/rtv/media/media_files/2026/04/09/the-epic-history-of-jews-and-the-rise-of-modern-israel-2026-04-09-16-17-49.jpg)
The Epic History of Jews and the Rise of Modern Israel
ప్రపంచ పటంలో ఒక చిన్న ముక్కలా కనిపించే దేశం ఇజ్రాయెల్. కానీ ఇది ప్రపంచ రాజకీయాలను శాసించే శక్తిగా మారుతోంది. కొన్ని వేల ఏళ్ల నాటి చరిత్ర, చెల్లాచెదురైన జాతి, తిరిగి తమ మాతృభూమిని నిర్మించుకున్న చరిత్ర ఇజ్రాయెల్‌కు ఉంది. ఇంతకీ అసలు యూదులు ఎవరు? ఇజ్రాయెల్ దేశం ఎలా ఏర్పడింది? అనే అంశాలపై ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
ఎవరీ యూదులు?
యూదుల చరిత్ర సుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. వీరి మూలాలు ప్రధానంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రాంతాలను యూదుల పుట్టినిల్లుగా భావిస్తారు. జెరూసలేం వీళ్ల ఆస్తిత్వానికి కేంద్రం. అయితే బైబిల్, చారిత్రక ఆధారాల ప్రకారం.. వీళ్ల పూర్వీకుడిని అబ్రాహాం అని పిలుస్తారు. ఈయన మెసొపొటేమియా (ప్రస్తుత ఇరాక్) ప్రాంతం నుంచి దేవుని ఆదేశం మేరకు 'కానాను' (-ప్రస్తుత ఇజ్రాయెల్) దేశానికి వలస వచ్చినట్లు నమ్ముతారు. అందుకే యూదులు తాము అబ్రహం వారసులుగా చెప్పుకుంటారు. వీళ్ల మతాన్ని జూడాయిజం అని అంటారు.
క్రీస్తూ పూర్వం 586లో బాబిలోనియన్లు జెరూసలేంపై దాడి చేసి మొదటి దేవాలయాన్ని కూల్చివేశారు. అప్పుడు చాలా మంది యూదులు ఖైదీలుగా ఇరాక్ వెళ్ళాల్సి వచ్చింది. ఆ తర్వాత క్రీస్తూ శకం 70లో రోమన్ సైన్యం జెరూసలేంను ఆక్రమించి, యూదుల రెండో దేవాలయాన్ని ధ్వంసం చేసింది. ఆ సమయంలో లక్షలాది మంది యూదులు తమ ప్రాణాలు రక్షించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఐరోపా, ఆఫ్రికా, ఆసియాకు పారిపోయారు. దాదాపు 1,900 ఏళ్ల పాటు యూదులు తమ సొంత గడ్డకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా యూరప్‌తో పాటు ఇతర దేశాల్లో మైనారిటీలుగా జీవించారు.
ఒట్టోమాన్ నుంచి బ్రిటన్‌కు
క్రీస్తూ శకం 1516లో ఒట్టోమాన్ పాలకులు ఇజ్రాయెల్-పాలస్తీనా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 400 ఏళ్ల పాటు వీళ్లు ఆ ప్రాంతాన్ని పాలించారు. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో 1917లో బ్రిటిష్ సైన్యం ఒట్టోమన్లను ఓడించి ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. దీన్నే 'బ్రిటిష్ మాండేట్ ఆఫ్ పాలస్తీనా' అని పిలుస్తారు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూదులు పెద్ద ఎత్తున పాలస్తీనాకు వలస రావడం ప్రారంభించారు. అప్పటికే అక్కడ అరబ్బులు స్థిరపడిపోయారు. దీంతో యూదులు, స్థానిక అరబ్బుల మధ్య ఎక్కువగా ఘర్షణలు, అల్లర్లు జరుగుతుండేవి.
హిట్లర్ ఊచకోత
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో (1939-1945) హిట్లర్ నేతృత్వంలోని నాజీలు సుమారు 60 లక్షల మంది యూదులను ఊచకోత కోశారు. ఈ దారుణమైన మారణహోమం తర్వాత.. యూదులకు సొంత దేశం కావాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. పాలస్తీనాలో పెరుగుతున్న ఘర్షణలను ఆపలేక.. బ్రిటన్ ఈ సమస్యను ఐక్యరాజ్యసమితికి అప్పగించింది. 1947 నవంబర్‌లో ఐక్యరాజ్యసమితి ఒక తీర్మానాన్ని తీసుకొచ్చింది. పాలస్తీనాను రెండు దేశాలుగా విభజించాలిని నిర్ణయించింది. ఒకటి యూదుల కోసం ఇజ్రాయెల్, మరొకటి అరబ్బుల కోసం పాలస్తీనాను ఇవ్వాలని అనుకుంది. వీళ్ల కేంద్ర ప్రాంతమైన జెరూసలెంను అంతర్జాతీయ నియంత్రణలో ఉంచాలని నిర్ణయించింది. అయితే ఐక్యరాజ్య సమితి నిర్ణయాన్ని యూదులు అంగీకరించారు. కానీ అరబ్బులు తిరస్కరించారు. మొత్తం భూభాగం అరబ్బులకే చెందాలని డిమాండ్ చేశారు.
