవకాశం ఉండకపోవచ్చని వారంటున్నారు. మిగిలిన అంశాల ఆధారంగా కొద్దిపాటి అప్ అండ్ డౌన్స్ ఉండే ఛాన్స్ ఉండొచ్చు కానీ.. భారీ మార్పులకు అవకాశం ఉండదనేది నిపుణుల మాట. గత 180 నుంచి 200 రోజుల్లో బంగారం ధర 27 శాతం పెరిగింది. అటువంటి పరిస్థితిలో, బంగారంలో కరెక్షన్ జరగాలి అని నిపుణులు గట్టిగా చెబుతున్నారు. అది జూన్ లో ఫెడ్ రేట్ల ప్రకటన తరువాతే సాధ్యం అవుతుంది అని లెక్కలేస్తున్నారు. ఇప్పటి పరిస్థితులను బేరీజు వేసుకుంటే యూఎస్ ఫెడ్ రేట్లు ముందు అనుకున్నట్టు తగ్గడానికి ఉన్న ఛాన్స్ సగానికి పైగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఫెడ్ రేట్లలో మార్పు రాకపోతే బంగారం ధరలు తగ్గే అవకాశం కచ్చితంగా ఉంటుంది. ఫెడ్ వడ్డీరేట్లను పాజ్ చేస్తే కచ్చితంగా బంగారం ధరలు కరెక్షన్ తీసుకుంటాయని మెజార్టీ నిపుణులు భావిస్తున్నారు. వివిధ సందర్భాల్లో.. జాతీయ మీడియాలో నిపుణులు చెబుతున్న అంచనాల ప్రకారం జూన్ నెలలో ఫెడ్ రేట్లు స్థిరంగా ఉంటే కనుక.. బంగారం ధరలు(Gold Price) దాదాపు 10శాతం వరకూ తగ్గే అవకాశం ఉంది. అంటే 6 వేల రూపాయలకు పైగా తగ్గవచ్చు. 

మొత్తమ్మీద చూసుకుంటే.. మన బంగారం ధరలకూ అమెరికా వడ్డీరేట్లకు పెద్ద లింక్ ఉంది. ఇప్పుడు పసిడి ప్రియులంతా కోరుకోవాల్సింది బంగారం ధరలు తగ్గాలని కాదు.. యూఎస్ పేడ్ రేట్లను స్థిరంగా ఉంచాలని. 

Advertisment
Advertisment
తాజా కథనాలు