PM Modi : ట్రంప్ పై దాడి..ప్రధాని మోదీ సంచలన ట్వీట్!

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో కాల్పులు జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు.

New Update
modi

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో కాల్పులు జరగడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని ఆయన స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలోని ఒక హోటల్‌లో జరిగిన వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ వార్షిక విందు కార్యక్రమంలో ఈ భద్రతా లోపం చోటుచేసుకుంది. ఆ సమయంలో ట్రంప్‌తో పాటు ఆయన భార్య మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇతర ఉన్నతాధికారులు కూడా అక్కడే ఉన్నారు. కాల్పుల శబ్దం వినబడగానే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతానికి తరలించారు.

ఊపిరి పీల్చుకున్నా 

ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. ట్రంప్, ఆయన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారని తెలిసి తాను ఊపిరి పీల్చుకున్నట్లుగా మోదీ తెలిపారు.  వారు త్వరగా కోలుకోవాలని, ఎప్పుడూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటి దాడులు జరగడం సరైంది కాదని, ప్రతి ఒక్కరూ వీటిని ముక్తకంఠంతో ఖండించాలని ప్రధాని పిలుపునిచ్చారు.

మరోవైపు ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ స్వయంగా స్పందించారు. తనపై దాడికి ప్రయత్నించిన వ్యక్తి వద్ద చాలా ఆయుధాలు ఉన్నాయని, అతను భద్రతా వలయాన్ని దాటుకుని లోపలికి రావడానికి ప్రయత్నించాడని వివరించారు. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎంతో ధైర్యంగా వ్యవహరించి ఆ దుండగుడిని అడ్డుకున్నారని ఆయన ప్రశంసించారు. ఆ సమయంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ఒక ఏజెంట్‌కు బుల్లెట్ తగిలిందని, అయితే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవడం వల్ల ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని ట్రంప్ తెలిపారు. ప్రస్తుతం ఆ ఏజెంట్ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు.

పోలీసులు ఈ దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశారు. అతను దాదాపు 50 గజాల దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడని, అదృష్టవశాత్తూ హాల్ లోపలికి రాలేకపోయాడని అధికారులు తెలిపారు. ఆ వ్యక్తిని ఒక లోన్ వోల్ఫ్ (ఒంటరిగా దాడి చేసే వ్యక్తి) గా అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో విందు కార్యక్రమాన్ని మధ్యలోనే రద్దు చేశారు. వైట్ హౌస్ అధికారులు, మంత్రులు, విలేకరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఇలా జరగడంపై అమెరికాలో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

Advertisment
తాజా కథనాలు