అరబ్ దేశాలపై పోరాటం
చివరికి 1948, మే 14న యూదుల నాయకుడు డేవిడ్ బెన్-గురియన్ ఇజ్రాయెల్‌ను స్వంతంత్ర దేశంగా ప్రకటించారు. దీంతో ఇజ్రాయెల్ దేశం అధికారికంగా ఏర్పడింది. ఇది ఏర్పడిన మరుసటి రోజే దీన్ని వ్యతిరేకిస్తూ ఐదు అరబ్ దేశాలు (ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్, లెబనాన్) ఇజ్రాయెల్‌పై దాడి చేశాయి. సుమారు ఒక సంవత్సరం పాటు జరిగిన ఈ యుద్ధంలో ఈ దేశాలపై ఇజ్రాయెల్ విరోచితంగా పోరాడి విజయం సాధించింది. దీంతో ఐక్యరాజ్యసమితి కేటాయించిన దానికంటే 60 శాతం ఎక్కువ భూభాగాన్ని ఇజ్రాయెల్ తమ ఆధీనంలోకి తెచ్చుకుంది. మరోవైపు అమెరికా, సోవియట్ యూనియన్ కూడా ఇజ్రాయెల్‌ను అధికారిక దేశంగా గుర్తించాయి. 1949 మే 11న ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితిలో 59వ సభ్యదేశంగా చేరింది.
1956లో ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దెల్ నాసర్.. సూయజ్ కాలువను జాతీయం చేయడంతో మళ్లీ గొడవ మొదలైంది. ఇజ్రాయెల్, బ్రిటన్, ఫ్రాన్స్ కలిసి ఈజిప్ట్‌పై దాడి చేశాయి. అమెరికా, సోవియట్ యూనియన్ ఒత్తిడి వల్ల ఇజ్రాయెల్ వెనక్కి తగ్గింది. కానీ ఈ యుద్ధంతో ఇజ్రాయెల్ సైనిక శక్తి ప్రపంచానికి తెలిసింది. ఇక1967లో ఈజిప్ట్, సిరియా, జోర్డాన్ దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయని తెలుసుకున్న ఇజ్రాయెల్ ముందస్తుగానే వాటిపై మెరుపు దాడి చేసింది. ఈ దేశాల నుంచి పలు ప్రాంతాలను కూడా స్వాధీనం చేసుకుంది.
ఆ తర్వాత తాము పోగొట్టుకున్న భూభాగాలను తిరిగి పొందడానికి ఈజిప్ట్, సిరియా దేశాలు 1973లో యూదుల పవిత్ర రోజైన 'యోమ్ కిప్పుర్' నాడు ఇజ్రాయెల్‌పై ఆకస్మిక దాడి చేశాయి. ప్రారంభంలో ఇజ్రాయెల్ తీవ్రంగా నష్టపోయినప్పటికీ.. అమెరికా సహాయంతో తిరిగి పుంజుకుంది. చివరకు యుద్ధం ఆగిపోగా ఇరుపక్షాల మధ్య శాంతి చర్చలకు దారి పడింది. 1979లో ఈజిప్ట్ , 1994లో జోర్డాన్ ఇజ్రాయెల్‌తో శాంతి ఒప్పందాలు చేసుకున్నాయి.
2005లో అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఏరియల్ షారోన్ నేతృత్వంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం.. గాజా నుంచి పూర్తిగా విడిపోవాలని నిర్ణయించుకుంది. తమ సైన్యాన్ని, గాజాలో నివసిస్తున్న సుమారు 9,000 మంది యూదు సెటిలర్లను బలవంతంగా ఖాళీ చేయించి వెనక్కి పిలిపించుకుంది. 2007లో గాజాలో అంతర్గత పోరు జరిగింది. ఇందులో హమాస్ గ్రూపు.. పాలస్తీనా అథారిటీని (ఫతా పార్టీ) వెళ్లగొట్టి గాజాను పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకుంది. దీంతో పాలస్తీనా భూభాగం రాజకీయంగా రెండు ముక్కలుగా విడిపోయింది. ఇందులో వెస్ట్ బ్యాంక్.. ఫతా పార్టీ ఆధీనంలో ఉండగా. గాజా.. హమాస్ ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత హమాస్, ఇజ్రాయెల్ మధ్య గొడవలు జరుగుతూనే ఉండేవి.
2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఘటన జరిగింది. హమాస్ ఒక్కసారిగా ఇజ్రాయెల్‌పై మెరుపు దాడి చేసి వందలాది మందిని చంపిది. అనేకమందిని బందీలుగా తీసుకెళ్లింది. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ గాజాపై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించింది. ఈ యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే హమాస్‌కు ఇరాన్, లెబనాన్ (హెజ్‌బొల్లా), యెమెన్ (హౌతీలు) సపోర్ట్ ఇస్తున్నాయనే కారణంతో ఇజ్రాయెల్ కూడా ఈ దేశాలపై దాడులు చేస్తోంది. అందుకే ఇరాన్‌పై అమెరికా మొదలుపెట్టిన యుద్ధంలో ఇజ్రాయెల్ కూడా తోడయ్యింది. తాజాగా కాల్పుల విరమణ జరిగినప్పటికీ లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ చిన్న దేశమైనప్పటికీ సాంకేతికంగా, రక్షణ పరంగా ఎంతో అభివృద్ధి సాధించింది. తమ జోలికి వచ్చే దేశాలపై, గ్రూపులపై పోరాడుతూనే ఉంది.
Follow Us