Danger: 11,000 మందిని బలిగొన్న ప్రమాదకరమైన వైరస్.. 101 పాజిటివ్ కేసులతో తిరిగొచ్చింది!

ప్రపంచాన్ని వణికించిన అత్యంత ప్రమాదకరమైన 'ఎబోలా వైరస్' (Ebola Virus) మరోసారి విజృంభిస్తోంది. దాదాపు 12 ఏళ్ల క్రితం వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ ప్రాణాంతక వైరస్, ఇప్పుడు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) లో మళ్లీ కలకలం రేపుతోంది.

New Update
FotoJet (1)

Ebola Virus Crisis

Ebola Virus Crisis :  ప్రపంచాన్ని వణికించిన అత్యంత ప్రమాదకరమైన 'ఎబోలా వైరస్' (Ebola Virus) మరోసారి విజృంభిస్తోంది. దాదాపు 12 ఏళ్ల క్రితం వేలాది మంది ప్రాణాలను బలిగొన్న ఈ ప్రాణాంతక వైరస్, ఇప్పుడు డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) లో మళ్లీ కలకలం రేపుతోంది. సాధారణ జ్వరం, ఒళ్లు నొప్పుల వంటి లక్షణాలతో ప్రారంభమయ్యే ఈ వ్యాధి, క్రమంగా తీవ్రరూపం దాల్చి రోగి మరణానికి దారితీస్తోంది. కాంగోలో ప్రస్తుతం ఈ వైరస్ కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

ప్రస్తుత పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ హెచ్చరికలు జారీ చేసింది. కాంగోలో ఇప్పటివరకు 900కు పైగా అనుమానిత కేసులు వెలుగుచూడగా, అందులో 101 ఎబోలా కేసులు అధికారికంగా నిర్ధారణ అయ్యాయి. ముఖ్యంగా కాంగోలోని 'ఇతురి' ప్రాంతంలో ఈ వైరస్ ప్రభావం అత్యధికంగా ఉంది. సుమారు 50 లక్షల జనాభా ఉన్న ఈ ప్రాంతం ఇప్పటికే అంతర్గత హింస, తీవ్రమైన మానవీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఇక్కడ ప్రతి ఐదుగురిలో ఒకరు ఇళ్లను వదిలి వలస వెళ్లగా, ప్రతి నలుగురిలో ఒకరికి అత్యవసర సహాయం అవసరమైన పరిస్థితులు ఉన్నాయి.

ఈ ప్రాంతంలో కొనసాగుతున్న సాయుధ ఘర్షణలు, అశాంతి కారణంగా బాధితులకు వైద్యం అందించడం ఆరోగ్య సిబ్బందికి ప్రాణసంకటంగా మారింది. భద్రత లేకపోవడంతో చాలా మంది ఆరోగ్య కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఆ ప్రాంతాన్ని విడిచి పారిపోతున్నారు. ఫలితంగా వైరస్ సోకిన రోగులను గుర్తించడం, వారిని కలిసిన వారిని (Contact Tracing) ట్రేస్ చేయడం అత్యంత కష్టతరంగా మారింది. సరైన సమయానికి చికిత్స అందకపోవడం వల్ల సంక్రమణ వేగంగా విస్తరిస్తోంది. పరిస్థితులు చేయిదాటిపోతుండటంతో, డబ్ల్యూహెచ్‌ఓ ఈ ఎబోలా వ్యాప్తిని అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా (PHEIC) ప్రకటించింది.

ఎబోలా అనేది అడవి జంతువుల (ముఖ్యంగా గబ్బిలాలు, కోతులు) నుండి మనుషులకు వ్యాపించే ఒక ప్రమాదకరమైన జూనోటిక్ వైరస్. బారిన పడిన రోగి యొక్క రక్తం, చెమట లేదా ఇతర శారీరక ద్రవాల ద్వారా ఇది ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాప్తి చెందుతుంది. గతంలో 2014-2016 మధ్య కాలంలో ఈ వైరస్ పశ్చిమ ఆఫ్రికాలో సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. అప్పట్లో దాదాపు 28,000 మందికి పైగా దీని బారిన పడగా, 11,000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ అదే వైరస్ కోరలు చాస్తుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు