/rtv/media/media_files/2025/01/31/2uoCwwor1Z9GFQ62NhzK.jpg)
Donald Trump
యుద్ధంలో అమెరికాను నమ్ముకున్న దేశాలకు ట్రంప్ షాక్ ఇచ్చాడు. మధ్యప్రాచ్యంలో ఇరాన్‌తో నెలకొన్న యుద్ధం ప్రపంచ ఇంధన రంగాన్ని కుదిపేస్తోంది. హోర్ముజ్ జలసంధి గుండా చమురు రవాణా నిలిచిపోవడంతో అనేక దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిత్రదేశాలకు సాయం చేయమని ప్రకటించాడు. చమురు కోసం ఇబ్బంది పడుతున్న దేశాలు "కొంత ధైర్యం తెచ్చుకుని, సొంతంగా చమురును సమకూర్చుకోవాలని" ఆయన పిలుపునిచ్చారు.
అమెరికా సహాయం ఇక ఉండదు!
ఫిబ్రవరిలో జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యకు ప్రతికారంగా ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసింది. దీనిపై ట్రూత్ సోషల్‌లో స్పందించిన ట్రంప్, ముఖ్యంగా బ్రిటన్ (UK) వంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. "ఇరాన్‌ను నిర్వీర్యం చేయడంలో మాకు సహకరించని దేశాలకు నేనొకటే చెబుతున్నా.. మీకు ఇంధనం కావాలంటే అమెరికా నుండి కొనండి, మా వద్ద పుష్కలంగా ఉంది. లేదా ధైర్యం చేసి ఆ జలసంధిని మీరే స్వాధీనం చేసుకోండి" అని ట్రంప్ చేతులు ఎత్తేశాడు. అంతేకాకుండా, "మీ కోసం మీరే పోరాడటం నేర్చుకోవాలి. మీరు మాకు అండగా లేనప్పుడు, అమెరికా ఇకపై మీకు సహాయం చేయదు. వెళ్లి మీ చమురును మీరే తెచ్చుకోండి" అని తేల్చి చెప్పారు.
ఇరాన్ ప్లాంట్లపై 'తుడిచిపెట్టేస్తాం' అని హెచ్చరిక
టెహ్రాన్ తమతో వెంటనే ఒప్పందం కుదుర్చుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ ఇంధన ఎగుమతుల్లో 90% వాటా కలిగిన ఖార్గ్ ద్వీపాన్ని, విద్యుత్ కేంద్రాలను, చమురు బావులను బాంబులతో పేల్చివేస్తామని బెదిరించారు. హోర్ముజ్ జలసంధిని వెంటనే వ్యాపార కార్యకలాపాల కోసం తెరవకపోతే, డీశాలినేషన్ ప్లాంట్లతో సహా ఇరాన్ ఆస్తులన్నింటినీ ధ్వంసం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అమెరికా సైనికులపై జరిగిన దాడులకు ఇది ప్రతీకారమని ఆయన అభివర్ణించారు.
చర్చల వార్తలను తోసిపుచ్చిన ఇరాన్
మరోవైపు, అమెరికాతో ఎలాంటి అధికారిక చర్చలు జరగడం లేదని ఇరాన్ ప్రకటించింది. పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తోందన్న వార్తలను ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఖండించారు. అమెరికా పంపుతున్న డిమాండ్లు "అసమంజసంగా" ఉన్నాయని, అసలు ఈ యుద్ధానికి అమెరికాయే కారణమని ఇరాన్ ఆరోపించింది. మొత్తానికి, ట్రంప్ తాజా హెచ్చరికలు అంతర్జాతీయ సమాజంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మిత్రదేశాలకు సైతం సైనిక సహాయం అందించబోమని ట్రంప్ స్పష్టం చేయడం ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.
Follow Us