US : అమెరికాకు బిగ్ షాక్: పర్షియన్ గల్ఫ్‌లో రూ. 1600 కోట్ల డ్రోన్ మాయం!

అమెరికా సైనిక అమ్ములపొదిలోని అత్యంత ఖరీదైన డ్రోన్లలో ఒకటైన MQ-4C ట్రైటాన్ నిఘా డ్రోన్ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అదృశ్యమైంది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కేవలం రెండు రోజులకే ఈ ఘటన జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది.

New Update
us

అమెరికా సైనిక అమ్ములపొదిలోని అత్యంత ఖరీదైన డ్రోన్లలో ఒకటైన MQ-4C ట్రైటాన్ నిఘా డ్రోన్ పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో అదృశ్యమైంది. అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కేవలం రెండు రోజులకే ఈ ఘటన జరగడం అంతర్జాతీయంగా కలకలం రేపుతోంది. హార్ముజ్ జలసంధిపై ప్రయాణిస్తున్న సమయంలో ఈ డ్రోన్ నుంచి అత్యవసర సంకేతాలు అందినట్లు సమాచారం. ఆ తర్వాత కొద్దిసేపటికే అది ఇరాన్ వైపు స్వల్పంగా మలుపు తిరిగి, వేగంగా కిందికి దిగుతూ స్క్రీన్ల నుంచి మాయమైపోయింది.

ఈ డ్రోన్ సాంకేతిక లోపంతో కూలిపోయిందా? లేక ఎవరైనా కూల్చివేశారా? అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సుమారు మూడు గంటల పాటు నిఘా పనులను పూర్తి చేసుకుని, ఇటలీలోని తన స్థావరానికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. సుమారు 200 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,600 కోట్లు) విలువైన ఈ డ్రోన్ అదృశ్యం కావడం అమెరికా రక్షణ శాఖను ఉలిక్కిపడేలా చేసింది.

ఏమిటీ MQ-4C ట్రైటాన్ డ్రోన్?

ఇది అమెరికా నావికా దళం ఉపయోగిస్తున్న అత్యంత అధునాతన అన్-మ్యాన్డ్ (మానవరహిత) విమానం. ఇది 50,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో, వరుసగా 24 గంటల పాటు నిరంతరాయంగా ఎగురగలదు.  ఒకేసారి ఇంధనం నింపకుండా 7,400 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించగల సామర్థ్యం దీనికి ఉంది. సముద్ర ఉపరితలంపై నిఘా ఉంచడంలో ఇది దిట్ట. తక్కువ ఎత్తులో ప్రయాణించే పీ-8ఏ పోసిడాన్ విమానాలకు ఇది ఆకాశం నుంచి కన్నులా పని చేస్తుంది.

ప్రస్తుతం అమెరికా వద్ద ఇలాంటివి 20 డ్రోన్లు ఉండగా, మరో ఏడు కొనాలని భావిస్తోంది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి మూతపడిన హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ఇరాన్ అంగీకరించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ప్రపంచ చమురు రవాణాలో 20 శాతం ఈ మార్గం గుండానే సాగుతుంది. ప్రస్తుతానికి ఈ అదృశ్యంపై పెంటాగన్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisment
తాజా కథనాలు