Women's World Cup : మహిళల ప్రపంచకప్‌... నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ రసవత్తర పోరు

మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అత్యంత ఆకర్షణీయమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ఈ చిరకాల ప్రత్యర్థుల సమరం ప్రారంభం కానుంది.

New Update
FotoJet - 2026-06-14T083255.369

Women's World Cup

Women's World Cup : మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న అత్యంత ఆకర్షణీయమైన భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ఈ చిరకాల ప్రత్యర్థుల సమరం ప్రారంభం కానుంది. టోర్నీ మొదలై రెండు రోజులు గడిచినప్పటికీ, భారత జట్టు మూడో రోజున తన తొలి పోరులోనే దాయాది జట్టును ఢీకొట్టబోతోంది. ప్రత్యర్థి పాకిస్థాన్‌కు కూడా టోర్నీలో ఇదే మొదటి మ్యాచ్ కావడం విశేషం. గత ఏడాది వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న హర్మన్‌ప్రీత్ సేన.. అదే జోరుతో పొట్టి కప్పు వేటను కూడా ఘన విజయంతో ఆరంభించాలని పట్టుదలతో ఉంది.

టీమిండియా బలాబలాలు:

గత ఏడాది వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లను ఓడించి కప్పు గెలిచిన భారత మహిళల జట్టు ఆల్‌రౌండ్ బలంతో పటిష్టంగా కనిపిస్తోంది. జట్టులో స్మృతి మంధాన, షెఫాలి వర్మల రూపంలో అత్యంత దూకుడైన ఓపెనర్లు ఉండగా, మిడిలార్డర్‌లో జెమీమా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి అనుభవజ్ఞుల అండ ఉంది. అలాగే భార్తీ ఫుల్మాలి రూపంలో కొత్త హిట్టర్, మెరుపు ముగింపు ఇవ్వగల రిచా ఘోష్ జట్టుకు అదనపు బలం. ఆల్‌రౌండర్ దీప్తి శర్మతో పాటు తెలుగమ్మాయి శ్రీ చరణి, శ్రేయాంక పాటిల్‌ల రూపంలో స్పిన్ విభాగం బలంగా ఉంది. అయితే, పేస్ విభాగంలో రేణుక సింగ్‌పైనే ఎక్కువ భారం పడనుంది; క్రాంతి గౌడ్, నందని శర్మలకు అనుభవ లేమి సమస్యగా మారవచ్చు. పిచ్ పరిస్థితులను బట్టి శ్రేయాంక లేదా నందని శర్మలలో ఒకరికి తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

పాకిస్థాన్ పరిస్థితి:

మరోవైపు భారత్‌తో పోలిస్తే పాకిస్థాన్ జట్టులో పెద్దగా మార్పులు లేవు. ఆ జట్టు స్పిన్ విభాగంపైనే ఎక్కువగా ఆధారపడుతోంది, అయితే ఇంగ్లాండ్ పిచ్‌లపై వారికి కఠిన సవాళ్లు ఎదురుకావచ్చు. కెప్టెన్ ఫాతిమా సనా ఆల్‌రౌండ్ ప్రదర్శనపైనే పాక్ ఆశలు పెట్టుకోగా, బ్యాటింగ్‌లో ముబీనా అలీ, ఆలియా రియాజ్ కీలక పాత్ర పోషించనున్నారు. గత రికార్డులను పరిశీలిస్తే, ఇరు జట్ల మధ్య జరిగిన 16 టీ20 మ్యాచ్‌ల్లో భారత్ 13 విజయాలతో స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ సేనకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

తుది జట్లు (అంచనా )

ఇండియా

స్మృతి మంధాన, షెఫాలి వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), భార్తీ ఫుల్మాలి, దీప్తి శర్మ, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్/నందని శర్మ, శ్రీ చరణి, రేణుక సింగ్, క్రాంతి గౌడ్.

పాకిస్థాన్

గుల్ ఫెరోజా, ముబీనా అలీ, నటాలియా, ఆలియా రియాజ్, ఫాతిమా సనా (కెప్టెన్), సైరా జబీన్, ట్యూబా హసన్, రమీన్ షమీమ్, సాదియా ఇక్బాల్, నష్రా సంధు, డయానా బేగ్.

ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగే మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో బంగ్లాదేశ్ తలపడనుంది.

Advertisment
తాజా కథనాలు