Islamabad Peace Talks : నేడు పాక్‌లో మలివిడత చర్చలు..యూఎస్‌తో నేరుగా మాట్లాడం..ఇరాన్‌

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలను తొలగించి, శాంతిని నెలకొల్పే దిశగా అంతర్జాతీయ దౌత్య రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్‌ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో పాకిస్థాన్ వేదికగా నేడు మలివిడత చర్చలు ప్రారంభం కానున్నాయి.

New Update
FotoJet - 2026-04-25T175224.414

Today, another round of talks in Pakistan

Islamabad Peace Talks : పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలను తొలగించి, శాంతిని నెలకొల్పే దిశగా అంతర్జాతీయ దౌత్య రంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్‌ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించే లక్ష్యంతో పాకిస్థాన్ వేదికగా నేడు మలివిడత చర్చలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం ఇప్పటికే ఇస్లామాబాద్‌కు చేరుకుంది. పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ తదితరులు ఇరాన్ బృందానికి ఘన స్వాగతం పలికారు. అయితే, ఈ చర్చల సరళిపై ఇరాన్ తాజాగా కీలక స్పష్టతనిచ్చింది. అమెరికా ప్రతినిధులతో తమ దేశ ప్రతినిధులు నేరుగా ముఖాముఖి భేటీ కాబోరని, పాక్ అధికారుల మధ్యవర్తిత్వం ద్వారానే సందేశాల మార్పిడి జరుగుతుందని టెహ్రాన్ ప్రకటించింది. అంటే, ఇరాన్ తన ప్రతిపాదనలను పాక్ అధికారులకు వివరిస్తుంది, వారు ఆ విషయాలను అమెరికా బృందానికి చేరవేస్తారు.

ఈ చారిత్రాత్మక చర్చల్లో అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రత్యేక రాయబారులు స్టీవ్ విట్కాఫ్, జేర్డ్ కుష్నర్ పాల్గొనబోతున్నారు. వైట్ హౌస్ తొలుత నేరుగా చర్చలు ఉంటాయని భావించినప్పటికీ, ఇరాన్ మాత్రం పరోక్ష చర్చలకే మొగ్గు చూపింది. ఒకవేళ ఈ సంప్రదింపుల్లో సానుకూల పురోగతి కనిపిస్తే, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాకిస్థాన్‌కు వచ్చే అవకాశం ఉందని శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి జేడీ వాన్స్ వాషింగ్టన్ నుంచే ఈ పరిణామాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు, ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో నెలకొన్న విభేదాల కారణంగా ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ ఈ చర్చల బృందం నుంచి తప్పుకోవడం గమనార్హం.

ఈ చర్చల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన డిమాండ్లను మరోసారి కఠినంగా వినిపించారు. ఇరాన్ తమ అణు కార్యక్రమాలను నిలిపివేసి, నిల్వ ఉంచిన శుద్ధి చేసిన యురేనియాన్ని వదులుకోవాలని ఆయన షరతు విధించారు. అలాగే, ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఇరాన్ ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు (ఆఫర్) చేసిందని, అవి అమెరికా షరతులకు అనుగుణంగా ఉంటేనే ఒప్పందం సాధ్యమవుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. గల్ఫ్ ప్రాంతంలో శాంతి నెలకొనాలంటే ఇరాన్ తన పంథా మార్చుకోవాలని వాషింగ్టన్ బలంగా కోరుతోంది. పాక్ వేదికగా జరుగుతున్న ఈ పరోక్ష చర్చలు పశ్చిమాసియా సంక్షోభానికి ముగింపు పలుకుతాయా లేదా అన్నది ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో ఆసక్తికరంగా మారింది. ఈ చర్చల ఫలితంపైనే గల్ఫ్ దేశాల భవిష్యత్తు మరియు ప్రపంచ చమురు ధరల గమనం ఆధారపడి ఉండనుంది.

Advertisment
తాజా కథనాలు